Off The Record: తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఆ కేంద్ర మంత్రిని కలవడం మీద మెల్లిగా రచ్చ మొదలవుతోందా? ఎవరికో సాగిలపడటానికే, ఎవరో బడా పారిశ్రామికవేత్తకు మేలు చేయడానికే వాళ్ళ కట్టగట్టుకుని కేంద్ర మంత్రిని కలిశారన్న ప్రచారంలో నిజమెంత? ఏంటా మిలాఖత్, అండ్ ములాఖత్ పాలిటిక్స్? ఎంపీలు కేంద్ర మంత్రిని కలిస్తే రచ్చ అవ్వాల్సిన అవసరం ఏముంది? బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ ఏంటి?
Read Also: Yezdi Roadster 2025: 6-స్పీడ్ గేర్‌బాక్స్, 334cc సింగిల్-సిలిండర్‌తో కొత్త యెజ్డి రోడ్‌స్టర్ విడుదల!
మొదటి దానికి మొగుడు లేడుగానీ.. కడదానికి కల్యాణం అంట అన్నది సామెత. ఇప్పుడు ఏపీ టీడీపీ ఎంపీలు కూడా ఇదే వరసలో ఉన్నట్టు కనిపిస్తోందంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇటీవల ఢిల్లీలో కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామిని కలిసి నేతలు వినతి పత్రం ఇచ్చారు. ఉత్తరాంధ్రలో పారిశ్రామిక పెట్టుబడులు, స్టీల్ ప్లాంట్ ఉన్నతికి కేంద్రం చేయూత లాంటి అంశాలను ఆయనతో చర్చించామని, కేంద్రం సానుకూలంగా ఉందని బయటికి వచ్చాక ఘనంగా ప్రకటించుకున్నారు. ఏం, బాగానే ఉంది కదా?.. అందులో ఆక్షేపించాల్సింది ఏముంది? మరీ.. రంధ్రాన్వేషణ చేయడం కాకపోతేనూ.. అంటారా? ఆగండాగండి. అక్కడే ఉందట అసలు ట్విస్ట్. ప్రతిపక్షానికి అది బ్రహ్మాస్త్రం కాబోతోందని కూడా చెప్పుకుంటున్నారు. ఇంతకీ మేటర్ ఏంటంటే.. టీడీపీ ఎంపీలు కేంద్ర ఉక్కు మంత్రిని కలవడం, వినతి పత్రం ఇవ్వడం కరెక్టే. కానీ.. ఆ పత్రం దేనికి సంబంధించినదన్న దగ్గరే అనుమానాలు వస్తున్నాయట. ఈ భేటీ వెనక హిడెన్ అజెండా ఉందంటూ… రిటైర్డ్ ఐఎఎస్ అధికారి EAS శర్మ బాంబ్ పేల్చడం కలకలం రేపుతోంది. ఈ మేరకు ఆయన విడుదల చేసిన బహిరంగ లేఖ కొత్త చర్చకు కారణం అయింది. దీంతో కొందరు ఎంపీలు మాత్రమే హాజరైన సమావేశంలో అసలు ఏం జరిగి ఉంటుందన్న ఆరాలు పెరిగిపోతున్నాయి.
Read Also: YS Jagan: జడ్పీటీసీ ఉప ఎన్నికలు రద్దు చేయాలి.. మాజీ సీఎం వైఎస్ జగన్ సంచలన ట్వీట్..
అయితే, ఎంపీలు స్టీల్ ప్లాంట్ కోసం విన్నపాలు చేసింది నిజమేగానీ.. అది వైజాగ్ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ కోసం కాదన్న సమాచారం విశాఖలో పొలిటికల్ ప్రకంపనలు పుట్టిస్తోంది. అమ్మనీ.. వీళ్ళంతా కేంద్ర ఉక్కు మంత్రిని మీటైంది ఇందుకా అంటూ నోళ్ళు వెళ్ళబెడుతున్నారట ఇంకొందరు. విశాఖ ఉక్కు అన్నది కేవలం ఒక ఫ్యాక్టరీ కాదు. అది ఆంధ్ర ప్రజల సెంటిమెంట్. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అన్న నినాదంతో సాధించుకున్న కర్మాగారం. ఆసియాలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్. 26వేల ఎకరాల భూములు, 30వేల మంది కార్మికులు, ఉద్యోగులతో కళకళలాడిన పరిశ్రమ. ఇప్పుడా వైభవం దశలవారీగా కనుమరుగవుతోంది. శాశ్వత గనులు లేని కారణంగా వచ్చిన లాభాలన్నీ రా మెటీరియల్ కొనుగోళ్ళకే సరిపోతుండటం కారణంగా నష్టాలు మొదలయ్యాయి. దీన్ని సాకుగా చూపి ప్రయివేటీకరణ కత్తి ఝుళిపించింది కేంద్రం.
Read Also: CM Revath Reddy : వచ్చే 72 గంటలు అలెర్ట్‌గా ఉండాలని ఆదేశాలు
నాలుగేళ్ళకుపైగా కార్మిక పోరాటం, రాజకీయ పక్షాల ఆందోళనలతో ప్రైవేటీకరణ వాయిదా పడుతూ వస్తోంది. గత ఎన్నికల్లో విశాఖ ఉక్కు పరిరక్షణ అజెండాతో వెళ్ళింది కూటమి. అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన ప్రయత్నాలు ఫలించి కేంద్రం వెనక్కి తగ్గింది. స్వయంగా ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి రెండు పర్యాయాలు ప్లాంట్ విజిట్ చేయడంతో పాటు భారీగా నిధులు విడుదల చేసేందుకు సహకరించారు. మూడవ బ్లాస్ట్ ఫర్నేస్ ప్రారంభించడం ద్వారా 100శాతం ఉత్పత్తి లక్ష్యంతో పనిచేస్తోంది విశాఖ ఉక్కు. అదే సమయంలో ఆర్ధిక భారాన్ని తగ్గించుకునేందుకు కాంట్రాక్ట్ ఉద్యోగుల తొలగింపు, సీనియర్లను వీఆర్ఎస్ పేరుతో ఇళ్ళకు పంపించడంలాంటివి ప్రణాళికా బద్ధంగా జరుగుతున్నాయి. కానీ, ఇవన్నీ తాత్కాలిక ఉపశమనాలే. విశాఖ స్టీల్ ప్లాంట్ శాశ్వతంగా నిలబడాలంటే సొంత గనులు కావాలి. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో విలీనం చేయడం కీలకమని రాజకీయ పక్షాలు, కార్మిక సంఘాలు భావిస్తున్నాయి. సెయిల్‌లో మెర్జర్ ఇప్పటికిప్పుడు సాధ్యమయ్యే పనికానందుక ‘క్యాప్టివ్ మైన్స్’ కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలని మేథావులు, ప్రజాసంఘాలు పోరు పెడుతున్నాయి.
Read Also: Justice : పార్కింగ్ కోసం 17 ఏళ్లు… చివరికి న్యాయం ఇలా..!
ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం ఎంపీలు కేంద్ర మంత్రిని కలిసి స్టీల్ ప్లాంట్ గురించి చర్చించారని తెలియడంతో.. పాజిటివ్ వైబ్ వస్తుందని భావించారు అంతా. కానీ, లోగుట్టు వేరే ఉందన్న ప్రచారంతో అంతా అవాక్కవుతున్నారట. హన్నన్న, ఇంత జరిగిందా?.. అని నోరెళ్ళబెట్టేస్తున్నారట. ప్రస్తుతం కార్మిక వర్గాల్లో వినిపిస్తున్న గుసగుసల ప్రకారం చూస్తే.. టీడీపీ ఎంపీలు కుమారస్వామిని కలిసింది మునిగిపోతున్న విశాఖ ఉక్కు కోసం కాదట. త్వరలో అనకాపల్లి జిల్లాలో మిట్టల్ గ్రూప్ ఏర్పాటు చేయబోయే స్టీల్ ప్లాంట్ కోసమన్నది వాళ్ళ డౌట్. పాయకరావు పేట నియోజకవర్గ పరిధిలో ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ ఫేజ్ 1 కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. భారీ పెట్టుబడులను ఆకర్షించే పాలసీలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రాయితీలు ఇచ్చి సహకరిస్తోంది. కొత్తగా పెట్టబోయేది ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ కావడంతో పారిశ్రామిక అభివృద్ధి గేరప్ అవుతుందనేది యదార్ధం. అయితే, టీడీపీ ఎంపీలు ప్రభుత్వ సంస్థను కాదని, ఇటీవల జరిగిన మీటింగ్‌లో మిట్టల్ స్టీల్స్‌కు అవసరమైన క్యాప్టివ్ మైన్స్, ఐరన్ ఓర్ స్లర్రీ పైప్ లైన్ నిర్మాణం కోసం సహకరించమని కేంద్రాన్ని కోరారన్న ప్రచారం కలకలం రేపుతోంది.
Read Also: Off The Record : తెలంగాణ కాంగ్రెస్ ఏడాదిన్నరగా అతీగతీ లేని భర్తీ
ప్రభుత్వ రంగంలో వున్న విశాఖ ఉక్కు క్యాప్టివ్ మైన్స్ లేక కునారిల్లిపోతుంటే ఎంపీలకు చీమకుట్టినట్టైనా లేదని.. అదే, ప్రైవేట్ సంస్ధల కోసం సాగిలపడి మరీ లాబీయింగ్ చేస్తున్నారని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. ప్రయివేట్ ప్రయత్నాలను పక్కన బెట్టి విశాఖ ఉక్కు పరిరక్షణకు నిలబడకపోతే నిలదీస్తామని హెచ్చరిస్తున్నాయి. మొత్తం మీద కుమారస్వామికి తెలుగుదేశం ఎంపీలు ఇచ్చిన లేఖేంటో.. చెవిలో చెప్పిందేంటో.. కచ్చితంగా తెలియదుగానీ.. అదంతా మిట్టల్ స్టీల్ కోసం మంత్రాంగం అనేది మాత్రం విస్తృతంగా ప్రచారంలోకి వచ్చేసింది. దీంతో అనుమానాలను నివృత్తి చేయడానికైన టీడీపీ ఎంపీలు బహిరంగ ప్రకటన చేయాల్సి ఉంది. వాళ్ళు గనక అలాగే సైలెంట్‌గా ఉంటే.. మిట్టల్ కోసమే ఎంపీలు పనిచేస్తున్నారన్న ప్రచారం జనంలోకి విపరీతంగా వెళ్లిపోయి అంతిమంగా తెలుగుదేశం పార్టీకే నష్టంం కలగవచ్చంటున్నారు రాజకీయ పరిశీలకులు. అధికార పార్టీ లోక్‌సభ సభ్యుల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి మరి.