గట్టిగా ఉన్నామని అనుకున్నచోట టీడీపీ నేతల లెక్కలు వర్కవుట్ కావడం లేదా? అంతా ఆరంభ శూరత్వమేనా? బలహీనతలు తెలిసీ నేల విడిచి సాము చేస్తున్నారా? కేడర్ వద్దని వారించినా పంతాలకు పోయి.. ఎందుకు పరాజయాలను మూట కట్టుకుంటున్నారు? అది ఎక్కడో.. ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
విశాఖలో కీలక అంశాల్లో టీడీపీ అభాసుపాలు!
రాజకీయ చైతన్యానికి విశాఖ వేదిక. ఇక్కడ టీడీపీ కూడా గట్టిగానే ఉంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో సిటీలోని నాలుగు ఎమ్మెల్యేల స్థానాల్లో టీడీపీ ఎమ్మెల్యేలే గెలిచారు. ఇటీవల గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 98 డివిజన్లకుగాను 30చోట్ల టీడీపీ కార్పొరేటర్లదే విజయం. రాష్ట్రంలో మిగతా ప్రాంతాల్లో టీడీపీకి నష్టం జరిగినా.. ఇక్కడ కేడర్.. ఓటు బ్యాంక్ గట్టిగానే ఉందని చెప్పుకొన్నారు. అలాంటి విశాఖలో పక్కా వ్యూహాలతో వెళ్లాల్సిన టీడీపీ కీలక అంశాల్లో అభాసుపాలవుతుందనే అభిప్రాయం తెలుగు తమ్ముళ్లలోనే ఉంది. అదే ఇప్పుడు పార్టీ వర్గాలను కలవర పెడుతోందట.
మేయర్, స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో గతి తప్పిన దూకుడు!
టీడీపీ హైకమాండ్ నుంచి వస్తోన్న ఆదేశాలను కేడర్ నెత్తిన రుద్దేసి సీనియర్లు సైడైపోతున్నారట. క్షేత్రస్థాయిలోని వాస్తవ పరిస్థితులు.. ఎదురయ్యే ఇబ్బందులు అస్సలు పట్టించుకోవడం లేదనే చర్చ విశాఖ టీడీపీలో ఉంది. కీలక వ్యవహారాల్లో అనాలోచితంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని అభిప్రాయ పడుతున్నాయి శ్రేణులు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌తోపాటు స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ప్రదర్శించిన దూకుడు టీడీపీని నవ్వులుపాలు చేసిందనే అభిప్రాయం పార్టీ కార్పొరేటర్లలో ఉందట.
స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఆఖరిలో అస్త్రాలు వదిలేసింది!
మేయర్ ఎన్నిక సమయంలో సొంతబలంతోపాటు కలిసి వచ్చే ఇతర పార్టీల కార్పొరేటర్ల మద్దతు కోసం తెరవెనక గట్టి ప్రయత్నాలే చేసింది టీడీపీ. కానీ.. అధికారపార్టీ ఎత్తుగడల ముందు వారి పప్పులు ఉడక లేదు. మేయర్ ఎన్నికలో ఆఖరి నిముషం వరకు పోటీలో ఉండి.. ఆ తర్వాత పక్కకు తప్పుకుంది తెలుగుదేశం. బలం లేకుండా పోటీ చేసి పరువు తీయొద్దని అప్పట్లో ఓ ఎమ్మెల్యే గట్టిగా వారించడంతో ఉన్నంతలో హుందాగా బయటపడింది. ఇప్పుడు జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో పోటీకి సిద్ధపడి ఆఖరి నిముషంలో అస్త్రాలు వదిలేసింది.
టీడీపీ సీనియర్ కార్పొరేటర్లలో అసహనం
10మంది సభ్యులతో స్థాయిసంఘం నియామకం కోసం ఎన్నికలు నిర్వహించగా టీడీపీ నామినేషన్లు దాఖలు చేసింది. జోనల్ విధానం ద్వారా ఎన్నికలు జరిగితే కనీసం 4 స్థానాలు తమకే దక్కుతాయని లెక్కలు వేసుకున్నారు నాయకులు. కొన్నిజోన్లలో టీడీపీ కార్పొరేటర్లు ఐదారుగురు ఉండటంతో గెలుస్తారని అనుకున్నారట. కానీ, అప్పటికే టీడీపీ కార్పొరేటర్లలో కొందరు అధికారపార్టీకి టచ్‌లోకి వెళ్లారు. పైగా ఎక్స్‌అఫీషియో బలం అధికారపార్టీకే ఎక్కువ. ఇంతలో జోనల్ విధానంలో కాకుండా గత సంప్రదాయం ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో పరాజయం తప్పదని భావించి ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది టీడీపీ. ఈ రెండు ఎన్నికల అనుభవాలు టీడీపీ సీనియర్ కార్పొరేటర్లకు అసహనాన్ని కలిగిస్తున్నాయి.
లెక్కలేవీ వర్కవుట్ కావడం లేదు!
విశాఖలో టీడీపీ తొందరపడుతుందో.. ముందు వెనకా ఆలోచించడం లేదో కానీ.. వ్యూహాలు తప్పుతున్నాయనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఉంది. వేసుకుంటున్న లెక్కలేవీ వర్కవుట్ కావడం లేదు. ఆరంభంలో శూరత్వం.. చివరలో అస్త్ర సన్యాసం. వ్యూహం ఫలిస్తే పక్కాగా ప్లాన్ చేశారని అనుకోవచ్చు. ఫెయిల్ అయితే వ్యూహంలో లోపం ఉంటుంది. ఇక్కడ మాత్రం అనాలోచిత ప్లాన్‌లతో చేతులు కాల్చుకుంటున్నారు తెలుగుదేశం నాయకులు.