కోల్‌బెల్ట్ ఏరియాలో ఆయన పట్టున్న నాయకుడు. వర్గపోరు పడక అప్పట్లో ఉన్న సంఘానికి గుడ్‌బై చెప్పి జాతీయ యూనియన్‌లో చేరారు. మళ్లీ ఏమైందో ఏమో.. సొంత గూటికి తిరిగొచ్చేశారు. ఆయన రాక ఒక సంచలనమైతే.. రీఎంట్రీ వల్ల లాభమా.. నష్టమా అనే చర్చ కూడా మొదలైంది. ఇంతకీ ఎవరా నాయకుడు
మల్లయ్య రీఎంట్రీతో సింగరేణిలో చర్చ!
కెంగర్ల మల్లయ్య. సింగరేణి విస్తరించిన ప్రాంతాల్లో పరిచయం అక్కర్లేని నాయకుడు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం TBGKS వ్యవస్థాపకుల్లో ఒకరు. అయితే యూనియన్‌లో వర్గపోరు కారణంగా సొంత గూటికి గుడ్‌బై చెప్పి.. బీజేపీ కండువా కప్పేసుకున్నారు. బీజేపీ అనుబంధ కార్మిక సంఘం BMSలో కీలక పదవి కూడా వరించింది. ఇంతలో ఏమైందో ఏమో.. కాషాయ కండువా తీసేసి.. మరోసారి గులాబీ గూటికి చేరారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో కారెక్కేశారు. మల్లయ్య రీఎంట్రీపై సింగరేణిలో వాడీవేడీ చర్చ మొదలైంది. గతంలో ఎవరితో అయితే ఆయనకు పడలేదో.. వారు సంఘంలో అలాగే ఉన్నారు. అప్పడు పొసగనిది ఇప్పుడు దోస్తీ సాధ్యమా అన్నది ప్రశ్నగా ఉంది.
ఎమ్మెల్యే బాల్క సుమన్ మంత్రాంగం నడిపారా?
TBGKS అధ్యక్ష కార్యదర్శులుగా వెంకట్రావు, మిర్యాల రాజిరెడ్డి ఉన్నారు. మల్లయ్యకు రాజిరెడ్డికి పడేది కాదు. ఇప్పుడు వెంకట్రావు, రాజిరెడ్డిలకు సయోధ్య లేదట. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే బాల్క సుమన్ మంత్రాంగం నడిపి.. మల్లయ్య తిరిగి సొంత గూటికి వచ్చేలా ఒప్పించారట. యూనియన్‌లో ఇప్పుడున్నవారి వల్లే నష్టాలు ఎక్కువగా ఉన్నాయని సుమన్ గుర్తించినట్టు కోల్‌బెల్ట్‌లో చెవులు కొరుక్కుంటున్నారు.
మల్లయ్యకు పెద్ద పదవే ఆఫర్ చేశారా?
మల్లయ్య రాకతో ఉలిక్కిపడ్డ కొందరు యూనియన్ నాయకులు.. టీఆర్‌ఎస్‌లో తమకు అనుకూలమైన నేత దగ్గరకు వెళ్లి పంచాయితీ పెట్టారట. అయితే ఈటల రాజేందర్ ఎపిసోడ్‌తో రాజకీయం మారిందని చెబుతున్నారు. బీసీ సామాజికవర్గానికి చెందిన మల్లయ్య బీజేపీలో ఉంటే ఉపఎన్నికలో ప్రమాదమని గ్రహించే వేగంగా పావులు కదిపారన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఈ క్రమంలో మల్లయ్యకు పెద్ద పదవే ఆఫర్ చేసినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. మల్లయ్య ప్రాధాన్యాన్ని గుర్తించారా లేక ఆయన బీసీ అని మళ్లీ రప్పించారా అన్నది చర్చగానే ఉంది. పార్టీ పరంగా ఈ చేరిక ఏమేరకు వర్కవుట్ అవుతుందో కానీ.. మల్లయ్య రాక TBGKSకు లాభమా నష్టమా అని మరికొందరు విశ్లేషిస్తున్నారు.
టీబీజీకేఎస్‌లో మార్పులు ఉంటాయా?
మల్లయ్యకు TBGKS అధ్యక్ష పదవి కట్టబెడితే.. ఇప్పటికే ప్రెసిడెంట్‌గా ఉన్న వెంకట్రావు పరిస్థితి ఏంటి? మళ్లీ గ్రూప్‌వార్ మొదలవుతుందా? వెంకట్రావును కార్మిక సంఘం నుంచి తప్పించి పార్టీలోకి తీసుకునే ఛాన్స్ ఉందా? మల్లయ్య యూనియన్ సారథయితే ఏ మేరకు కలిసి వస్తుంది అని లెక్కలతో కుస్తీ పడుతున్నారట నేతలు. కోల్‌బెల్ట్ ఏరియాలో గుర్తింపు సంఘం గడువు ముగిసింది. ఎన్నికలు నిర్వహించాలి. అందుకే మల్లయ్య రీఎంట్రీతో TBGKSలో జరిగే మార్పులు చేర్పులపై సింగరేణి గనుల్లో ఉత్కంఠ రేపుతోంది. ఎవరిని ఎలా బుజ్జగిస్తారు. ఎవరికి పట్టం కడతారన్నది ఆసక్తిగా చర్చించుకుంటున్నారు కార్మికులు. మరి.. రానున్న రోజుల్లో సింగరేణి రాజకీయం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.