అవన్నీ హైదరాబాద్ శివారు మున్సిపాలిటీలు.. మున్సిపల్ కార్పొరేషన్. ప్రజాప్రతినిధులు అక్కడ పగ్గాలు చేపట్టిన ఏడాదికే గిల్లికజ్జాలు. వ్యూహం లోపిస్తుందో.. లేక ఒకరిపై ఒకరు పైచెయ్యి సాధించాలనే పట్టుదలో కానీ నిత్యం గొడవలే. శ్రుతి మించి రోడ్డుకెక్కుతున్నారు.
మీర్‌పేట్‌లో మేయర్ భర్తదే పెత్తనం.. సెటిల్మెంట్లు!
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఏడాదిగా చర్చల్లో ఉంటోంది. ఇప్పుడు మేయర్ దీప భర్త దీప్లాల్ తీరుతో ఇంకోసారి అక్కడి యవ్వారాలు హాట్ టాపిక్‌గా మారాయి. మీర్‌పేట్‌లో దీప మేయరైనా.. పెత్తనం మొత్తం ఆమె భర్తదే. సమస్యల పరిష్కారం కోసం వచ్చే సాధారణ జనమైనా.. కార్పొరేటర్లయినా ఆయన ముందు ఒకటే. దీప్లాల్ చెప్పిందే ఫైనల్. ఏకంగా మేయర్ కుర్చీలో కూర్చునే సెటిల్‌మెంట్లు చేయడం ఆయన ప్రత్యేకత. సాక్షాత్తూ పురపాలక మంత్రి ఆదేశించినా.. వాటిని పట్టించుకోకుండా సొంత విషయాలు చక్కబెట్టుకోవడానికి ప్రాధాన్యం ఇస్తారట. దానికి సంబంధించి వెలుగులోకి వచ్చిన తాజా గొడవ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టీఆర్‌ఎస్‌లోనూ మేయర్ భర్త తీరు చర్చకు దారితీసింది.
కాంగ్రెస్ ఛైర్‌పర్సన్లు ఉన్నచోట్ల అధికారులు సహాయ నిరాకరణ?
టీఆర్‌ఎస్ చేతిలో ఉన్న మీర్‌పేటలో సెటిల్‌మెంట్ల పంచాయితీ అలా ఉంటే.. రంగారెడ్డిజిల్లాలోనే ఉన్న ఆదిభట్ల, తుర్కయంజాల్ మున్సిపాలిటీలలో రగడ మరో ఎత్తు. ఈ రెండు మున్సిపాలిటీలలో కాంగ్రెస్ ఛైర్‌పర్సన్లు ఉన్నారు. దీంతో ఈ పురపాలక సంఘాలల్లో పెత్తనం.. ఎన్నికల్లో గెలిచిన వారికంటే.. అధికార పార్టీ నేతలదే అన్నది ఓపెన్ సీక్రెట్. ఛైర్ పర్సన్ చెప్పిన విషయాలను మున్సిపల్ అధికారులు పట్టించుకోరట. ఈ అంశంపైనే అధికారుల తీరును నిరసిస్తూ ఛైర్‌పర్సన్లు ధర్నాలకు దిగిన ఉదంతాలు అనేకం ఉన్నాయి.
ఆదిభట్లలో కమిషనర్ తీరుపై ఛైర్‌పర్సన్ నిరసన
మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా మొక్కలు నాటాలని ఆదిభట్ల మున్సిపల్ కమీషనర్ సర్క్యులర్ ఇచ్చారు. ఆ విషయం కాంగ్రెస్ పార్టీకి చెందిన ఛైర్‌పర్సన్ హార్ధిక్ గౌడ్‌కు తెలియదట. దీంతో ఆమె కమిషనర్‌ను పట్టుకుని.. మీరు టీఆర్‌ఎస్ కార్యకర్తా? లేక ప్రభుత్వ అధికారా అని సర్రున లేచారు. కమిషనర్ ఛాంబర్లో కింద కూర్చుని నిరసన తెలియజేశారు. ఆ మధ్య కమిషనర్ తీరును నిరసిస్తూ కాంగ్రెస్ ఎంపీ వచ్చి రోడ్డుపై భైఠాయించిన పరిస్థితి. ఇక ఇదే మున్సిపాలిటీలో ఛైర్‌పర్సన్ భర్తదే పెత్తనం అనే టాక్ కూడా ఉంది. ఛైర్‌పర్సన్ భర్తకు తెలియకుండా ఏ పనిచేసినా ఆయన కోపాగ్నికి బలి కావాల్సిందేనని చెవులు కొరుక్కుంటారు.
తుర్కయంజాల్‌లో ఛైర్‌పర్సన్, కమిషనర్ల మధ్య నిత్యం రణమే!
తుర్కయంజాల్ మున్సిపాలిటీలోనూ కాంగ్రెస్ ఛైర్‌పర్సనే ఉన్నారు. ఇక్కడ ఛైర్ పర్సన్ అనురాధారెడ్డికి, కమిషనర్‌కు ఎప్పుడూ పడదు. ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు కూడా. అధికారులకు.. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు మధ్య మున్సిపాలిటీలో నిత్యం రణరంగమే. రాజకీయ ఎత్తుగడలు వేయడంలో విఫలం అవుతున్నారో లేక.. వ్యూహాలు లేవో ఏమో.. నేరుగా ఢీకొట్టేందుకు చేస్తున్న పనులు గిల్లికజ్జాలకు దారితీస్తోంది. మరి.. పదవీకాలం ముగిసేలోగా ఈ మూడుచోట్లా రాజకీయాలు.. అధికారులతో రగడలు ఇంకెలాంటి మలుపు తీసుకుంటాయో?