ఆయన ఆ పార్టీకి అధ్యక్షుడై ఏడాదే అయ్యింది. అప్పుడే ఆయన వెనక గోతులు తవ్వుతున్నారా? ఆ గోతుల వెనక ఒకనాటి మిత్రపక్షం ఉందని అనుమానిస్తున్నారా? పార్టీ వర్గాలు ఏమనుకుంటున్నాయి? ఏంటా పార్టీ? ఎవరా నాయకుడు?
సోమును తొలగించి కన్నాకు పగ్గాలు ఇస్తారని ప్రచారం!
సోము వీర్రాజు. ఏపీ బీజేపీకి అధ్యక్షుడై ఏడాది అయ్యింది. ఈ సంవత్సర కాలంలో ఆలయాలపై దాడులు.. అంతర్వేది, దుర్గగుడి రథాలపై ఉద్యమాలు చేశారు. మధ్యలో తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికనూ ఎదుర్కొన్నారు. కోవిడ్ వల్ల కొంత నెమ్మదించినా.. ఈ మధ్యే స్పీడ్ పెంచారు వీర్రాజు. సమయం చిక్కినప్పుడల్లా వైసీపీ కంటే టీడీపీని ఎక్కువ టార్గెట్ చేసేవారు. ఆ రెండు పక్షాల నుంచి పెద్దగా రియాక్షన్ ఉండేది కాదు. కానీ.. ఇటీవల ఏపీ ప్రభుత్వాన్ని అస్థిరపర్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్న వైసీపీ ఆరోపణలు రాజకీయాన్ని హీటెక్కించాయి. సరిగ్గా అదే సమయంలో వీర్రాజును తొలగించి మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు పార్టీ పగ్గాలు అప్పగిస్తారని మీడియాలో కథనాలు వచ్చాయి. ఒక్కసారిగా చర్చ అటువైపు మళ్లింది. వాస్తవానికి వీర్రాజు అధ్యక్షుడైనప్పటి నుంచి ఆయన్ని మార్చేస్తారన్న చర్చ అడపా దడపా జరుగుతూనే ఉంది.
మార్పు ప్రచారం వెనక టీడీపీ ఉందని వీర్రాజు అండ్ కో అనుమానం!
బీజేపీ అధ్యక్షుడైయ్యాక టీడీపీపై తీవ్రస్థాయిలో వీర్రాజు విమర్శలు
బీజేపీపై పట్టు సాధించి.. రాష్ట్రంలో కార్యక్రమాల వేగం పెంచిన సమయంలో వచ్చిన ఈ చర్చ వీర్రాజు అండ్ కోను చికాకు పెట్టినట్టు తెలుస్తోంది. ఈ ప్రచారం వెనక టీడీపీ ఉందని ఆయన బృందం అనుమానిస్తోందట. దీనికి పార్టీలో రకరకాల విశ్లేషణలు చేస్తున్నారు. వీర్రాజుకు మొదటి నుంచీ టీడీపీ అంటే గిట్టదనే అభిప్రాయం ఉంది. టీడీపీ, బీజేపీలు మిత్రపక్షాలుగా ఉన్నప్పుడు కూడా తెలుగుదేశంపై ఆయన ఘాటైన విమర్శలే చేశారు. అస్సలు పడేది కాదు. బీజేపీ అధ్యక్షుడైన తర్వాత కూడా టీడీపైనే ఆయన ఎక్కువగా విరుచుకుపడేవారు. ఇప్పుడు వీర్రాజును తొలగించి.. కన్నా లక్ష్మీనారాయణకు పార్టీ పగ్గాలు అప్పగిస్తారన్న చర్చ వెనక కూడా టీడీపీయే ఉందని సందేహిస్తున్నారట. తొలుత ఇది సొంత పార్టీ నేతల పనే అని అనుమానించారు. వాళ్ల మీద.. వీళ్ల మీద అనుమానపడ్డారు. కన్నాకు అనుకూలంగా ఉన్నవారు ఈ తరహా ప్రచారం చేస్తున్నారని అనుమానించారట. అయితే వీటి వెనక కన్నా వర్గమో.. మరో వర్గమో కాదని పూర్తిస్థాయి నిర్ధారణకు వచ్చారట. అందుకే వీర్రాజు బృందం టీడీపీ వైపే అనుమానంగా చూస్తోందట.
బీజేపీలో చిన్నా చితకా నాయకులను పావులుగా వాడుకుంటున్నారా?
వీర్రాజుపై ఉన్న పాత పగను.. ఈ విధంగా సాధిస్తున్నట్టు బీజేపీ డౌట్!
బీజేపీలో సోము వీర్రాజును డిస్టర్బ్ చేయాలన్నదే టీడీపీ వ్యూహంగా కమలనాథులు సందేహిస్తున్నారట. ఢిల్లీ నాయకత్వం నుంచి ఎలాంటి ఇబ్బంది లేకపోయినా.. పార్టీలో వైరి వర్గాలు కామ్‌గా ఉన్నా.. వీర్రాజును మార్చుతున్నారనే ప్రచారం చేయడం వల్ల సంతోష పడేది టీడీపీ ఒక్కటే అనే లెక్కకు వచ్చారట బీజేపీ నాయకులు. ఈ క్రమంలో బీజేపీలో ఉన్న చిన్నా చితక నాయకులను టీడీపీ పావులుగా ఉపయోగించుకుంటున్నట్టు కాషాయ శిబిరంలో చర్చ జరుగుతోంది. ఈ అంశంపై బీజేపీ కేడర్ క్లారిటీతో లేకపోతే టీడీపీ సూప్‌లో పడి.. డీలా పడే అవకాశం ఉందని.. తెలుగుదేశం లక్ష్యం కూడా అదేనని కాషాయ శిబిరంలో చర్చ సాగిందట. పైగా వీర్రాజుపై ఉన్న పాత పగను.. టీడీపీ నేతలు ఈ విధంగా సాధిస్తున్నారని విశ్లేషిస్తున్నారట. పైకి ఈ అంశాలపై మాట్లాడితే నిజంగానే టీడీపీ ట్రాప్‌లో పడినట్టు అవుతుందని.. దూరంగా ఉండాలని నిర్ణయించారట. మరి.. వీర్రాజు ఈ గండాన్ని ఎలా అధిగమిస్తారో చూడాలి.