అక్కడ అధికార వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు వీధికెక్కాయ్. టీడీపీ నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇవ్వటంపై కొందరు నేతలు బహిరంగంగానే మండిపడుతున్నారు. వైసీపీలో మొదటి నుంచి ఉన్నవారిని విస్మరిస్తున్నారట..దీంతో ఎమ్మెల్యేకు సహకరించేది లేదని అంటున్నారట క్యాడర్. అసలు…ఆ నియోజకవర్గంలో ఏం జరుగుతోంది?
ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గ వైసీపీ వ్యవహారాలు వీధికెక్కాయి. ఎమ్మెల్యే అన్నా రాంబాబు వర్సెస్ ద్వితీయ శ్రేణి నేతలుగా పరిస్ధితి మారిపోయింది. అంతర్గత కుమ్ములాటలు ఎక్కువయ్యాయనే ప్రచారం జరుగుతోంది. సీఎం జగన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఇప్పటి వరకు ప్రారంభించలేదట. ఈవ్యవహారం తేలకుండా గడప దాటనని..గడప గడపకు వెళ్లనని భీష్మించుకు కూర్చున్నారని టాక్. దీంతో అధిష్టానం సీరియస్ అయ్యిందట. రాంబాబు…వైసీపీలో చేరి రాష్ట్రంలోనే సీఎం జగన్ తర్వాత అత్యదిక మెజారిటీతో గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. నియోజకవర్గంలో పరిస్దితులు భిన్నంగా మారిపోయాయని తెలుస్తోంది. ద్వితీయ శ్రేణి నేతలు ఎవరూ ఎమ్మెల్యే మాట వినే పరిస్దితి లేకపోవటంతో సీఎం జగన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని కూడా ఎక్కడా నిర్వహించలేదట. దీనిపై హైకమాండ్ సీరియస్ కావటంతో సీఎంతో మాట్లాడాకే గడపగడపకు వెళ్తానని ఎమ్మెల్యే ప్రకటించటం..ముందు కార్యక్రమం ప్రారంభించాకే వచ్చి మాట్లాడాలని.. అప్పటి వరకూ నో అపాయింట్మెంట్ అని సీఎం జగన్ తేల్చి చెప్పటం జరిగిపోయాయట.
ఇక…సమస్యను పరిష్కరించాలని బాల్‌ను పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్, మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కోర్టులో వేశారు ఎమ్మెల్యే అన్నా రాంబాబు. సమస్యను పరిష్కరించేందుకు రంగంలోకి దిగిన బాలినేని హైదరాబాద్‌లోని తన నివాసంలో గిద్దలూరు నియోజకవర్గ వైసీపీ ముఖ్య నేతలతో సమావేశం ఏర్పాటు చేశారట. నియోజకవర్గంలోని 70 మంది నేతలను బాలినేని పిలిచారు. కార్యక్రమానికి దాదాపు అరవై మంది వరకూ ముఖ్య నేతలు హాజరయ్యారట. ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం వారంతా ఒకే చోట చేరటంతో బాలినేని ఇంటి వద్ద హైడ్రామా నడిచిందట. ఎమ్మెల్యే అనుకూల..ప్రతికూల వర్గాలు బాలినేని ఎదుటే రెండు వర్గాలు వాగ్వాదానికి దిగాయని టాక్. బాలినేని ముందుగా అనుకున్నట్లుగా అందరినీ కూర్చోబెట్టి మాట్లాడకుండా మండలాల వారీగా సమీక్షించారని వినికిడి. అర్దరాత్రి వరకూ సమీక్ష చేశారట. విభేదాలు పక్కన పెట్టి గడపగడపకూ ప్రభుత్వం కార్యక్రమంలో అందరూ పాల్గొనాల్సిందేనని స్పష్టంచేశారట బాలినేని.
ఇక…ఈ సందర్బంగా ఎమ్మెల్యే అన్నా రాంబాబు మొదటి నుంచి వైసీపీలో ఉన్న వారిని కాకుండా తనతో పాటు టీడీపీ నుంచి వచ్చిన వారిని ప్రోత్సహిస్తున్నారని ఫిర్యాదు చేశారట ఎమ్మెల్యే వ్యతిరేక వర్గీయులు. ఎమ్మెల్యే అన్నా రాంబాబు గతంలో టీడీపీలో ఉండి వైసీపీకీ ద్రోహం చేసి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే అశోక్ రెడ్డి అనుచరులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని బాలినేనికి ఫిర్యాదు చేశారట. గిద్దలూరు, బెస్తవారిపేటలో కీలకమైన పదవుల్లో ఉన్న టీడీపీ నుంచి వచ్చిన నేతల పేర్లను ఆయన దృష్టికి తీసుకువచ్చారని తెలుస్తోంది. దీంతో బాలినేని సాయంత్రం ఎమ్మెల్యే రాంబాబుతో పాటు అందరం కూర్చుని పేస్ టు పేస్ మాట్లాడుకుందామంటూ కార్యక్రమం వాయిదా వేశారట. ఎమ్మెల్యే అన్నా రాంబాబు వచ్చిన తర్వాత రాత్రి తొమ్మిది గంటల నుంచి అర్దరాత్రి వరకూ సమావేశం కొనసాగిందని సమాచారం. నియోజకవర్గంలోని ద్వితీయశ్రేణి నేతలు, ఎమ్మెల్యే రాంబాబు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. తనను కించపర్చాలనే ఉద్దేశంతో కొందరు పార్టీలోని ప్రత్యర్థులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని..రాంబాబు ఒకింత ఆవేదన వ్యక్తం చేశారని టాక్. ఓ దశలో ఎమ్మెల్యే మద్దతుదారులు..అసమ్మతి నేతల మధ్య వాగ్వాదం పెరగటంతో బాలినేని సీరియస్ కావటంతో అంతా సైలెంట్ అయ్యారట. దీంతో మండలాల వారిగా నేతలను విడివిడిగా పిలిపించుకుని ఎమ్మెల్యే సమక్షంలోనే సమస్యకు పరిష్కారం చూస్తానని హామీ ఇచ్చారట. గడప గడపకు కార్యక్రమంలో అందరూ పాల్గొనాల్సిందేనని వారికి తేల్చిచెప్పారట బాలినేని.