మునుగోడు ఉపఎన్నిక వేళ స్థానిక టీఆర్‌ఎస్‌లో అసంతృప్తి.. అసమ్మతిని దారికి తెచ్చేందుకు పార్టీ పెద్దలు కృషి చేస్తుంటే.. ఇప్పుడు కీలక నేతల మధ్యే గ్యాప్ వచ్చినట్టు కనిపిస్తోంది. మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ వ్యాఖ్యలతో అది తేటతెల్లం అయ్యిందనేది గులాబీ వర్గాల వాదన. మంత్రి జగదీష్‌రెడ్డిపై మాజీ ఎంపీ చేసిన కామెంట్స్ ప్రస్తుతం టీఆర్ఎస్‌లో హాట్ టాపిక్ అయ్యాయి. మునుగోడు ఉపఎన్నికకు సంబంధించిన పార్టీ కార్యక్రమాలు.. అక్కడి ప్రచారం గురించి తనకు చెప్పడం లేదన్నది బూర నర్సయ్యగౌడ్ ఆగ్రహం. తననే కాదట.. ఇదే నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ను సైతం పట్టించుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. నాలుగు గోడల మధ్య మాట్లాడుకుంటే పోయే అంశాన్ని ఇలా ఓపెన్‌గా మంత్రిని టార్గెట్ చేస్తూ మాజీ ఎంపీ కామెంట్స్ చేయడంతో వాడీవేడీ చర్చ నడుస్తోంది.
సమాచారం ఇవ్వడం లేదంటే.. వాళ్లను పక్కన పెట్టినట్టే కదా అన్నది కొందరు టీఆర్ఎస్ నేతల అభిప్రాయంగా ఉంది. అదే నిజమైతే మాజీ ఎంపీని.. మాజీ ఎమ్మెల్సీని ఎందుకు దూరం పెట్టారన్నది ప్రశ్న. పైగా ఉపఎన్నిక జరిగే మునుగోడులో బీసీ ఓటర్లు ఎక్కువ. అక్కడ బీసీలకు ఛాన్స్ ఇవ్వాలన్నది మాజీ ఎంపీ డిమాండ్. మునుగోడులో టీఆర్ఎస్ సభ కంటే ముందుగానే ఈ స్వరం అందుకున్నారు నర్సయ్యగౌడ్. దాంతో ఆ సభలో అభ్యర్థిని ప్రకటించలేదని అనుకున్నారు. ఇప్పటికీ వడపోతలు జరుగుతూనే ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యే కూసుకంట్లపై పార్టీ కేడర్‌లో వ్యతిరేకత ఉందనే ప్రచారంతో.. బరిలో ఉండేందుకు టీఆర్ఎస్‌లోని బీసీ నేతలు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. వారిలో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్.. మరో నేత కర్నాటి విద్యాసాగర్ ఉన్నారు.
ప్రస్తుతం మునుగోడులో తనకు ఎలాంటి ప్రాధాన్యం దక్కడం లేదన్న ఆవేదనలో ఉన్నారట నర్సయ్య గౌడ్. నియోజకవర్గానికి సంబంధంలేని వ్యక్తులకు పెద్ద పీట వేస్తున్నారని అనుచరుల దగ్గర వాపోతున్నారట. దీనికంతటికీ మంత్రి జగదీష్‌రెడ్డే కారణమని మాజీ ఎంపీ అభిప్రాయపడుతున్నారట. మునుగోడు బీసీ ఓటర్లలో 90 శాతం గౌడ సామాజికవర్గమే అయినప్పటికీ.. ఆ వర్గానికి చెందిన తనను పక్కన పెట్టారనే ఆగ్రహంతో ఉన్నారట. 2019లో భువనగిరిలో ఎంపీగా తిరిగి పోటీ చేసినా.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతిలో ఓడిపోయారు నర్సయ్య గౌడ్. అప్పటి నుంచి పెద్దగా రాజకీయ చర్చల్లో లేరు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నా.. పెద్దగా ఫోకస్ కాలేదు. కానీ.. భూవనగిరి పార్లమెంట్ పరిధిలోనే ఉన్న మునుగోడుకు ఉపఎన్నిక వస్తుంటే.. తనకు ఏదీ చెప్పడం లేదనే ఆవేదనలో ఉన్నారట.
బీసీలకు ఛాన్స్ ఇవ్వాలని స్వరం పెంచిన తర్వాత పార్టీతో నర్సయ్యగౌడ్‌కు దూరం వచ్చిందా అనే అనుమానాలు ఉన్నాయట. రేపటి రోజును మునుగోడు టికెట్‌ను బీసీకి కాకుండా ఇంకొకరికి టికెట్ ఇస్తే మాజీ ఎంపీ ఏం చేస్తారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే బీజేపీ నుంచి రాజగోపాల్‌రెడ్డి, కాంగ్రెస్ కూడా రెడ్డి సామాజికవర్గానికి టికెట్ ఇచ్చే అవకాశాలు ఉండటంతో.. మాజీ ఎంపీ బీసీ పల్లవి.. వ్యూహాత్మకం అనేవాళ్లూ లేకపోలేదు. కాకపోతే కీలక సమయంలో అధికారపార్టీలో నేతల మధ్య పొరపచ్చాలే కేడర్‌ను కలవర పెడుతున్నాయట.