తేల్చుకుందాం.. రా! ఆ నియోజకవర్గంలో నాయకుల మాటల తూటాలు ఈ రేంజ్‌లోనే పేలుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఎంపీగా కాకుండా ఎమ్మెల్యేగా పోటీలోకి దిగాలని ఒకరు.. ఎలా వస్తారో చూస్తామని సిట్టింగ్ ఎమ్మెల్యే పొలిటికల్ టెంపరేచర్‌ను పెంచేస్తున్నారు. ఆ రాజకీయ వేడి సెగలను ఈ స్టోరీలో చూద్దాం.
హుజూర్‌నగర్‌పై మళ్లీ కన్నేసిన ఉత్తమ్ నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్‌నగర్ నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. మరో ఏడాదిలోనే ఎన్నికలు రానున్నాయని జోస్యం చెప్పారు కూడా. గతంలో కోదాడ నుంచి రెండుసార్లు.. హుజూర్‌నగర్ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు ఉత్తమ్. 2018లో ఇదే స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలిచినా.. తర్వాత జరిగిన ఎంపీ ఎన్నికల్లో నల్లగొండ నుంచి పోటీ చేసి పార్లమెంట్‌కు వెళ్లారు. దాంతో హుజూర్‌నగర్‌లో ఉపఎన్నిక వచ్చింది. ఆ బైఎలక్షన్‌లో ఉత్తమ్ పద్మావతిని ఓడించి.. టీఆర్‌ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి గెలిచారు. ఇప్పుడు మరోసారి ఈ పీసీసీ మాజీ చీఫ్ సొంత సెగ్మెంట్‌పై కన్నేయడంతో నియోజకవర్గంలో రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగిపోయింది.
ఉత్తమ్‌ను ఓడిస్తానని ఎమ్మెల్యే సైదిరెడ్డి సవాల్ ఉత్తమ్ నుంచి ప్రకటన రాగనే.. ఎమ్మెల్యే సైదిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. హుజూర్‌నగర్‌లో ఉత్తమే పోటీ చేయాలని.. ఈసారి ఆయన్ని ఓడించి రాజకీయ భవిష్యత్ లేకుండా చేస్తానని సవాల్ చేశారు ఎమ్మెల్యే. ఉత్తమ్‌కే టికెట్ ఇవ్వాలని పీసీసీ చీఫ్ రేవంత్‌ను కూడా ఆయన కోరారు. దీంతో టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య రాజకీయ సెగలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి.
ప్రజలకు చేరువలోనే ఉన్నట్టు పర్యటనలు ఈ మధ్య కాలంలో ఉత్తమ్ హుజూర్‌నగర్‌పై ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. అదే పనిగా పర్యటనలు కూడా చేస్తున్నారు. ప్రస్తుతం ఎంపీగా ఉన్నప్పటికీ ఆయన ఏదో వెలితి ఫీలవుతున్నారట. మంత్రిగా ఉన్నప్పుడు హుజూర్‌నగర్‌లో చేసిన అభివృద్ధే తనను ఎన్నికల్లో గెలిపిస్తుందన్నది ఉత్తమ్ వాదనగా ఉందట. గతానికి భిన్నంగా నియోజకవర్గానికి వచ్చి.. గెలుపు మనదే అని కేడర్‌ను.. అనుచరులను ఉత్సాహ పరుస్తున్నారట. వచ్చే ఎన్నికల్లో ఆయన మళ్లీ ఎంపీగానే పోటీ చేస్తారని ఇన్నాళ్లూ ప్రచారం జరిగింది. అయితే అది తప్పు అని నిరూపించడంతోపాటు.. ప్రజలకు చేరువగానే ఉన్నట్టు చెప్పడానికి ఆపసోపాలు పడుతున్నారట.
హుజూర్‌నగర్‌లో భూకబ్జాలు పెరిగాయని ఉత్తమ్ ఆరోపణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందని.. రాజకీయ కుట్రలకు వడ్డీలతో సహా బదులిస్తామని చెబుతున్నారట ఉత్తమ్. గతంలో ఎన్నడూ లేనంతగా హుజూర్‌నగర్‌లో అరాచకాలు, భూకబ్జాలు పెరిగిపోయాయని ఆయన ఆరోపిస్తున్నారు. వాటని ఆపేందుకే తిరిగి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు కేడర్‌కు వివరిస్తున్నారట పీసీసీ మాజీ చీఫ్. అయితే టీఆర్ఎస్ నుంచి రిప్లయ్ గట్టిగానే ఉండటంతో.. రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో ఆసక్తి నెలకొంది.