OTR : పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచినా… 2024 జూలై 15న అధికార కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఏ ముహూర్తాన ఆయన కాంగ్రెస్‌లో చేరారోగానీ.. రాజకీయంగా అటు ఇటు కాకుండా అయిపోయారన్న అభిప్రాయం ఉంది. నియోజకవర్గ కాంగ్రెస్ నేతలతో సఖ్యత లేని కారణంగా కేవలం ఎమ్మెల్యేగా మాత్రమే మిగిలిపోయారు. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దారంటూ అటు బీఆర్‌ఎస్ నేతలు కూడా ఆయనపై ఫైర్ అయ్యారు. దీంతో ఏకాకిలా మిగిలిపోయారు ఎమ్మెల్యే.
READ ALSO: Afghanistan Bomb Blast: ఆఫ్ఘనిస్థాన్‌లో భారీ బాంబు పేలుడు.. చైనీయులే టార్గెట్‌గా ఆత్మాహుతి దాడి!
అయితే కొద్ది రోజులుగా వ్యవహర శైలి, బీఆర్ఎస్ ఫ్లెక్సీలో తన ఫోటోలతో చర్చకు తెరలేపిన మహిపాల్ రెడ్డి తాజాగా తన మనసులో మాటను అనుచరుల ముందు కుండబద్దలు కొట్టారు. కాంగ్రెస్ పార్టీలో చేరి తప్పటడుగు వేశానన్నారు ఎమ్మెల్యే. ఆ పార్టీలో చేరినందుకు వెంట్రుక వాసి లాభం జరగలేదన్నారు. బీఆర్ఎస్ తనను మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిందంటూ పొగడ్తల వర్షం కురిపించారు. అందుకే మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీని గెలిపించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు మహిపాల్‌రెడ్డి. ఆయన కాంగ్రెస్ పార్టీకి రాం రాం చెబుతారని కొన్ని నెలలుగా జరుగుతున్న ప్రచారానికి ఈ వ్యాఖ్యలతో మరింత బలం చేకూరింది. కాంగ్రెస్ పార్టీలో ఇమడలేకపోతున్న ఎమ్మెల్యే తనని మూడు సార్లు గెలిపించిన గులాబీ కారే మళ్లీ ఎక్కుదామని ఫిక్స్ అయిపోయారని చెప్పుకుంటున్నారు. ఇప్పటికే తనతో పాటు కాంగ్రెస్‌లో చేరిన కొంతమంది అనుచరులను గులాబీ గూటికి చేరుస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.
ఎమ్మెల్యే సోదరుడు మధుసూదన్ రెడ్డి కూడా జూబ్లీహిల్స్ ఉపఎన్నిక టైంలో బీఆర్ఎస్ సమావేశాల్లో ప్రత్యక్షమయ్యారు. దీంతో మొదట ఆయన సోదరుడు, అనుచరులు కారు స్టీరింగ్ పట్టుకున్నాక తాను వెనుక సీట్లో కర్చీఫ్ వేద్దామనుకుంటున్నారన్న గుసగుసలు వినిపించాయి. కానీ… తాజా వ్యాఖ్యల్ని చూస్తుంటే మాత్రం అంతా ఒకేసారి వెళ్దామని ఫిక్స్ అయినట్టు కనిపిస్తోందని అంటున్నారు. ఈ ఎపిసోడ్‌తో స్థానిక కాంగ్రెస్ నేతలు మాత్రం ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అసలు రంగు బయటపడిందని అంటున్నారు. అసలాయన కాంగ్రెస్ లోకి వచ్చిందే కేసుల నుంచి బయటపడేందుకు, పార్టీని ఖతం చేయడానికేనని గతంలో ఆరోపించారు నియోజకవర్గ ఇంచార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్. తీరా మున్సిపల్ ఎలక్షన్ టైంలో మహిపాల్ రెడ్డి అధికార పార్టీని బద్నాం చేయడానికే ఇలా మాట్లాడుతున్నారంటూ విమర్శిస్తున్నారు. ఇన్ని రోజులు నియోజకవర్గంలో మహిపాల్ రెడ్డి ఆడిందే ఆట పాడిందే పాట. తనకి అనూకూలంగా ఉండే అధికారులకు పోస్టింగ్స్ ఇప్పించుకున్నారన్న విమర్శలున్నాయి. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ సమయంలో మాత్రం కత్తి మహిపాల్ రెడ్డి చేతికి ఇచ్చి యుద్దం కాట శ్రీనివాస్‌ని చేయమంటే ఎలాగంటూ కాంగ్రెస్‌లోని ఓ వర్గం ప్రశ్నిస్తోంది.
అధిష్టానం ఏదో ఓ నిర్ణయం తీసుకుని పటాన్ చెరుపై స్పెషల్ ఫోకస్ పెట్టాలన్నది కార్యకర్తల మనోగతం. ఇక ఇదిలా ఉంటే మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిన తర్వాత బీఆర్‌ఎస్ నియోజకవర్గ కో ఆర్డినేటర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆదర్ష్ రెడ్డి పరిస్థితి గందరగోళంలో పడింది. మహిపాల్ రెడ్డి మళ్ళీ బీఆర్ఎస్‌లోకి వస్తే నా పరిస్థితి ఏంటన్న ఆందోళనలో ఉన్నారట ఆయన. ఓ వైపు ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టులో కేసులు నడుస్తుంటే… పార్టీ మారిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ పై తన పెత్తనం చెలాయించడం ఏంటని స్థానిక గులాబీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. మొత్తంగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కామెంట్స్ అటు అధికార కాంగ్రెస్‌తో పాటు బీఆర్‌ఎస్‌లోనూ చర్చనీయాంశంగా మారాయి. ఎమ్మెల్యే కేవలం కామెంట్స్ తోనే సరిపెట్టుకుంటారా… లేదా తిరిగి కారెక్కుతారో చూడాలి.
READ ALSO: TVK Chief Vijay: హీరో విజయ్‌కి బిగుసుకుంటున్న ఉచ్చు.. అరెస్ట్ తప్పదా?