అధికారంలో లేకపోయినా.. స్వింగ్‌లో ఉన్నామని సంబర పడుతున్న తమ్ముళ్లకు.. సొంతపార్టీలో తలెత్తిన ముసలం కలవర పెడుతోందా? మహానాడు తర్వాత పరిస్థితి మారిపోయిందా? కొత్త క్యారెక్టర్ ఎంట్రీతో డిఫెన్స్‌లోపడి హిట్ వికెట్‌గా మారింది ఎవరు? ఏంటా నియోజకవర్గం? ఏమా గొడవ?
పమిడి రమేష్. మొన్నటి వరకు దర్శి టీడీపీ ఇంఛార్జ్. అనూహ్యంగా ఈ పదవి నుంచి తప్పుకొని పార్టీలోనూ.. కేడర్‌లోనూ కలకలం రేపారు. ఇక్కడ టీడీపీలో ఏం జరుగుతుంది? ఎందుకు ఇంఛార్జ్‌గా తప్పుకొన్నారు అనేది తమ్ముళ్లకు పెద్ద ప్రశ్న. దీనిపై ఎవరికి వారు విశ్లేషణలు చేస్తున్నారు. రకరకాల అంశాలు ప్రచారంలోకి వస్తున్నాయి.
గత ఎన్నికల్లో దర్శిలో టీడీపీ ఓడిన తర్వాత కేడర్ డీలా పడింది. టీడీపీ సర్కార్‌లో మంత్రిగా పనిచేసిన శిద్దా రాఘవరావు వైసీపీలో చేరిపోయారు. సైకిల్ గుర్తుపై బరిలో దిగిన కదిరి బాబూరావు సైతం జంప్ చేశారు. దీంతో దర్శి ఇంఛార్జ్ పగ్గాలపై పార్టీ అధినేత అనేక వడపోతలు చేశారు. చివరకు ఏడాదిన్నర క్రితం పమిడి రమేష్‌ను కోఆర్డినేటర్‌గా నియమించి.. తర్వాత ఇంఛార్జ్‌గా ప్రకటించారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో దర్శి నగర పంచాయతీ టీడీపీ ఖాతాలో పడటంతో పెద్ద చర్చగా మారింది. టీడీపీలో వాతావరణాన్ని సానుకూలంగా మలుచుకోవడంలో.. అదే సమయంలో వైసీపీలోని లుకలుకల ద్వారా అందివచ్చిన అవకాశాలను చేజిక్కించుకోవడంలో రమేష్ సక్సెస్ కాలేదనే అభిప్రాయం ఉంది.
ఏపీలో ఎక్కడికి వెళ్లినా.. ప్రకాశం జిల్లా నేతల్లా కలిసి పనిచేస్తే పార్టీ గెలుస్తుందని తమ్ముళ్లకు చెబుతూ వచ్చారు చంద్రబాబు. అయితే మహానాడులో కనిపించిన సీన్ దర్శి టీడీపీలో మొత్తం పరిస్థితిని మార్చేసింది. దుబాయ్‌లో ఉంటోన్న ఫైనాన్షియల్ నల్లూరు సుబ్బారావును మహానాడుకు పిలిచిన ఎమ్మెల్యే బాలకృష్ణ.. ఆయన్ని చంద్రబాబుకు పరిచయం చేశారు. అవకాశం ఇస్తే దర్శి నుంచి పోటీ చేస్తానని చంద్రబాబుకు సుబ్బారావు చెప్పడంతో అంతా కంగుతిన్నారట. ఇదే విషయంలో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తమ్ముళ్లూ గందరగోళంలో పడ్డారట. విషయం తెలిసి రమేష్ మనస్తాపం చెందినట్టు చెబుతున్నారు. అప్పటి నుంచి టీడీపీ కార్యక్రమాలకు దూరమై.. కార్యకర్తలకు అందుబాటులో లేకుండా పోయారట. ఇంతలో ఇంఛార్జ్ పోస్ట్ నుంచి తప్పుకొంటున్నట్టు చెప్పేశారు రమేష్.
టీడీపీలో జరుగుతున్న పరిణామాలు.. కొత్త అభ్యర్థిని ఎంపిక చేస్తారనే ప్రచారాలు తెలిసి పదవికి దూరం అవుతున్నట్టు చెప్పారు రమేష్. తనకు వ్యతిరేకంగా జిల్లాకు చెందిన కొందరు టీడీపీ నేతలు కుట్ర చేశారేమోనని ఆయన అనుమానిస్తున్నారట. అయితే రమేష్ విషయంలో మరో ప్రచారం కూడా జరుగుతోంది. ఆయనకు గ్రానైట్ వ్యాపారం ఉంది. రామతీర్థం వద్ద విలువైన నిక్షేపాలు ఉన్నట్టు భావిస్తున్న ఓ భూమికి NOC కోసం దరఖాస్తు చేశారు. ఆ భూమిపై కడప జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు రమేష్‌ను విజయవాడకు పిలిపించుకుని.. దరఖాస్తు ఉపసంహరించుకోవాలని బెదరించారట. దానిపై రమేష్ హైకోర్టును ఆశ్రయించారట. ఆ తర్వాత ఇంకా ఒత్తిళ్లు పెరిగి.. టీడీపీ బాధ్యతల నుంచి తప్పుకొన్నారని సందేహిస్తున్నారట.
టీడీపీ ఇంఛార్జ్ పదవికి రాజీనామా చేసే అంశంపై ప్రకాశం జిల్లాలోని పార్టీ నేతలతో రమేష్ మాట్లాడలేదట. ఈ అంశంపై అధిష్ఠానం కూడా ఆచి తూచి వ్యవహరిస్తున్నట్టు సమాచారం. కొత్త ఇంఛార్జ్‌ను నియమించకుండా.. త్రిమెన్ కమిటీని వేయొచ్చని ప్రచారం జరుగుతోంది. మొత్తానికి మహానాడు పరిణామాలు.. వ్యాపార అంశాలు కలగలిసి రమేష్ హిట్ వికెట్‌గా వెనుతిరిగారని అభిప్రాయ పడేవాళ్లూ ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా.. మున్సిపల్ ఎన్నికల్లో సత్తాచాటి ఊపు మీద ఉన్న తమ్ముళ్లకు తాజా పరిణామాలు మింగుడు పడటం లేదట.