టీడీపీ నేతలకు ఎవరి పార్టీ ఆఫీసు వాళ్లదే నూకసాని బాలాజీ. తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు. గతంలో వైసీపీలో ఉన్న ఆయన తర్వాత పసుపు కండువా కప్పుకొన్నారు. వైసీపీలోనూ ఆయనకు జిల్లా అధ్యక్షుడి హోదా కట్టబెట్టారు. జడ్పీ చైర్మన్ అభ్యర్దిగా ప్రకటించినా.. అప్పటి రాజకీయ పరిస్థితుల్లో అది సాధ్యం కాక మరొకరు ఆ పోస్టును తన్నుకు పోయారు. చేసేదేమీ లేక టీడీపీలో చేరిపోయారు నూకసాని. అప్పటి నుంచి టీడీపీలో ఆయనకు సముచిత స్ధానమే దక్కింది. కొంతకాలానికి తాను అనుకున్న ప్రకారం జడ్పీ చైర్మన్ అయ్యారు. అయితే దాదాపు నాలుగుసార్లు టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన దామచర్ల జనార్దన్‌తో విభేదించారు. అప్పటి వరకూ ఉన్న టీడీపీ కార్యాలయానికి వెళ్లకుండా సొంతగా పార్లమెంటరీ పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు.
ప్రస్తుతం ఒంగోలులో మొదటి నుండి ఉన్న ఎన్టీఆర్ భవన్‌తోపాటు టీడీపీ పార్లమెంట్ పార్టీ కార్యాలయాలు వేర్వేరుగా కొనసాగుతున్నాయి. నూకసాని ఎన్టీఆర్ భవన్‌కు రాకపోవటంతో.. ఆయన ప్రారంభించిన పార్లమెంట్ పార్టీ కార్యాలయానికి దామచర్ల వెళ్లడం లేదు. ఒకరితో ఒకరికి సంబంధం లేదన్నట్టుగా పార్టీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అధ్యక్షుడైన కొత్తలో నూకసాని కాస్త హడావిడిగానే తిరిగినా తర్వాత.. కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకే వెళ్తున్నారట. పార్టీని బలోపేతం చేయడం లేదనే విమర్శ ఉంది. వచ్చే నెలలో తెలుగుదేశం పార్టీ మహానాడు ఒంగోలులో నిర్వహిస్తున్నారు. సన్నాహక సమావేశాల్లో భాగంగా ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు ఒంగోలు వచ్చారు. అక్కడ టీడీపీకి రెండు ఆఫీసులు ఉన్నాయని తెలుసుకుని అవాక్కయ్యారట.
నూకసాని, దామచర్ల వ్యవహారశైలి తెలుసుకుని సీరియస్ అయినట్టు సమాచారం. జిల్లాలోని ఎమ్మెల్యేలు.. మాజీ ఎమ్మెల్యేలు.. నియోజకవర్గాల ఇంఛార్జులతో సమావేశమైన అచ్చెన్న… నూకసానిని తనదైన శైలిలో మందలించారట. పార్టీ అధ్యక్షుడిగా అందరినీ కలుపుకొని పోవాలని చెబుతూనే.. ఫ్లెక్సీలలో దామచర్ల ఫొటోలు లేకపోవడాన్ని గట్టిగానే తప్పుపట్టారని తమ్ముళ్లు చెవులు కొరుక్కుంటున్నారు. టీడీపీలోని సీనియర్లను గౌరవించకపోతే.. అంతిమంగా పార్టీనే నష్టపోవాల్సి వస్తుందని హితవుల పలికారట అచ్చెన్న.
గతంలో వైసీపీలో ఉన్న నూకసానిని టీడీపీలోకి తీసుకొచ్చి.. జడ్పీ ఛైర్మన్ అయ్యేందుకు దామచర్ల సహకరించారని గుర్తు చేశారట అచ్చెన్నాయుడు. బీసీ కార్పొరేషన్ పదవికి ప్రతిపాదన చేసింది.. తర్వాత పార్టీ పార్లమెంట్ అధ్యక్షుడిగా సిఫారసు చేసింది దామచర్లే కదా అని ప్రశ్నించడంతో అవునని ఒప్పుకొన్నారట నూకసాని. ఇకపై కలిసి సాగాలని గట్టిగానే చెప్పారట అచ్చెన్న. చివరకు ఎన్టీఆర్ భవన్‌కు వెళ్లేందుకు నూకసాని ఒప్పుకొన్నట్టు సమాచారం. ఆ తర్వాతే ఒంగోలు టీడీపీ ఆఫీస్‌ను మరోసారి ప్రారంభించేందుకు అచ్చెన్న అంగీకరించారు. ఒకసారి ప్రారంభించిన ఆఫీసును మరోసారి అచ్చెన్నతో రిబ్బన్ కటింగ్ చేయించడంపై పొలిటికల్ సర్కిళ్లలో జోకులు పేలుతున్నాయి. మరి.. ఇద్దరు నేతలు కష్టకాలంలో కలిసి సాగుతారో.. కలహించుకుంటూనే ఉంటారో చూడాలి.