ఎన్నికల టైంలో ఎమ్మెల్యే అభ్యర్థులను అటుఇటు మార్చింది వైసీపీ. తమది కాని నియోజకవర్గంలో వున్న నేతలు అన్యమనస్కంగానే వున్నారు. పేరుకు ఇంఛార్జ్ పదవిలో వున్నా…ఎలాంటి ఛార్జింగ్ లేకుండా సైలెంటయ్యారు. అందుకే వైసీపీ అధినేత జగన్ ప్రక్షాళనకు సిద్దమయ్యారా? ఎవరూ ఊహించనిరీతిలో నిర్ణయాలు తీసుకోవడానికి రెడీ అయ్యారా? ఇంఛార్జ్‌ల మార్పులపై కొందరు నేతల్లో అప్పుడే అలజడి మొదలైందా?
ఎన్నికల తర్వాత పార్టీపైనే ఫుల్ ఫోకస్ చేసిన వైసీపీ అధినేత జగన్…ఈ ఏడాదిన్నర కాలంలో పార్టీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తూ వస్తున్నారు. బూత్ లెవెల్ నుంచి కీలకమైన పీఏసీ కమిటీల నియామకాల వరకు అన్నీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ నెలలో బూత్ లెవెల్ కమిటీల నియామకాలు కూడా పూర్తయితే పార్టీ సభ్యత్వాలపై దృష్టి సారించే అవకాశం ఉందంటున్నాయి పార్టీ వర్గాలు. ఈలోపు ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇంచార్జిల పనితీరుపైనే జగన్ ఫుల్ ఫోకస్ పెట్టారని సమాచారం.. ఎప్పటికప్పుడు ఇంచార్జుల పనితీరును గమనించడంతో పాటు జిల్లా అధ్యక్షులతో రివ్యూలు చేస్తున్నారు. వారి నుంచి తీసుకున్న సమాచారంతో పాటు తాను ప్రత్యేక సోర్స్ ల ద్వారా నివేదికలు తెప్పించుకుంటూ క్రాస్ చెక్ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల ఇంచార్జుల పనితీరుపై ఇంటర్నల్ సర్వేలు పూర్తి చేసినట్లు సమాచారం. చాలా చోట్ల ఇంచార్జిల పనితీరు మీద పెద్ద ఎత్తున ఫిర్యాదులు ఉన్నాయని జగన్‌కు అర్థమైంది. క్యాడర్ తో మమేకం కాకపోవడం.. పార్టీ గురించి పెద్దగా పట్టించుకోకపోవడం వంటి వాటి మీద జగన్ సీరియస్ గానే ఉన్నట్లు తెలిసింది.
2024 ఎన్నికల ముందు 80కి పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను అటు నుంచి ఇటు మార్చటం.. కొత్తవారిని పెట్టడం వంటి ప్రయోగాలకు వెళ్లిన జగన్…దాని వల్ల పార్టీకి లాభం లేకపోగా భారీగా నష్టపోవాల్సి వచ్చిందని ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. అప్పటి నుంచి ఇప్పటివరకు కొంతమందిని ఇంచార్జులుగానే కొనసాగించినప్పటికీ…పనితీరు దారుణంగా ఉన్న స్థానాల్లో మార్చారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా అయితే అత్యధికంగా 12 అసెంబ్లీ స్థానాలకు గానూ 11 చోట్ల అభ్యర్ధులను మార్చటంతో ఇంకా ఇబ్బంది ఏర్పడింది. కడప తర్వాత ఆ స్థాయిలో బలమైన జిల్లాగా చెప్పుకుంటే ప్రకాశంలో కేవలం రెండు స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది వైసీపీ. గతంలో క్లీన్ స్వీప్ చేసిన నెల్లూరు లాంటి బలమైన జిల్లాలో ఒక్క సీటును కూడా సాధించలేకపోయింది. అయితే గత ఎన్నికల్లో స్థానాలు మారిన ఇంచార్జుల్లో కొందరు…వారి ప్రస్తుత స్థానాల్లో అన్యమనస్కంగానే పని చేస్తున్నారని సమాచారం. పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలు ఏదో మమ అనిపిస్తున్నారు. అధినేత జగన్ తమను తిరిగి తమ సొంత నియోజకవర్గంలో పనిచేసుకునేందుకు అవకాశం కల్పిస్తారని ఆశగా ఎదురుచూస్తున్నారు.
రాష్ట్రంలో పలు నియోజకవర్గాల్లో పార్టీ యాక్టివిటీస్ మెరుగుపడ్డాయని ఓ అంచనాకు వచ్చారు జగన్. ఇంచార్జులు కూడా స్పీడప్ అయ్యారని.. క్యాడర్ కు కూడా అందుబాటులో ఉన్నారని ఓ లెక్కకు వచ్చినట్లు తెలుస్తోంది. మరికొన్ని చోట్ల పార్టీ ఇంచార్జుల పనితీరు మెరుగుపడకపోవటం.. పార్టీ కార్యక్రమాలు సరిగా నిర్వహించడం లేదన్న ఫిర్యాదులున్నాయి.. ఈ క్రమంలో జగన్ అతి త్వరలో పెద్ద నిర్ణయాలే తీసుకుంటారని అంటున్నారు. పార్టీలో ఎవరి పనితీరు ఏంటన్నది ఆయనకు పూర్తి సమాచారం ఉందని చెప్పుకొస్తున్నారు. 2019కి ముందు ప్రతీ నియోజకవర్గంపై ఆయన నేరుగా దృష్టి సారించి సొంతగా సమాచారం తెప్పించుకునేవారు. అదే తరహాలో ఇప్పుడు కూడా క్యాడర్ కు ఎవరు అందుబాటులో ఉంటున్నారు.. ఎవరు దూరంగా ఉంటున్నారన్న డేటా మొత్తం ఆయన దగ్గర ఉందని సమాచారం. దీంతో ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని చాలా చోట్ల చురుకుగా పనిచేసే వారికే ఇంచార్జి పదవులు ఇస్తారని టాక్.. అంతేకాక ఈసారి క్యాడర్ తో పాటు లోకల్ లీడర్స్ అభిప్రాయాలకు పెద్ద పీట వేస్తారని.. ప్రతీ నియోజకవర్గంలో ఆయా స్థానిక నాయకుల అభిప్రాయాలను లెక్కలోకి తీసుకుంటూ వారి మాట మీదనే ఇంచార్జిని కొనసాగించాలా లేక కొత్త వారికి ఛాన్స్ ఇవ్వాలా అన్నది జగన్ నిర్ణయిస్తారని అంటున్నారు.
ఏపీలో కూటమి ప్రభుత్వానికి హనీమూన్ పీరియడ్ ఏనాడో ముగిసిందని చెప్పుకొస్తున్న జగన్ ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధమయ్యారు. మరోవైపు పార్టీ రాష్ట్ర స్థాయిలో ఇచ్చే కార్యక్రమాలతో పాటు స్థానికంగా ఉన్న సమస్యల మీద నిరంతరం ప్రజలలో ఉంటూ పోరాడితేనే పార్టీ హైలెట్ అవుతుందని భావిస్తున్నారు. ఇలాంటి తరుణంలో నియోజకవర్గాల ఇంచార్జులు యాక్టివ్ గా ఉంటేనే పార్టీ యాక్టివిటీస్ ప్రజల్లోకి స్పీడ్ గా వెళ్తాయని ఆలోచిస్తున్నారు. ఇదే సమయంలో కొత్త ఏడాదిలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. లోకల్ పోరులో ఇంచార్జిలదే కీలకమైన పాత్ర కావటంతో…వారే స్ట్రాంగ్‌గా వుండి క్యాడర్‌ను నడిపించాలి. అలాంటిది వారు డీలా పడినా.. పట్టించుకోకపోయినా అది పార్టీకే పెద్ద దెబ్బగా మారుతుందని ఓ అంచనాకు వచ్చిన జగన్….చాలా కీలక నిర్ణయాలను తీసుకుంటారని పొలిటికల్ పండితులు భావిస్తున్నారు. పార్టీకి రిపేర్లతో పాటు టింకరింగ్ వర్కులు కూడా పూర్తిచేసి కొత్త లుక్ తీసుకువస్తేనే మార్పులు అందరికీ కనిపిస్తాయని అంచనా వేస్తున్నారు.. మరి వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇంచార్జుల మార్పులు చేస్తారా.. చేస్తే ఎప్పుడు మొదలుపెడతారు.. ఎవరు ఇన్.. ఎవరు అవుట్ అనేది ఉత్కంఠగా మారింది.