Off The Record: అక్కడ వైసీపీ పరిస్థితి అయోమయం గందరగోళంగా తయారైందా? మూడు నియోజకవర్గాల్లో అయితే… అసలు ఫ్యాన్ స్విచ్చేసే దిక్కే లేకుండా పోయిందా? పరిస్థితుల్ని అనుకూలంగా మల్చుకునే అవకాశం వచ్చినా లోకల్ లీడర్స్ పట్టించుకోవడం లేదా? చెయ్యాల్సిన చోట పని చేయకుండా పక్క నియోజకవర్గాల్లో పెత్తనాలు ఎక్కువయ్యాయా? ఏ జిల్లాలో ఉందా పరిస్థితి? ఎందుకంత దారుణంగా మారింది?.. పశ్చిమ గోదావరి జిల్లాలో వైసిపి ఇప్పట్లో కోలుకునేలా కనిపించడంలేదన్న టాక్ పెరుగుతోంది. 2019 ఎన్నికల్లో ఏడు అసెంబ్లీ స్థానాలకుగాను ఐదింటిని గెలుచుకున్న ఆ పార్టీ… 2024లో జీరో అయింది. దీంతో ఒకరిద్దరు మినహా మిగతా జిల్లా నేతలంతా సైలెంట్ అయ్యారు. ఇంకా చెప్పాలంటే వైసిపి ఆవిర్భావం నుంచి భీమవరం అసెంబ్లీ బాద్యతలను మోసిన గ్రంధి శ్రీనివాస్ లాంటి నాయకులు పార్టీకి గుడ్ బై కొట్టి ప్రస్తుతానికి రాజకీయాల నుంచి పక్కకి జరిగారు. దీంతో భీమవరం బాద్యతలు భుజానికెత్తుకునేందుకు స్ట్రాంగ్ లీడర్ కొరత వైసిపిని వేధిస్తోందట. గ్రంధి శ్రీనివాస్ ఏపార్టీలో చేరకపోయినప్పటికి ఆయన స్థానంలో మరో లీడర్‌ను మాత్రం తీసుకురాలేకపోతోంది వైసీపీ అధిష్టానం.
Read Also: Off The Record: జానీ వాకర్ మీద ఒట్టేసి చెబుతున్నా.. ఇక మాది దోస్త్ మేరా బంధం..
అయితే, పార్టీ బలంగానే ఉన్నా,,నడిపించే సరైన నాయకత్వంలేకపోవడంతో రానురాను క్యాడర్‌లో కాన్ఫిడెన్స్ దెబ్బతింటోందని అంటున్నారు. భీమవరం…. రాజకీయంగా ప్రాముఖ్యత ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్ కావడం, పైగా పశ్చిమ గోదావరిజిల్లా కేంద్రం కావండంతో ఇక్కడ బలమైన నేత అవసరమనేది లోకల్ లీడర్ల మాట. మరోవైపు ఉండి నియోజకవర్గంలోనూ కొత్త ఇంఛార్జి కోసం క్యాడర్ ఎదురుచూస్తోంది. ఉండిలో ఇప్పటి వరకు వైసిపి ఒక్కసారి కూడా విజయాన్ని సాధించలేకపోయింది. 2019, 24 ఎన్నికల్లో పోటిచేసిన పివిఎల్ నరసింహరాజు పెద్దగా ప్రభావం చూపించలేకపోతున్నారు. పైగా గ్రూపు తగాదాలు నిరంతరం కొనసాగడంతో… పివిఎల్ పై లోకల్ క్యాడర్ తీవ్ర అసంతృప్తిగా ఉందట. కొత్త ఇంచార్జిని కేటాయించాలంటూ స్థానిక నేతలు పార్టీ పెద్దలకు మొరపెట్టుకుంటున్నారు. టిడిపి ఆవిర్భావం తర్వాత ఉండి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి మాత్రమే విజయం సాధించింది. వేరే ఏ పార్టీలు ప్రభావం చూపలేకపోతున్నాయి. అలాంటి ఉండి సెగ్మెంట్లో వైసిపి బలమైన నేతను బరిలో దింపకుంటే కష్టమనేది లోకల్ లీడర్ల మాట. రెండుసార్లు అవకాశం ఇచ్చినా ప్రభావం చూపలేకపోయిన నాయకుడిని ముచ్చటగా మూడోసారి కొనసాగిస్తారా లేక కొత్త లీడర్‌ని తీసుకు వస్తారా అని ఫత్కంఠగా చూస్తోంది కేడర్.
Read Also: Off The Record: పదవుల పరంగా TDPలో కాపులు కంఫర్ట్గా లేరా..?
ఇక, పాలకొల్లులో ఇప్పటికే ఆరు సార్లు ఇన్చార్జిలని మార్చారు వైసిపి పెద్దలు. ఫలితం మాత్రం శూన్యం. ప్రస్తుతం పాలకొల్లు వైసిపి ఇన్చార్జి గా ఉన్న గుడాల గోపి పై స్థానిక నాయకులు మండిపడుతున్నారు. గత ఎన్నికల్లో పార్టీ ఇచ్చిన డబ్బులు సైతం పక్కదారి పట్టించారని ఆయనపై సొంత నేతలు గరంగరంగా ఉన్నారు. కాపు ఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉండే పాలకొల్లు నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన గుడాల గోపిని రంగంలోకి దించడమే పెద్ద తప్పు అనేది కార్యకర్తల మాట. ఆర్థికంగా బలమైన నేతలని పైకి చెప్పుకుంటున్నప్పటికీ పార్టీ కార్యక్రమాలకి, కార్యకర్తలకి సహాయపడిన దాఖలాలు లేవనేది లోకల్ వాయిస్. ప్రస్తుతం పాలకొల్లులో వైసిపి నేతలు గ్రూపులుగా విడిపోయి ఆధిపత్యం కోసం ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు. ఇక్కడ టిడిపి తరఫున మంత్రి నిమ్మల రామానాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నందున అంతకంటే బలమైన నేతను బరిలో దింపితే తప్ప గెలుపు సాధ్యం కాదు అనేది ఓపెన్ టాక్.
Read Also: Off The Record: మానకొండూర్లో పెరుగుతున్న పొలిటికల్ హీట్
కాగా, గ్రూపు తగాదాలతో అంతంతమాత్రంగా ఉన్న పాలకొల్లు వైసీపీని గాడిలో పెట్టేందుకు పార్టీ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఇలా…. మూడు నియోజకవర్గాల్లో వైసిపి ఇబ్బందులు ఎదుర్కోవడానికి కామన్ ఫ్యాక్టర్ ఒకటుందట. ఈ నియోజకవర్గాల్లోని నేతలు ఎవరిపని వారు చేసుకోకుండా పక్క సెగ్మెంట్స్‌లో వేలుపెడుతున్నారట. వాళ్ళు పనిచేయరు.. చేసేవాడిని చేయనివ్వరనేది సొంతపార్టీ నేతల స్టేట్‌మెంట్. పార్టీ పెద్దల దగ్గర ఉన్న పరపతి ఉపయోగించుకుని ఒకరిద్దరు నేతలు అనవసరవిషయాల్లో వేలుపెడుతూ ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో పార్టీకోసం పనిచేసే వాళ్ళ సంఖ్య సగానికి పడిపోయిందని అంటున్నారు వైసీపీ నేతలు. ఉన్నవాళ్ళనైనా తిన్నగా ఉండనిస్తారా అంటే… అదీ ఆనుమానమేనట. ప్రస్తుతం జిల్లా ఇన్చార్జిగా కొనసాగుతున్న ముదునూరి ప్రసాదరాజు తో పాటు మరికొంతమంది నేతలు భీమవరం, పాలకొల్లు రాజకీయాల్లో నిత్యం తల దూర్చడంతో అక్కడ నేతలు కుదురుకోలేకపోతున్నట్టు తెలుస్తోంది. ఇలాంటి చేష్టలతో విసిగిపోయే భీమవరం నుంచి గ్రంధి శ్రీనివాస్ తప్పుకున్నారట. ఇప్పటికే జిల్లాలో అంతంతమాత్రంగా ఉన్న పార్టీని బతికించాలంటే బలమైన ఇన్చార్జులు అంతకుమించి బలమైన ప్రణాళిక అవసరం. ఈ విషయాలన్నిటిలో అధిష్టానం ఆచితూచి అడుగులు వేయాల్సి ఉందంటున్నారు పరిశీలకులు.