Off The Record: కూటమిలో ఇక కాపు తమ్ముళ్ళకు ప్రమోషన్లు ఉండవా? సైకిల్ పార్టీ కాపు నాయకులంతా త్యాగరాజులుగా మిగిలిపోవాల్సిందేనా? చేతికాడికొచ్చిన పదవుల్ని వాళ్ళొచ్చి తన్నుకుపోతున్నారంటూ… టీడీపీ కాపులు తెగ ఫీలైపోతున్నారా? ఇంతకీ వాళ్ళ ముందరి కాళ్ళకు బంధాలు వేస్తున్నదెవరు? ఎందుకు పసుపు కాపుల్లో ఫ్రస్ట్రేషన్ పెరుగుతోంది?.. ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌లో ప్రస్తుతం ఒక ఖాళీ ఉంది. జనసేన నేత నాగబాబుకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకుంటామని గతంలో స్వయంగా ప్రకటించారు సీఎం చంద్రబాబు. ఆ ప్రకారం చూసుకుంటే… ఉన్న ఒక్క ఖాళీ ఆయనకు సరిపోతుందన్నది రాజకీయవర్గాల విస్తృతాభిప్రాయం. ఇక కుల సమీకరణల విషయానికి వస్తే… ప్రస్తుతం మంత్రివర్గంలో నలుగురు కాపులు ఉన్నారు. జనసేన నుంచి డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, మంత్రి కందుల దుర్గేష్ అలాగే తెలుగుదేశం తరపున మంత్రులు నారాయణ, నిమ్మల రామానాయుడు ఆ కోటాలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడే తెలుగు తమ్ముళ్ళకు తేడా కొడుతోందట. నాగబాబుకు కూడా మంత్రి పదవి ఇచ్చేస్తే…మొత్తం కేబినెట్‌లో ఐదుగురు కాపు మంత్రులు అవుతారు.
Read Also: Off The Record: జానీ వాకర్ మీద ఒట్టేసి చెబుతున్నా.. ఇక మాది దోస్త్ మేరా బంధం..
అయితే, సాధారణంగా పదవుల పంపకాల్లో కులాల లెక్కల్ని తూకం వేసిమరీ పక్కాగా చూస్తే చంద్రబాబు… మిగతా పదవుల్లో కూడా మొత్తం కూటమిగా చూసి తమను ఎక్కడ పక్కన పెడతారోనని టెన్షన్ పడుతున్నారట టీడీపీ కాపు నాయకులు. టిడిపి గత ప్రభుత్వాల్లో కచ్చితంగా ఉమ్మడి తూర్పు పశ్చిమగోదావరి, విశాఖ జిల్లాల నుంచి ముగ్గురు కాపులు మంత్రులుగా ఉండేవారు.. కానీ ఈసారి కూటమి లెక్కలతో టిడిపిలోని కాపులకు అవకాశం రాలేదు. కూటమి పేరుతో కాపు కోటా మొత్తాన్ని జనసేన తన్నుకుపోతే… చివరికి తెలుగుదేశం పార్టీలో మనం త్యాగరాజులుగా మిగిలిపోవాల్సి వస్తుందన్న చర్చ మొదలైందట. మిగతా కులాలకు బ్యాలెన్స్ బాగానే సరిపోతుందిగానీ… మనకి మాత్రం కంఫర్ట్ లేదని అంటున్నారట టీడీపీ కాపు లీడర్స్. టిడిపి గత ప్రభుత్వంలో నిమ్మకాయల చినరాజప్ప డిప్యూటీ సీఎం గా ఉన్నారు. ఈసారి కూడా మంత్రి పదవి ఆశించారాయన. దక్కలేదు సరే…. నా స్థాయికి తగ్గ వేరే ఏదన్నా పోస్ట్ అయినా ఇవ్వకపోతారా అని సన్నిహితుల దగ్గర అంటున్నారట. అలాగే…. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కూడా మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నా వర్కౌట్ కాలేదు. ఇంత సీనియర్‌ని అయినా ఎప్పుడూ మంత్రిని కాలేదు.
Read Also: Disha Salian: దిశా సాలియన్ ఎవరు..? హత్యతో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, ఆదిత్య ఠాక్రేకు సంబంధం ఏమిటి..?
ఇక, ఈసారి ఛాన్స్ కావాలని మొదట్లోనే అడిగారట జ్యోతుల. కానీ… నిమ్మల, జ్యోతుల ఇద్దరిదీ కాపు సామాజికవర్గమే కావడంతో అసలు పరిగణనలోకి తీసుకోలేదు పార్టీ. అటు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని టిడిపి కాపు ఎమ్మెల్యేలు ప్రయత్నాలు చేసిన వర్కౌట్ అవలేదు. ఇక నామినేటెడ్ పదవులు భర్తీలోనూ పరిస్థితి ఇలాగే ఉన్నట్టు తెలుస్తోంది. తమ సామాజిక వర్గానికి వచ్చే పదవుల్లో ఎక్కువ శాతం జనసేనకి పోతుండటంతో కాపు తమ్ముళ్లు తెగ ఫీల్ అయిపోతున్నారట. కొందరైతే… అన్నీ ఉన్నా, ఐదోతనం మిస్ అయినట్టుగా ఉంది మా పరిస్థితి అంటూ బహిరంగంగానే కామెంట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. కేబినెట్‌లో ఏవైనా మార్పులు చేర్పులు చేస్తే…. తమకు ఛాన్స్ వస్తుందని ఇన్నాళ్ళు ఆశించారు టీడీపీ కాపు ఎమ్మెల్యేలు. కానీ… ఇప్పుడు నాగబాబుకు ఎమ్మెల్సీ ఇవ్వడం, మంత్రివర్గంలోకి తీసుకుంటామని స్వయంగా చంద్రబాబు చెప్పడంతో.. ఆశలు వదిలేసుకుంటున్నట్టు తెలుస్తోంది. పైగా నామినేషన్ టైంలో… నాగబాబు పిఠాపురం స్థానికుడిగా అడ్రస్ ఇచ్చారు. ఆంటే.. ఆయనకు పదవి కూడా ఉమ్మడి తూర్పు గోదావరి కోటాలోకే వస్తుంది. ఇలా ఎట్నుంచి ఎటు చూసినా.. అంతా అగమ్యగోచరంగా కనిపిస్తోంది.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత చేశాం.. ఇప్పుడేమో ఇలా జరుగుతోంది.. ఏం చేయాలో అర్ధం కావడంలేదంటూ ప్రత్యేకంగా ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల తమ్ముళ్ళు తెగ ఫీలైపోతున్నట్టు సమాచారం.
Read Also: Off The Record: మానకొండూర్లో పెరుగుతున్న పొలిటికల్ హీట్
కాగా, కొందరికి ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు అయినప్పటికీ సామాజిక వర్గ కోటాలో మంత్రులుగా అవకాశం వచ్చింది. మనకి మాత్రం ఆ కులమే మైనస్ అయిందంటూ దీర్ఘాలు తీస్తున్నారట. అటు కార్పొరేషన్ చైర్మన్స్, డైరెక్టర్స్, ఇతర నామినేటెడ్ పదవుల్లోనూ ఇదే సీన్ కనిపిస్తోందట. దాంతో కాపు తమ్ముళ్ల పరిస్థితి కక్కలేక మింగలేక అన్నట్లు తయారైందని అంటున్నారు. దశాబ్దాలుగా పార్టీలో ఉన్నాం.. సూపర్ సీనియర్స్… అయినా ఆవగింజంత అదృష్టం కూడా కలిసి రావాలి కదా.. అంటూ ఫీలైపోతున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి టిడిపి కాపు నేతల పరిస్థితి…. అంతా కంఫర్ట్ గానే ఉందిగానీ… అందులో మనం లేము అన్నట్టు మారినట్టు చెప్పుకుంటున్నారు. పార్టీ అధికారంలో ఉన్నా… ఆ పవర్‌ని అనుభవించలేకపోతున్నామని, గతంలో ఆదేశాలు ఇచ్చిన వారు సైతం ఇప్పుడు వేరొకరి నిర్ణయాల మీద ఆధారపడి పనులు చేసుకోవాల్సి వస్తోందని ఆవేదన పడుతున్నారట. తమకు వచ్చే పదవుల్ని జనసేన తన్నుకుపోతోందని తీవ్ర ఆవేదనగా ఉన్న టీడీపీ కాపు తమ్ముళ్ళకు ఊరట లభిస్తుందో… లేక విధి ఆడే వింత నాటకం అని సరిపెట్టుకోవాల్సి వస్తుందో తేలాలంటే…. నామినేటెడ్ పదవుల పంపకాలు పూర్తయ్యేదాకా ఆగాల్సిందే.