Off The Record: తెలంగాణ అంతా ఒక లెక్క అయితే.. అ నియోజకవర్గంలో ఇంకో లెక్క అన్నట్టుగా ఉందట. ఏకంగా అధికార పార్టీ ఎమ్మెల్యేను టార్గెట్ చేస్తూ.. అప్పర్ హ్యాండ్ సాధించేందుకు అస్త్ర శస్త్రాలన్నింటినీ వాడేస్తున్నారట ఆ మాజీ ఎమ్మెల్యే. ఇలాగే ఉంటే.. మీకే కష్టమని సొంత పార్టీ నుంచే ఎమ్మెల్యేకి హెచ్చరికలు వెళ్తున్నాయట. ఎక్కడుందా పరిస్థితి? ఎవరా ఎమ్మెల్యే? మాజీ ఎమ్మెల్యే?.. ఆరోపణలు, సవాళ్ళతో మానకొండూర్ పాలిటిక్స్ హీటెక్కిపోతున్నాయి. ఎమ్మెల్యే కవ్వంపల్లి అవినీతిపరుడు అంటూ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చేసిన వ్యాఖ్యలతో మొదలైన వివాదం కొత్త మలుపులు తిరుగుతోంది. ముఖ్యమంత్రి సహాయ నిధి, ఆరోగ్యశ్రీ పథకాన్ని వాడుకుని ఎమ్మెల్యే, ఆయన అనుచరులు కోట్లాది రూపాయలు దండుకుంటున్నారు, ఇవిగో ఆధారాలంటూ విడుదల చేశారు రసమయి. కవ్వంపల్లి సత్యనారాయణ తనకు చెందిన భూపాలపల్లిలోని సురక్ష ఆస్పత్రి, జమ్మికుంటలోని సురక్ష హాస్పిటల్, హైదరాబాద్ అంకిత్ హాస్పిటల్‌లో పేషేంట్స్ లేకుండా ఆరోగ్య శ్రీ నుంచి పెద్ద ఎత్తున డబ్బులు కొల్లగొట్టారన్నది రసమయి ప్రధాన ఆరోపణ. వివిధ మండలాల్లో ఎమ్మెల్యే తన అనుచరులతో ఆరోగ్య శ్రీ కార్డులు, ఆధార్ కార్డులు సేకరించి.. వారికి ఆయా ఆస్పత్రుల్లో చికిత్స చేసినట్టు దొంగ బిల్లులు సృష్టిస్తున్నారంటూ ఫైరవుతున్నారు ప్రతిపక్ష నాయకులు. అక్కడితో ఆగకుండా కవ్వంపల్లి ఎంబీబీఎస్ క్లాస్‌మేట్స్‌కి చెందిన ఆస్పత్రుల్లోనూ అక్రమాలు జరుగుతున్నాయనడానికి తన దగ్గర ఆధారాలున్నాయంటున్నారు మాజీ ఎమ్మెల్యే.
Read Also: Off The Record: జిల్లాలోని మూడు సెగ్మెంట్స్ మీద వాస్తు ఎఫెక్ట్ పడిందా?
అయితే, ఎమ్మెల్యే వ్యవహారాల మీద అధికారులకు, కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కి కూడా కంప్లైంట్ చేస్తామన్నారాయన. అయితే, అదంతా అబద్ధమని, రసమయి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్నది కాంగ్రెస్ నేతల మాట. పదిహేను రోజులకోసారి కూడా నియోజకర్గానికి రావడం లేదని, క్యాడర్‌ను పట్టించుకోవడం లేదనే విమర్శల నుంచి బయట పడేందుకు మాజీ ఎమ్మెల్యే.. ఇలా కొత్త రాగం అందుకున్నారని అంటున్నారు. ఎమ్మెల్యే కవ్వంపల్లిపై చేసిన ఆరోపణల విషయంలో చర్చకు రావాలంటూ రసమయికి కాంగ్రెస్ నేతలు సవాల్ విసరడంతో కాక మొదలైంది. బాలకిషన్ వైపు నుంచి స్పందన లేకపోవడంతో… ఆయన ఫామ్‌హౌస్ ముట్టడికి పిలుపునిచ్చారు కాంగ్రెస్ నేతలు. ఓ వైపు భారీగా పోలీసుల మోహరింపు… మరోవైపు పెద్ద సంఖ్యలో హస్తం పార్టీ కార్యకర్తలు ముట్టడికి ప్రయత్నం చేయడంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది… సరిగ్గా అదేసమయంలో ఇల్లంతకుంట మండలానికి చెందిన ఓ వ్యక్తి సీఎంఆర్‌ఎఫ్ చెక్కును అక్రమంగా తన అకౌంట్లో వేసుకున్నారంటూ వివరాలతో వైరల్ చేశారు బీఆర్ఎస్ కార్యకర్తలు. దీంతో అలర్ట్ అయిన కాంగ్రెస్ నేతలు క్యాంప్ ఆఫీస్ నుంచి చెక్కు దొంగిలించారంటూ ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి సదరు వ్యక్తి ని అరెస్టు చేశారు. దాన్ని అడ్వాంటేజ్ తీసుకునే ప్లాన్‌లో ఉన్నారట బీఆర్‌ఎస్ నేతలు. మేం చెప్పింది కరెక్ట్. ఆధారాలతో నిరూపితం కాగానే అరెస్ట్ చేశారు.. ఇప్పటికైనా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
Read Also: Metro MD NVS Reddy: మెట్రో రైళ్లపై బెట్టింగ్ యాప్ ప్రకటనలు.. ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఏమన్నారంటే?
కాగా, ఎమ్మెల్యే కవ్వంపల్లి సన్నిహితులు షాడో ఎమ్మెల్యేలుగా మారి ప్రజల రక్తం తాగుతున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలా రోజుకో సవాల్… ప్రతి సవాల్ తో మానకొండూర్ పాలిటిక్స్.. రంజుగా మారాయి.. మాజీ ఎమ్మెల్యే టార్గెట్ అంతా ఆయన వెనకున్న ద్వితీయ శ్రేణి నాయకులంటూ.. ఆయన సన్నిహితులే గుసగుసలాడుకుంటున్నారట. ఇక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఒక్క హాలు మినహా మిగతా అన్ని గదులకు థంబ్ లాక్ సిస్టం ఏర్పాటు చేసారు… కవ్వంపల్లి, ఆయన వ్యక్తిగత సిబ్బంది మినహా ఎవరూ లోనికి వెళ్లే చాన్స్ లేదు… చీకటి దందా నడిపేందుకే ఇంత పకడ్బందీ ఏర్పాట్లు చేసుకున్నారని అంటున్నారట బీఆర్ఎస్ నేతలు. అటు రావణ వధ, ఇసుక క్వారీల వ్యవహారాలు, అధికారుల బదిలీల సందర్భాల్లో ఎమ్మెల్యే బద్నాం అయ్యారని, ఇప్పటికైనా ఆయన మేలుకోవాలని, లేదంటే కోలుకోవడం కష్టమేనని సొంత కాంగ్రెస్ పార్టీ నేతలే అంటున్నారట…. స్వతహాగా డాక్టర్ అయిన కవ్వంపల్లి ఈ పరిస్థితుల నుంచి బయట పడేందుకు… ఎలాంటి ట్రీట్‌మెంట్ ఇస్తారో చూడాలి.