Off The Record: పదిహేనేళ్ళ పాటు బద్ద శత్రువుల్లా ఉన్న ఆ ఎమ్మెల్యేలు ఇద్దరూ ఇప్పుడు మందు, సోడాలా మిక్స్ అయిపోయారట. జానీ వాకర్ మీద ఒట్టేసి చెబుతున్నాం… ఇక మాది దోస్త్ మేరా దోస్త్ బంధం అంటున్నారట. అస్సలు జీవితంలో ఊహించని ఈ పరిణామంతో విశాఖ జనం ఉక్కిరి బిక్కిరి అయిపోయి, అమ్మనీ…. అంతా లిక్కర్ డ్రాప్స్ మహిమ అంటున్నారట. ఎమ్మెల్యేలు అంటారు, మందు అంటారు, అసలేంటీ గోల అనుకుంటున్నారా? జస్ట్ వెయిట్… ఈ మందు కలిపిన బంధాన్ని చూసేయండి.. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శాశ్వత శత్రువులు వుండరని అంటారు. ఆ విషయం పలు సందర్భాల్లో రుజువు అవుతూనే ఉంది. అలాంటిదే.. ఇంకా ఆశ్చర్య పరిచే.. ఔరా అనిపించే సీన్ ఒకటి ఇప్పుడు విశాఖ పొలిటికల్ స్క్రీన్ మీద కనిపిస్తోందట. మొన్నటిదాకా కత్తులు దూసుకున్న ఇద్దరు ఎమ్మెల్యేలు ఇప్పుడు నువ్వు లేక నేను లేను అన్నట్టుగా.. అబ్బో, ఓ రేంజ్‌లో రాసుకు పూసుకు తిరుగుతుండటం చూసి ముక్కున వేలేసుకుంటున్నారట విశాఖ వాసులు. ఆ ఇద్దరిలో ఒకరు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు కాగా.. మరొకరు జనసేన శాసనసభ్యుడు వంశీ కృష్ణ యాదవ్. విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి వెలగపూడి నాలుగు సార్లు గెలిస్తే.. సౌత్ అసెంబ్లీ సీటులో ఫస్ట్ టైం ఎమ్మెల్యే వంశీ. వీళ్ళిద్దరూ కూటమి తరపున వేరు వేరు స్థానాల్లో పోటీ చేయడం, గెలిచి అసెంబ్లీకి వెళ్ళడంలో ఏమంత ప్రత్యేకత కాదుగానీ.. ప్రస్తుతం వాళ్ళ రిలేషన్ షిప్ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.
Read Also: IPL 2025: ఈ సీజన్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌దే టైటిల్..!
అయితే, వాస్తవానికి వంశీ, వెలగపూడి రాజకీయ ప్రత్యర్ధులు. రెండుసార్లు ఎన్నికల్లో ప్రత్యక్షంగా తలపడటమే కాదు…. అదును దొరికితే దుమ్మెత్తి పోసుకునే వాళ్ళు. వెలగపూడిని ఓడించి విజయవాడకు తిప్పి పంపుతామని వైసీపీలో వున్నప్పుడు శపథం చేయడమే కాదు, వ్యక్తిగత ఆరోపణలు కూడా చేసే వారు వంశీకృష్ణ యాదవ్. రామకృష్ణబాబు మాత్రం వ్యక్తిగతాలు, దిగి మాట్లాడటాల్లాంటివి చేయకున్నా… విశాఖ తూర్పు రాజకీయం ఎప్పుడు పెనం మీద ఉన్నట్టుగానే కనిపించేది. నియోజకవర్గంలో పట్టు నిలుపుకొని ఈసారి నాలుగో విడత వెలగపూడి ఎమ్మెల్యే అయితే….బోర్డర్ దాటి ఈస్ట్ నుంచి సౌత్‌కు వెళ్ళి జనసేన తరపున పోటీచేసి భారీ మెజారిటీతో విజయం సాధించారు వంశీ. ఎంత కూటమిలో వున్నా గత అనుభవాల దృష్ట్యా వీళ్ళిద్దరూ విభేదించుకుంటారని మొదట్లో అంచనా వేశారట అంతా. రాష్ట్రంలో అక్కడక్కడా అలాంటి ఉదంతాలు జరగడంతో విశాఖలో కూడా అలాగే ఉంటుందని అనుకున్నారు. కానీ… ఆ అంచనాలను తల్లకిందులు చేస్తూ…. కూటమి తరపున గెలిచాక ఒక్కటైపోయారు పాత ప్రత్యర్థులు. అదీకూడా అలా ఇలా కాదు. బాగా…. మిక్స్ అయిపోయారట. సొంత పార్టీల నేతలకే ఇది విడ్డూరంగా అనిపిస్తున్నట్టు చెబుతున్నారు. అసలు ఒకరి మాటను ఒకరు జవదాట లేనంతగా ఫ్రెండ్ షిప్ ఎలా బలపడిందబ్బా అనే డిస్కషన్ ఎక్కువైంది ఇటీవల వైజాగ్ పొలిటికల్ సర్కిల్స్‌లో. ఇదంతా చూస్తున్న వెటకారిస్ట్‌లు….అబ్బ…. ఏమున్నాయ్ గురూ…. కాక్‌టెయిల్ పాలిటిక్స్ అంటున్నారట. వాస్తవానికి రాజకీయ నేపథ్యమే కాదు, ఈ ఇద్దరు ఎమ్మెల్యేల వ్యాపారాలు కూడా భిన్నమే. వెలగపూడి రామకృష్ణబాబు లిక్కర్ వ్యాపారం చేస్తే…..వంశీ పోర్ట్ కాంట్రాక్టర్. ఇలా… ఏ విషయంలోనూ పొంతన లేని భిన్న ధృవాల్లాంటి నేతలు ఇప్పుడు అంతలా మిక్స్ అండ్ మింగిల్ అయిపోవడం వెనక లిక్కర్ డ్రాప్స్ ఉన్నట్టు సమాచారం.
Read Also: Metro MD NVS Reddy: మెట్రో రైళ్లపై బెట్టింగ్ యాప్ ప్రకటనలు.. ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఏమన్నారంటే?
కొత్త పాలసీ ప్రకారం గ్రేటర్ విశాఖ పరిధిలో 300 మద్యం దుకాణాలకు అనుమతిచ్చింది ప్రభుత్వం. లాటరీలో కొన్ని షాపులు వంశీ అనుచరులకు కూడా దక్కాయట. మొదటి నుంచి వ్యాపార అనుభవం వున్న వెలగపూడి అనుచరులు….కొత్తగా వైన్ షాపు లు దక్కించుకున్న వంశీ మనుషులు ఇప్పుడు మాంఛి బిజినెస్ ఫ్రెండ్స్ అయిపోయి మందులో సోడాలా మిక్స్ అయిపోయారట. ఇదే బంధం పై స్థాయిదాకా వెళ్ళి పాత కక్షలను, వ్యక్తిగత విమర్శల్ని తాగి పడేసే మందు బాటిల్‌లా అవతలికి విసిరేశారట. స్కాచ్ సాక్షిగా బంధాన్ని బలోపేతం చేసుకుని…. కలిసి నడుస్తున్నట్టు సమాచారం. 15 ఏళ్ల రాజకీయ వైరాన్ని పక్కనబెట్టి లిక్కర్ బిజినెస్‌తో ఇద్దరూ ఆప్త మిత్రులుగా మారడం చూసి ఔరా…. అంటున్నారు విశాఖ జనం. గడిచిన మూడు ఎన్నికల్లో వెలగపూడి ఓటమికి కంకణం కట్టుకున పని చేసిన వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్.. ఇప్పుడు ఆయన ఏం చెబితే అదే అంటుండటం ఆసక్తికరంగా మారింది. ఇది గమనిస్తున్న వారంతా… అంతా జానీవాకర్ మహత్యం. ఆ వాకరే వీళ్ళతో మిక్స్ వాక్ చేయిస్తున్నారు. అంతా కాల మహిమ అంటూ సెటైర్స్ వేసుకుంటున్నారట.