తెలంగాణ కాంగ్రెస్‌లో సమ్మర్ కార్నివాల్ జరగబోతోందా? పార్టీ పెద్దలు డూ ఫెస్టివల్ అనబోతున్నారా? ఇన్నాళ్ళ ఎదురు చూపులు, వాయిదా పర్వానికి ఏప్రిల్‌లో ముగింపు పలకబోతున్నారా? లెట్స్ డూ కుమ్ముడూ అనేంత స్థాయిలో పదవుల భర్తీ ఉంటుందన్నది నిజమేనా? ఆ విషయంలో అసలు పీసీసీ ప్లాన్స్ ఎలా ఉన్నాయి? ఆల్రెడీ పోస్టుల్లో ఉన్నవాళ్ల పరిస్థితి ఏంటి? ఎప్పటికప్పుడు ఆశ నిరాశల మధ్య ఊగిసలాడుతూనే ఉన్నారు చాలా మంది తెలంగాణ కాంగ్రెస్ నాయకులు. పార్టీ అధికారంలోకి వచ్చిందన్న ఆనందంకంటే… వచ్చి రెండేళ్ళయినా ఇంకా ఏం పదవులు దక్కలేదన్న బాధే ఎక్కువ మందిలో ఉందట. కొన్ని నామినేటెడ్ పదవుల్ని భర్తీ చేసినా… ఆశావహుల్లో ఎక్కువ మంది సంతృప్తిగా లేరు. ఎప్పటికప్పుడు అదిగో భర్తీ చేసేస్తున్నారు, ఇదిలో పదవులు వచ్చేస్తున్నాయంటూ మాటలే తప్ప చేతలు కనిపించడం లేదు. దీంతో…అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టు ఇంకెన్నాళ్ళన్న నిర్వేదం పెరుగుతోంది పార్టీ నాయకుల్లో.
ఈ క్రమంలోనే… సంక్రాంతికి భర్తీ ప్రక్రియ ఉంటుందని ఇన్నాళ్ళు అనుకున్నారు. కానీ… తాజాగా ఓ పిడుగులాంటి వార్త చెప్పారట పార్టీ పెద్దలు. సంక్రాంతి దగ్గర పడుతున్నందున ఇక పదవులు వచ్చేస్తాయని ఆశిస్తున్న వాళ్ళకు అబ్బే…. అలాంటి ఆశలేం పెట్టుకోవద్దమ్మా…. ఇంకొన్నాళ్ళు ఆగండంటూ కబురు అందినట్టు తెలుస్తోంది. వాస్తవానికి ఈ వారం 8 మంది నేతలకు కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇవ్వాలని భావించారు. అందుకు సంబంధించిన కసరత్తు కూడా పూర్తయింది. కానీ ఇందులో నలుగురు ఎమ్మెల్యేలున్నారు. మిగతా నలుగురు పార్టీ నాయకులు. దీంతో… ఇంతా చేసి ఇన్నాళ్లు ఎదురు చూస్తే ఇచ్చింది నాలుగు పదవులేనా అన్న చర్చ జరిగే అవకాశం ఉందన్న డౌట్ వచ్చిందట పార్టీ పెద్దలకు. దీంతో నామినేటెడ్ పదవుల భర్తీని మళ్ళీ వాయిదా వేసినట్టు తెలిసింది. మళ్లీ పదవుల పందేరం ఎప్పుడని అంటే… ఇప్పుడప్పుడే మాట్లాడవద్దు.
ఏదైనా… వచ్చే మార్చి, ఏప్రిల్ తర్వాతనే అన్నదే సమాధానం. త్వరలో మున్సిపల్ ఎన్నికలు, ఆ తరువాత పరిషత్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఇలా వరుస ఎన్నికల ముందు అటు ఇటు కాకుండా పదవులిచ్చి లొల్లి పెట్టుకోవడానికి పార్టీ సిద్ధంగా లేదు. అందుకే.. ప్రస్తుతానికి డైరెక్టర్స్ పోస్టుల్ని మాత్రమే భర్తీ చేయాలన్న ఆలోచన ఉందట. ఒకవేళ ఆ ప్రక్రియ జరిగినా… కార్పొరేషన్ ఛైర్మన్ పదవులు ఆశిస్తున్న వారు మాత్రం ఏప్రిల్ దాకా ఆగాల్సిందే. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొత్తలో 37 మందికి ఛైర్మన్ పదవులు ఇచ్చారు. వాళ్ళ పదవీకాలం కూడా… ఏప్రిల్ నాటికి పూర్తవుతుంది. ఓ ముగ్గురు నలుగురికి తప్ప…చాలా మందికి రెన్యువల్ ఛాన్స్ ఉండబోదని తెలుస్తోంది. దీంతో కొత్తగా 30 మందికి పైగా మంచి కార్పొరేషన్స్‌ని కట్టబెట్టే అవకాశం కూడా ఉంటుంది. పదవీకాలం ముగిసిన 30కి మరో 30 పదవుల్ని కలిపి ఒకే సారి 60కి పైగా కార్పొరేషన్ చైర్మన్ పదవులు, వందల సంఖ్యలో డైరెక్టర్స్ పోస్టులు భర్తీ చేస్తే… అదో పండగలా, సందడిగా ఉంటుందని భావిస్తున్నారట ప్రభుత్వ, పార్టీ పెద్దలు.
ఇప్పటికే నామినేటెడ్ పదవుల్లో కీలకంగా ఉన్న వాళ్ళను చాలా సార్లు హెచ్చరించింది పార్టీ. పదవులు వచ్చాయనుకుని రిలాక్స్ అయిపోయి పని చేయకపోతే ఎక్స్‌టెన్షన్ ఉండబోదని చెప్పేశారు. అయినాసరే… ఆ హెచ్చరికల్ని పట్టించుకోకుండా ఎక్కువ మంది పనికి దూరంగా ఉంటున్నారని, అలాంటి వాళ్ళకు ఈసారి షాక్‌లు తప్పక పోవచ్చని చెప్పుకుంటున్నాయి పార్టీ వర్గాలు. పోస్ట్ వచ్చాక రిలాక్స్ అయిన వారికి ఎట్టిపరిస్థితుల్లోనూ రెన్యువల్ ఉండబోదని అంటున్నారు. ఇప్పటికే ఆశావహులంతా ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు. దీంతో…. ఇప్పటికే పదవులు ఉన్న నాయకుల్లో ఎంత మందికి రెన్యువల్… ఎంత మంది ఇంటికి అనే టెన్షన్ మొదలైంది. ఈ అడిషన్స్, డిలిషన్స్ సంగతి ఎలా ఉన్నా… వోవరాల్‌గా తెలంగాణ కాంగ్రెస్ నేతలకు సమ్మర్ కార్నివాల్ ఉండబోతోందన్న వార్తలు మాత్రం ఊపు తెప్పిస్తున్నాయట.