Disha Salian: సెలబ్రిటీ మేనేజర్ దిశా సాలియన్ మరణం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఐదేళ్ల క్రితం జూన్ 8, 2020న ముంబైలోని మలాడ్ ప్రాంతంలోని ఒక భవనం 14వ అంతస్తు నుంచి పడి మరణించింది. ప్రారంభంలో, దీనిని పోలీసులు యాక్సిడెంటల్ డెత్ రిపోర్ట్(ఏడీఆర్)గా నమోదు చేశారు. ఈ మరణం చుట్టూ అనేక వివాదాలు నెలకొని ఉన్నాయి. దిశా సాలియన్ బాలీవుడ్‌లో అనేక మందికి మేనేజర్‌గా పనిచేశారు. ఇందులో దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కూడా ఉన్నారు.
తాజాగా, దిశా సాలియన్ తండ్రి సతీష్ సాలియన్ బాంబే హైకోర్టులో తన కూతురు మరణంపై పిటిషన్ దాఖలు చేశారు. తన కూతురిపై అత్యాచారం చేసి, హత్య చేసినట్లు పిటిషన్‌లో ఆరోపించడం గమనార్హం. జూన్ 8న దిశా తన ఇంట్లో హోమ్ పార్టీ నిర్వహించిందని ఆమె తండ్రి కూడా పేర్కొన్నారు. ఈ పార్టీకి ఆదిత్య థాకరే, అతని బాడీగార్డ్‌తో పాటు నటులు సూరజ్ పంచోలి, డినో మోరియా కూడా హాజరయ్యారు. శివసేన (యూబీటీ) ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రే ప్రమేయం ఉందని పిటిషన్‌లో పేర్కొనడం తాజా వివాదానికి కారణం.
Read Also: Metro MD NVS Reddy: మెట్రో రైళ్లపై బెట్టింగ్ యాప్ ప్రకటనలు.. ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఏమన్నారంటే?
దిశా సాలియన్ మరణించిన 6 రోజుల తర్వాత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తన ప్లాట్‌లో ఆత్మహత్యకు పాల్పడటం కూడా సంచలనంగా మారింది. మాజీ మేనేజర్ దిశతో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ప్రేమించుకున్నారనే వార్తలు కూడా ఉన్నాయి. ఇలా కొన్ని రోజుల వ్యవధిలోనే ఇద్దరి మృతి చెందడం సంచలనంగా మారింది. సతీష్ సాలియన్ తన పిటిషన్‌లో, దిశాపై ఆదిత్య ఠాక్రే దాడికి పాల్పడినట్లు ఆరోపించారు. పిటిషన్ ప్రకారం, దిశా, సుశాంత్ సింగ్ పోస్టుమార్టం టైమ్‌లను కూడా ఎత్తిచూపారు. దిశా పోస్టుమార్టానికి 50 గంటలు ఆలస్యమైనట్లు పేర్కొంది. ఈ రెండు మరణాలు జరిగిన సమయంలో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ ప్రభుత్వంలో ఉంది. ఈ రెండు మరణాలకు ఆదిత్య ఠాక్రేకు సంబంధం ఉందని బీజేపీ పదేపదే ఆరోపిస్తోంది.
ఇప్పుడు దిశా సాలియన్ అంశం మహారాష్ట్రలో రాజకీయ అంశంగా మారింది. తన ప్రతిష్టను దిగజార్చేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారంటూ ఆదిత్య ఠాక్రే అన్నారు. ఈ వివాదం వెనక బీజేపీ ప్రభుత్వం ఉందని ఆరోపించారు. తాను ఈ ఆరోపణలన్నింటికి కోర్టులో సమాధానం ఇస్తామని చెప్పారు. సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. ‘‘దిశా తండ్రి పిటిషన్ వెనక ఏదో శక్తి ఉంది. ఔరంగజేబు సమస్యను పక్కదారి పట్టించేందుకు ఈ చర్చని తీసుకువచ్చారు’’ అని ఆరోపించారు. మరోవైపు, మహారాష్ట్ర మంత్రి నితేష్ రాణే మాట్లాడుతూ.. అప్పటి మహా వికాస్ అఘాడీ కూటమి నిజాన్ని కప్పిపుచ్చిందని ఆరోపించారు.