వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరు.. ట్విస్ట్ ఏంటంటే..!
విజయవాడ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానంలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లభనేని వంశీ మోహన్‌కు భారీ ఊరట దక్కింది.. సత్యవర్ధన్ కిడ్నాప్, బెదిరింపుల కేసులో వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరు చేసింది కోర్టు.. ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో ఇప్పటికే రెండు సార్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు వంశీ.. రెండు సార్లు కూడా బెయిల్ తిరస్కరించింది కోర్టు.. దీంతో.. మూడోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు వంశీ.. ఆ పిటిషన్‌పై ఇటీవల ఇరు వర్గాల తరపు న్యాయవాదులు వాదనలు విన్న కోర్టు.. ఈ రోజు వల్లభనేని వంశీ మోహన్‌కు బెయిల్ మంజూరు చేసింది.. ఈ కేసులో వల్లభనేని వంశీ తో పాటు మరో నలుగురు నిందితులకు కూడా బెయిల్ ఇచ్చింది విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం.. అయితే, వల్లభనేని వంశీ మొదట సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయినా.. ఆ తర్వాత ఆయనపై వరుసగా మరిన్ని కేసులు నమోదు అయ్యాయి.. వంశీపై మొత్తం ఆరు కేసులు పెట్టారు.. ఆ ఆరు కేసుల్లో ఐదు కేసుల్లో బెయిల్, ముందస్తు బెయిల్ పొందారు వల్లభనేని వంశీ మోహన్.. కానీ, గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఇంకా వంశీకి బెయిల్ రాలేదు.. ఈ కేసులో ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నారు వంశీ.. దీంతో, ఇప్పుడు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో బెయిల్ వచ్చినా.. ఆయన జైలులో ఉండాల్సిన పరిస్థితి ఉంది.. కాగా, సత్య వర్ధన్ కిడ్నాప్ కేసులో ఫిబ్రవరి 13వ తేదీన హైదరాబాద్‌లో వల్లభనేని వంశీ మోహన్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం విదితమే..
ఈ జిల్లాలో 2 రోజులు భారీ వర్షాలు.. ఆ జిల్లాల్లో మండనున్న ఎండలు..
రానున్న రెండు రోజుల్లూను.. భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొనన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. రేపు అనగా.. బుధవారం 14వ తేదీన రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, వైఎస్సార్ కడప, శ్రీసత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లో పలుచోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.. ఇక, శ్రీకాకుళం, పార్వతీపురంమన్యం, విజయనగరం, కోనసీమ, పల్నాడు , గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. ఈ సమయంలో గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని.. ఈ సమయంలో భారీ హోర్డింగ్స్, చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు దగ్గర నిలబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.. ఇక, గురువారం రోజు అల్లూరి సీతారామరాజు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పలుచోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. పల్నాడు, ప్రకాశం, నంద్యాల, వైఎస్సార్, కర్నూలు, తిరుపతి జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది.. మరోవైపు.. రేపు ఉష్ణోగ్రతలు 41-43 డిగ్రీల మధ్య రికార్డు అయ్యే అవకాశం ఉందని.. విజయనగరంలోని మూడు మండలాలు, పార్వతీపురంమన్యంలోని 8 మండలాలు, తూర్పుగోదావరిలోని ఒక మండలం.. మొత్తం 12 మండలాల్లో తీవ్రవడగాలులు వీచే అవకాశం ఉండగా.. మరో 35 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు తెలిపారు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్..
కాంగ్రెస్ నేత హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. మాజీ మంత్రి కజిన్ అరెస్ట్..
కర్నూలు జిల్లాలో ఆలూరు కాంగ్రెస్ నేత లక్ష్మీనారాయణ హత్య కేసు తీవ్ర కలకలం రేపింది.. అయితే, ఈ కేసులో కొత్త మలుపు తిరుగుతుంది. ఈ కేసులో మాజీ మంత్రి, గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం కజిన్ గుమ్మనూరు నారాయణను అరెస్ట్ చేశారు పోలీసులు.. గుమ్మనూరు నారాయణ ఇంట్లో సీసీ టీవీ ఫుటేజీ స్వాధీనం చేసుకున్నారు. ఎమ్మార్పీఎస్ నేత, కాంగ్రెస్ ఆలూరు ఇంఛార్జ్‌గా ఉన్న లక్ష్మీనారాయణ హత్య కేసులో గుమ్మనూరు నారాయణ అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరిగిందని జిల్లా అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా వెల్లడించారు.. లక్ష్మీనారాయణ హత్యకేసులో గుంతకల్ కి చెందిన గౌసియా అనే మహిళతోపాటు మరికొందరిని ఇప్పటికే అరెస్ట్ చేశారు పోలీసులు. గౌసియా ఇచ్చిన సమాచారంతోనే గుమ్మనూరు నారాయణను కూడా అరెస్ట్ చేశారు. హత్యకు వాడిన టిప్పర్ కొనుగోలుకు గుమ్మనూరు నారాయణ రూ.2 లక్షలు ఆర్థిక సాయం చేశారని.. లక్ష్మీనారాయణ హత్య జరిగిన తర్వాత మరో లక్ష రూపాయలు కూడా ఇచ్చారని అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా తెలిపారు.
పెద్దిరెడ్డి భూముల వ్యవహారం.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు..
వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం భూముల వ్యవహారంలో కీలక ఆదేశాలు జారీ చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. పెద్దిరెడ్డి ఫ్యామిలీ చిత్తూరు జిల్లాలో అటవీ, ప్రభుత్వ, బుగ్గ మఠం భూములను ఆక్రమణలపై వచ్చిన ఆరోపణలపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీ విచారణ చేసి నివేదిక ఇచ్చారు. ఈ నివేదికలో సంబంధిత శాఖల భూములు అక్రమణలకు గురవుతుంటే రక్షించలేని వారిని బాధ్యులను చేయాలని, ఆక్రమణదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సిఫార్సు చేసిందని గుర్తు చేశారు పవన్ కల్యాణ్.. పెద్దిరెడ్డి భూముల వ్యహారంపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీ నివేదికను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ పరిశీలించారు.. అటవీ భూముల అక్రమణలకు సంబంధించిన అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో చర్చించారు. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీ సిఫార్సులకు అనుగుణంగా చర్యలకు ఉపక్రమించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు పవన్ కల్యాణ్.. అటవీ భూములను సంరక్షించలేకపోయిన అధికారులను గుర్తించి నివేదిక రూపొందించి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.. అదే విధంగా భూములు ఆక్రమించినవారిపై క్రిమినల్ కేసులతోపాటు, అటవీ పర్యావరణ చట్టాలను అనుసరించి కేసులు నమోదు చేయాలని ఆదేశించారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
కాంగ్రెస్ ప్రభుత్వంపై వరుస పోరాటాలకు సిద్ధం కావాలి..
ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో నిర్వహించిన కీలక సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని పీడిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై వరుస పోరాటాలకు సిద్ధం కావాలి అని పిలుపునిచ్చారు. హామీలు అమలు చేయకుండా మోసం చేస్తున్న కాంగ్రెస్ ద్రోహాన్ని ప్రజలకు వివరించండి అన్నారు. వాగు దాటే దాక ఓడ మల్లన్న.. వాగు దాటినంక బోడి మల్లన్న అన్నట్టు రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలన ఉందన్నారు. వరంగల్ సభతో కాంగ్రెస్ అంతానికి ఆరంభం మొదలైంది.. కాంగ్రెస్ అరాచకాలను ఒక్క బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఎదుదుర్కొంటందని కేటీఆర్ తెలిపారు. అయితే, రైతుల ఆత్మహత్యలు, వారి సమస్యల పరిష్కారంపై రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ విస్తృతంగా పోరాటాలు చేసేందుకు సిద్ధమవుతుందని కేటీఆర్ పేర్కొన్నారు. మోసానికి మారుపేరైన కాంగ్రెస్ నైజాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగడతామని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలును ఎలా విస్మరించిందో ప్రజలకు వివరిస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో నెలకున్న సమస్యలను ప్రజలకు తెలిసేలా బీఆర్ఎస్ ముందుకు సాగుతుందని కేటీఆర్ వెల్లడించారు.
అస్సాం పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం..
అస్సాం అసెంబ్లీ ఎన్నికల ముందు జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అధికార బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి క్లీన్ స్వీప్ చేసింది. దాదాపుగా రాష్ట్రంలోని అన్ని స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. మొత్తం 376 జిల్లా పరిషత్ స్థానాలకు గానూ బీజేపీ ఏకంగా 300 స్థానాలు గెలుచుంది. 76 శాతానికి పైగా ఓట్లు సాధించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2192 స్థానాల్లో 1436 స్థానాలను గెలుచుకుని సత్తా చాటింది. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ మొత్తం మీద 66 శాతం ఓట్లతో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. పంచాయతీ ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ విజయం ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వానికి పటిష్టం చేస్తుందని అన్నారు. ఎన్డీయే సంక్షేమ పథకాలను ఆయన హైలెట్ చేశారు. ప్రచారంలో మద్దతు ఇచ్చిన బీజేపీ నేతలు జేపీ నడ్డా, అమిత్ షా, బీఎల్ సంతోష్‌లకు థాంక్స్ తెలిపారు. 2018 పంచాయతీ ఎన్నికలతో పోలిస్తే ఈసారి గణనీయమైన మెరుగుదల కనిపించినట్లు వెల్లడించారు. గత ఎన్నికలతో పోలిస్తే ఓట్లు 25 శాతం మేర పెరిగినట్లు తెలిపారు.
ఆపరేషన్ సిందూర్‌తో “బ్రహ్మోస్”కి సూపర్ క్రేజ్.. కొనుగోలుకు 17 దేశాలు క్యూ..
ఆపరేషన్ సిందూర్‌లో భారతీయ ఆయుధాలకు ప్రపంచ వ్యాప్తంగా ఎనలేని క్రేజ్ వచ్చింది. చైనీస్ మిస్సైల్స్, టర్కీష్ డ్రోన్లను స్వదేశీ తయారీ ఆయుధాలతో మట్టికరిపంచారు. దీంతో పాటు బ్రహ్మోస్ క్షిపణులు ఈ ఆపరేషన్‌లో చాలా సమర్థంతంగా పనిచేసినట్లు తేలింది. ముఖ్యంగా, పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్సులో ఉన్న బహవల్పూర్‌లోని జైషే మహ్మద్ ప్రధాన కార్యాలయాన్ని బ్రహ్మోస్ క్షిపణితోనే లేపేసినట్లు తేలింది. ఇదే కాకండా పాకిస్తాన్ వైమానిక స్థావరాలపై అత్యంత ఖచ్చితత్వంతో దాడులు జరిగాయి. వీటిలో కూడా బ్రహ్మోస్ క్షిపణులు ఉపయోగించినట్లు రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో, ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మోస్ క్షిపణులకు భారీ డిమాండ్ ఏర్పడింది. భూమి, గాలి, సముద్రం నుంచి ప్రయోగించగలిగే సామర్థ్యం ఉన్న ఈ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్‌ని దక్కించుకోవడానికి పలు దేశాలు పోటీ పడుతున్నాయి. ఫిలిప్పీన్స్ 2022లోనే 375 మిలియన్ డాలర్లతో బ్రహ్మోస్ కోసం ఒప్పందం చేసుకుంది. మొదటి షిప్‌మెంట్ 2024లో డెలివరీ చేశారు. ఇదే కాకుండా, ఇండోనేషియా, వియత్నాం, మలేషియా, థాయ్‌లాండ్, సింగపూర్, బ్రూనై, బ్రెజిల్, చిలీ, అర్జెంటీనా, వెనుజులా వంటి దేశాలు కూడా తమ తీర్ ప్రాంత రక్షణ కోసం బ్రహ్మోస్ క్షిపణులను కొనుగోలు చేయాలని భావిస్తున్నాయి. వీటితో పాటు ఈజిప్ట్, సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, ఒమన్ వంటి మిడిల్ ఈస్ట్ దేశాలు కూడా చర్చిస్తున్నాయి.
అప్పుడు మాల్దీవులు, ఇప్పుడు టర్కీ.. ఇండియా దెబ్బకు విలవిల..
చైనాకు మద్దతు ఇస్తూ భారత్‌కి వ్యతిరేకంగా ఉంటే ఏమవుతుందో గతంలో మాల్దీవులకు తెలిసి వచ్చింది. చివరకు భారత్ శరణుజొచ్చింది. ప్రస్తుతం టర్కీ కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటోంది. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, టర్కీ పాకిస్తాన్‌కి మద్దతు ఇస్తూ వస్తోంది. దాడిలో చనిపోయిన బాధితులకు సంతాపాన్ని తెలపకపోగా, ఉగ్రవాదులపై భారత్ చేసిన ‘‘ఆపరేషన్ సిందూర్’’ని తప్పుపట్టింది. అమాయక పాక్ పౌరులపై భారత్ దాడి చేస్తుందనే ఆరోపణలు చేసింది. ఇదే కాకుండా, పెద్ద ఎత్తున పాకిస్తాన్‌కి డ్రోన్లను అందించింది. ఈ డ్రోన్లతోనే పాక్ భారత్‌పై దాడికి పాల్పడినట్లు తర్వాత విచారణలో తేలింది. ఇదిలా ఉంటే, ఇప్పుడు భారత ప్రజలు టర్కీపై తీవ్ర వ్యతిరేకత చూపుతున్నారు. ఎక్స్‌లో టర్కీని బాయ్‌కాట్ చేయాలని ట్రెండ్ అవుతోంది. టర్కీ యాపిల్స్‌ని భారత్ ఎక్కువగా దిగుమతి చేసుకుంటుంది. అయితే, ఇప్పుడు టర్కీ నుంచి వచ్చే యాపిల్స్‌ని పలువురు వ్యాపారులు బ్యాన్ చేస్తున్నారు. మహారాష్ట్రలో పూణేలోని యాపిల్ వ్యాపారులు టర్కీష్ యాపిల్స్ బాయ్ కాట్ చేయాలని నిర్ణయించుకున్నాయి. మరోవైపు, టర్కీ పర్యాటక శాఖ, భారతీయులు తమను బాయ్‌కాట్ చేయొద్దని వేడుకుంటోంది. మెజారిటీ టర్కీ ప్రజలకు భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల గురించి తెలియదని, ఇండియన్ టూరిస్టులను ఆహ్వానిస్తున్నామని చెప్పింది. టర్కీ ట్రిప్‌లను క్యాన్సల్ చేసుకోవద్దని చెప్పింది. ఇవన్నీ చూస్తే టర్కీకి భారత్ దెబ్బ గట్టిగానే తగిలినట్లు కనిపిస్తోంది. టర్కీ ముఖ్యంగా టూరిజంపై ఆధారపడి ఉంది. ప్రతీ సంవత్సరం లక్షలాది మంది భారతీయలు ఆ దేశానికి వెళ్తుంటారు. ఇప్పుడు టర్కీ పాకిస్తాన్‌కి మద్దతు ఇవ్వడంతో భారత్ నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది.
టెస్ట్ క్రికెట్‌లో ముగిసిన రోకో శకం.. టీమిండియాను నడిపించే నాయకుడెవరు?
ఇంగ్లాడ్ పర్యటనకు ముందు క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ టెస్టులకు వీడ్కోలు పలికాడు. కెప్టెన్ రోహిత్ శర్మ బాటలోనే అతడు కూడా సుదీర్ఘ ఫార్మాట్ నుంచి వైదొలిగాడు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగభరిత పోస్ట్ పెట్టాడు. టెస్టుల నుంచి రిటైరవ్వాలనుకుంటున్నట్లు ఇటీవల బీసీసీఐకి చెప్పిన కోహ్లీ.. తాజాగా దీనిపై అధికారిక ప్రకటన చేశాడు. అయితే, గతేడాది టీ20 ప్రపంచకప్ గెలిచిన అనంతరం రోహిత్ శర్మ, కోహ్లీ ఒకేసారి పొట్టి క్రికెట్‌కు టాటా చెప్పారు. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం రోహిత్ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి అభిమానులకు షాకిచ్చాడు. అతడు వైదొలగడంతో ఇంగ్లాండ్ పర్యటనకు కోహ్లీ అత్యంత కీలకమవుతాడని అంతా భావించారు. అంతలోనే తాను కూడా రిటైర్ అవ్వాలనుకుంటున్నానని విరాట్ బీసీసీఐకి సమాచారమిచ్చాడు. దీంతో అతడికి సర్ది చెప్పేందుకు బోర్డు ప్రయత్నించింది. కానీ, కోహ్లీ మాత్రం తన టెస్టు కెరీర్‌ను ముగించేందుకే సుముఖత చూపించాడు. ఇక, 2011 మధ్యలో టెస్టు క్రికెట్‌లోకి అడుగుపెట్టిన కోహ్లీ.. ఇప్పటి వరకు 123 టెస్టులు ఆడి 9,230 పరుగులు సాధించాడు. ఇందులో 30 శతకాలు, 31 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ ఫార్మాట్‌లో విరాట్ వ్యక్తిగత అత్యధిక స్కోరు 254 పరుగులు. 2025 జనవరి 3న ఆస్ట్రేలియాతో చివరి టెస్టు ఆడాడు. టెస్టుల్లో ఎన్నో గొప్ప ఇన్నింగ్స్‌లు ఆడిన విరాట్.. పదివేల పరుగుల మైలురాయికి కొద్ది దూరంలోనే నిలిచి.. ఈ ఫార్మాట్ నుంచి వైదొలిగాడు.
వెన్నులో వణుకు పుట్టించే సినిమా.. ఈనెల15 అర్ధరాత్రి బెనిఫిట్ షో
ఫైనల్ డెస్టినేషన్.. హాలీవుడ్ లో ఈ ఫ్రాంచైజీకి ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎందుకంటే చావు ఎన్ని రకాలుగా ఉంటుందో ఈ సినిమాల్లో చూపించారు. ఫైనల్ డెస్టినేషన్ పేరుతో రూపొందిన హాలీవుడ్ భయానక థ్రిల్లర్ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల్లో ఎలాంటి ఇంపాక్ట్‌ని క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 112 మిలియన్‌లకు మించి వసూళ్లను రాబట్టింది. ఆ తరువాత 2003, 2006, 2009, 20011లో వరుసగా సిరీస్‌లు విడుదల కాగా.. ఇవి మేకర్స్‌ను డబ్బులతో ముంచెత్తాయి. దాదాపు 14 ఏళ్ల తర్వాత ఈ ఫ్రాంచైజీలోని ఆరో భాగం విడుదలకు సిద్ధమైంది. “ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్” పేరుతో ప్రేక్షకుల ముందు రావడానికి సిద్ధమైంది. ఈ మూవీకి జాచ్ లిపోవిస్కీ దర్శకత్వం వహించగా.. కైట్లీన్ సాంట జువాన కీలక పాత్రలో నటించారు. ఈ నెల 16న ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కాబోతోంది. కాగా.. 15వ తేదీనే మన దేశంలో రిలీజ్ చేస్తున్నారు. హైదరాబాద్‌లో కూడా బెనిఫిట్ షోలో భాగంగా 15వ తేదీ రాత్రి 11.59 నిమిషాలకు రిలీజ్ అవుతుంది. ఈ ట్రైలర్ సైతం చాలా భయానకంగా ఉంది. చిన్న వస్తువులే మన ప్రాణాలు తీస్తాయో ఇందులో చూయించి భయపెట్టారు.