Off The Record: ఆ జిల్లాలో ఇసుక లొల్లి అధికార పార్టీ ఎమ్మెల్యేలను ఇరకాటంలో పెడుతోందా? తవ్వకాల్లో ద్వితీయ శ్రేణి నేతలు పోటీలు పడుతున్నారా? ఆపండ్రా బాబూ… అని ఎమ్మెల్యేలు మొత్తుకుంటున్నా పట్టించుకునే పరిస్థితి లేదా? మంజీరాను చెరబట్టి అడ్డగోలుగా ఇసుక తవ్వేస్తున్న ఆ నాయకులెవరు? ఏయే నియోజకవర్గాల్లో జరుగుతోందా వ్యవహారం?
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని జుక్కల్, బాన్సువాడ, బోధన్ నియోజకవర్గాల్లో.. ఇసుక దందా జోరుగా నడుస్తోందన్న ఆరోపణలున్నాయి. హస్తం పార్టీ ద్వితీయ శ్రేణి నేతలు… ఇందులో మునిగి తేలుతున్నారట. ఎమ్మెల్యేల కనుసన్నల్లో కొంత.. వాళ్ళ పేర్లు చెప్పి మరింత దందా చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. మంజీరా పరీవాహక ప్రాంత క్వారీల్లో తవ్వకాలకు అనుమతులు నిలిపివేసినా.. ఏ మాత్రం వెరపు లేకుండా అడ్డగోలు తవ్వకాలు జరిగిపోతున్నాయట. ఇక్కడి నుంచి హైదరాబాద్‌తో పాటు పొరుగు రాష్ట్రాలకు కూడా పెద్ద ఎత్తున ఇసుక అక్రమ రవాణా జరుగుతోందంటున్నారు స్థానికులు. లోకల్ అవసరాలు, ప్రగతి పనుల పేరిట తాత్కాలిక అనుమతులు తీసుకుని వందల లారీల్లో ఇసుక తరలించేస్తున్నారట. జుక్కల్ నియోజకవర్గంలో క్వారీలు స్ధానిక ఎమ్మెల్యే తోట లక్ష్మికాంతరావు ఫిర్యాదుతో గతంలో మూత పడగా.. ప్రస్తుతం ఆయన అనుచరులు దొంగ చాటుగా ట్రాక్టర్లతో తరలించి రహస్య ప్రాంతాల్లో డంప్ చేస్తున్నారట.
Read Also: Niharika : అల్లు అర్జున్ తో లవ్ స్టోరీ చేయాలని ఉంది.. మహేశ్ తో అలాంటి మూవీ..
ఇక, ఆ ఇసుకని రాత్రి వేళల్లో టిప్పర్ల ద్వారా తరలిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ఎమ్మెల్యే పేరు చెప్పి కొందరు ఈ అక్రమ దందా నడిపిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అటు బాన్సువాడలోను అక్రమ ఇసుక రవాణా స్దానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డికి తలనొప్పిగా మారినట్టు తెలిసింది. అభివృద్ది పనుల పేరు ఓ యువ నేత ముఖ్య అనుచరులు బీర్కూర్ క్వారీలో రాత్రి వేళల్లో తెగ తవ్వేస్తున్నట్టు సమాచారం. ఎమ్మెల్యే పేరు చెప్పి.. ఈ అక్రమ దందా నడిపిస్తున్నారట ఆయన అనుచరులు. ఇక బోధన్ లోనూ మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి అనచురులు ఇసుక దందాలో మునిగి తేలుతున్నట్టు సమాచారం. మూడు పాయింట్లలో స్థానిక అవసరాల పేరిట తవ్విపోసుకుంటున్నారట. దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో తాత్కాలిక బ్రేక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. చివరికి ఇసుక దందాకు ,కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పడం చర్చనీయాంశమైంది. అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం మోపాలని.. స్వయంగా ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యేలు ఇసుక దందాల్లో తలదూర్చొద్దని కూడా చెప్పేశారు.
Read Also: Vijay Devarakonda : బిజీ లైఫ్ లో పేరెంట్స్ తో గడపండి.. విజయ్ స్పెషల్ పోస్ట్
అయితే, బోధన్, బాన్సువాడ, జుక్కల్ ఎమ్మెల్యేలు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు, ప్రభుత్వ అవసరాలకు మాత్రమే ఇసుక తవ్వకాలకు అనుమతులివ్వాలని అధికారులకు మౌఖిక ఆదేశాలిచ్చారట. కానీ… దాన్నే అలుసుగా తీసుకుని ద్వితీయ శ్రేణి నేతలు దున్నేస్తున్నట్టు తెలుస్తోంది. ఒక ట్రాక్టర్‌కు అనుమతి తీసుకుని పదుల సంఖ్యలో తవ్వి తరలిస్తున్నారనే ప్రచారం ఉంది. అనుమతిలేని ప్రాంతాల్లోనూ రాత్రి పగలు తేడా లేకుండా పెద్ద ఎత్తున తవ్వకాలు జరుపుతున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. ఎమ్మెల్యేల మౌఖిక ఆదేశాలు ఉండటంతో.. రెవెన్యూ, పోలీసు అధికారులు అక్రమ రవాణా అడ్డుకోకుండా.. ఇసుక వ్యాపారులతో చేతులు కలుపుతున్నట్టు చెప్పుకుంటున్నారు. అయితే… తామేదో అనుకుని ఆదేశాలిస్తే… వాటిని ఎటెటో… తీసుకుపోతున్నారని, చివరికి అది మాకు చుట్టుకుంటోందని ఎమ్మెల్యేలు ఫీలవుతున్నట్టు సమాచారం. ఆ దందా వద్దే వద్దూ అంటూ కొందరు క్వారీలను మూసేయిస్తుంటే.. మరికొందరు నిబంధన ప్రకారం తవ్వుకోండి కానీ బద్నాం చేయకండ్రా బాబూ… అంటూ బతిమాలుకుంటున్నారట. మొత్తం మీద మూడు నియోజకవర్గాల్లో ద్వితీయ శ్రేణి నేతలే.. ఇసుక వ్యాపారుల అవతారం ఎత్తి దున్నేస్తున్నారన్నది లోకల్ వాయిస్. అయితే… ఎంత లేదంటున్నా… ఎమ్మెల్యేలకు తెలియకుండా అంత దందా నడుస్తోందా? ప్రమేయం లేకుండా సాధ్యమేనా అన్న డౌట్స్‌తో వాళ్ళ పాత్ర మీద ఆరా తీసే పనిలో ఉందట ప్రభుత్వం. ఇసుక మరకలు మంచివా కాదా… ఎవర్ని ఎంతవరకు డ్యామేజ్ చేస్తాయో తేలాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే.