Off The Record: వైసీపీలో ఆ జిల్లా అధ్యక్షుడిని మార్చేయాలన్న డిమాండ్ పెరుగుతోందా? పార్టీ పెద్దలు కూడా …. ఎందుకొచ్చిన గొడవరా… బాబూ…. మార్చేస్తే పోలా అని అనుకుంటున్నారా? నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆ సీనియర్ నేతకు ఇప్పుడెందుకు ఆ పరిస్థితి వచ్చింది? ఆయన్ని కాదని మరొకరికి ఇవ్వాలని కేడరే డిమాండ్ చేయడానికి రీజనేంటి?
Read Also: Neha Sharma : ఘాటు అందాలతో రెచ్చిపోయిన నేహాశర్మ..
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.. పల్నాడు జిల్లా మాచర్ల నుంచి వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మొదట కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అయినా… వైసీపీ ఆవిర్భావం తర్వాత జగన్ చెంత చేరారాయన. ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి మాటకు తిరుగులేదన్నట్టుగా ఉండేది. అయితే, గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి చేతిలో ఓడిపోయారు పిన్నెల్లి. పోలింగ్ రోజున, ఆ తర్వాత మాచర్లలో జరిగిన ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. దీంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై వరుస కేసులు బుక్ అయ్యాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నెలల పాటు అజ్ఞాతంలో ఉన్నారు మాజీ ఎమ్మెల్యే. తర్వాత అరెస్టయి 52రోజుల పాటు జైల్లో ఉన్నారు కూడా. బెయిల్ మీద బయటకు వచ్చినా.. చాలా రోజులపాటు నియోజకవర్గానికి దూరంగానే ఉన్నారు పిన్నెల్లి. అడపాదడపా మినహా నియోజకవర్గానికి రావడం లేదంటున్నారు కార్యకర్తలు. అటు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పల్నాడు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా నియమించింది అధిష్టానం.
Read Also: Iran – Israel War : లైవ్ లో యాంకర్ న్యూస్ చదువుతుండగా ఇజ్రాయెల్ దాడి..
రెండోసారి కూడా ఆయనకే ఎక్స్‌టెన్షన్ ఇచ్చారు. ఇక ప్రస్తుతం మారిన పరిస్థితుల్లో మాజీ ఎమ్మెల్యే వైఖరిని పార్టీ పెద్దలు ఇబ్బందిగా ఫీలవుతున్నట్టు సమాచారం. ఇటీవల పార్టీ కార్యక్రమాలు పెరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై ఆందోళనకు సిద్ధమవుతోంది వైసీపీ. ఇప్పటికే కొన్ని కార్యక్రమాలు నిర్వహించగా.. మెల్లిగా ఉధృతి పెంచాలనుకుంటోందట వైసీపీ అధిష్టానం. ఇటీవల నిర్వహించిన వెన్నుపోటు దినం పార్టీ కేడర్‌లో జోష్ తీసుకువచ్చిందని భావిస్తున్న అధిష్టానం అదే ఊపును కొనసాగించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అయితే… పల్నాడు విషయంలో ఇక్కడే వైసీపీకి కొత్త చిక్కు వచ్చిపడిందట. జిల్లా అధ్యక్షుడిగా ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నా… మరికొన్నిటికి అటెండ్ అవలేని పరిస్థితి. రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పటి నుంచి జనంలో కంటే అజ్ఞాతంలోనే ఎక్కువగా ఉంటున్నారు మాజీ ఎమ్మెల్యే. ఇటీవల వెల్దుర్తి మండలం గుండ్లపాడులో ఇద్దరు టీడీపీ నేతల హత్యలు జరిగాయి. వాటికి సంబంధించి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద కూడా కేసు నమోదైంది. దీంతో మరోసారి అజ్ఞాతంలోకి వెళ్లారాయన.
Read Also: Off The Record: ఢిల్లీ, గల్లీ ఎవ్వరైనా సరే.. డోంట్ కేర్.. అస్సలు తగ్గేదేలే..
వైసీపీ నిర్వహించిన వెన్నుపోటు దినం కార్యక్రమానికి కూడా హాజరుకాలేకపోయారు. జిల్లాలో పార్టీని ముందుండి నడిపించాల్సిన అధ్యక్షుడు తరచూ… ఇలా అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం ఇబ్బందికరంగా మారుతోందట. అందుకే పిన్నెల్లి స్థానంలో మరొకరిని పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా నియమిస్తే బాగుంటుందన్నది కొందరు పార్టీ పెద్దల అభిప్రాయంగా తెలుస్తోంది. మొదట్లో ఈ ప్రతిపాదనను పెద్దగా పట్టించుకోకపోయినా…. ఇక నుంచి పార్టీ కార్యక్రమాల్ని మరింతగా ముందుకు తీసుకెళ్లాల్సి రావడంతో… ముఖ్యులు కూడా ఆలోచనలో పడ్డట్టు సమాచారం. అందుబాటులో ఉండే నేతను పార్టీ అధ్యక్షుడిగా నియమిస్తే బాగుంటుందని భావిస్తున్నట్టు వైసీపీలో పెద్దఎత్తున గుసగుసలాడేసుకుంటున్నారు. పల్నాడు జిల్లా అధ్యక్ష పదవి రేసులో ప్రధానంగా విడదల రజని, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కాసు మహేష్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. గోపిరెడ్డి, కాసు మహేష్ రెడ్డి జిల్లా కేంద్రమైన నర్సరావుపేటలోనే ఉంటున్నారు. దీంతో వీరిద్దరూ రేస్‌లో ముందున్నట్టు సమాచారం. ఇక ఈ ఇద్దరితోపాటు మాజీ మంత్రి విడదల రజని పేరు కూడా వినిపిస్తోంది.
బీసీ సామాజికవర్గం, మహిళ కావడంతో తనకే పదవి వస్తుందని భావిస్తున్నారట ఆమె. ఇదే సమయంలో వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కూడా పోటీలో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులుకు బొల్లాకు అస్సలు పడదు. దీంతో అదే సామాజికవర్గానికి చెందిన బొల్లాకు జిల్లా అధ్యక్షపదవి ఇస్తే ఎలా ఉంటుందని కూడా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. రెండు రోజుల్లో జగన్ పల్నాడు జిల్లా పర్యటన ఉన్నందున ఆ లోపే కొత్త అధ్యక్ష నియామకం జరుగుతుందని మాట్లాడుకుంటున్నాయి వైసీపీ వర్గాలు. ఇదే సమంయలో పిన్నెల్లికి కూడా అధ్యక్ష పదవి కాకున్నా… పార్టీ పరమైన మరో పోస్ట్ ఇవ్వాలనుకుంటున్నట్టు సమాచారం. ప్రస్తుతం పల్నాడు జిల్లా అధ్యక్ష పదవి వ్యవహారం వైసీపీలో హాట్ టాపిక్ అయింది.