Off The Record: ఆ ఎమ్మెల్యే ఏపార్టీలో ఉన్నారు? మనసొక చోట, మనువొకచోట అన్నట్టుగా ఆయన వ్యవహారం ఉందా? జనం గెలిపించిన పార్టీలేనే ఉన్నానంటారు. కానీ… అధికార పార్టీ ఎంపీ వెళితే నాకు సమాచారం ఇవ్వలేదని రచ్చ చేస్తారు. ఏంటి ఆయన ఉద్దేశ్యం? ఏకకాలంలో రెండు పార్టీల్లో ఉండాలనుకుంటున్నారా? ఎవరా ఎమ్మెల్యే? ఎందుకా రెండు పడవల ప్రయాణం?
Read Also: Congress BC Leaders: రేపు తెలంగాణ గవర్నర్ను కలవనున్న కాంగ్రెస్ బీసీ నేతలు..
లోక్‌సభ సభ్యుడు…. తన నియోజక వర్గంలో ఎక్కడైనా సరే.. ఎమ్మెల్యేలకు ముందస్తు సమాచారం ఇచ్చి తిరగొచ్చు. సొంత పార్టీ ఎమ్మెల్యే అయితే ఖచ్చితంగా చెప్పాలి. ఉద్దేశ్యపూర్వకంగా గొడవ పెట్టుకోవాలనుకుంటే తప్ప.. సాధారణంగా లొల్లి ఎందుకులే అనుకుంటూ అందర్నీ కలుపుకుని పోతుంటారు ఎంపీలు. కానీ…. నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవికి ఇప్పుడో చిక్కొచ్చి పడిందట. ఏ పార్టీలో ఉన్నారో తెలియని ఎమ్మెల్యేకి ఎలా సమాచారం ఇచ్చి నియోజకవర్గంలో తిరగాలో అర్ధంకావడం లేదట ఆయనకు. ఇక అసలు విషయానికి వస్తే.. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి ఏ పార్టీలో ఉన్నారో అర్ధం కావడం లేదట. బీఆర్‌ఎస్ బీ ఫామ్ మీద గెలిచిన ఎమ్మెల్యే… తర్వాత కాంగ్రెస్ గూటికి చేరారు. కానీ.. ఇటీవల మారుతున్న రాజకీయ పరిణామాలతో… కృష్ణమోహన్‌రెడ్డి ఇచ్చిన స్టేట్‌మెంట్ అందర్నీ గందరగోళంలో పడేసిందట. నేను కాంగ్రెస్‌లోకి వెళ్ళలేదు. బీఆర్‌ఎస్‌లోనే ఉన్నా.. ఒకవేళ ఎవరన్నా నన్ను కాంగ్రెస్ ఎమ్మెల్యే అంటే కేసు పెడతానని స్టేట్‌మెంట్ ఇచ్చారు. అక్కడితో ఆది దానికే కట్టుబడి ఉంటే మేటర్ వేరే.
Read Also: Off The Record: టీటీడీలో ఆ పోస్ట్ అంటే పిచ్చ క్రేజ్..! కల్తీ నెయ్యి వ్యవహారం తర్వాత మారిపోయిన సీన్
కానీ, జనం గెలిపించిన పార్టీలో ఉన్నానని ఓవైపు స్టేట్మెంట్ ఇస్తూనే.. మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యే మాదిరిగా.. నాకు చెప్పకుండా నా నియోజకవర్గంలోకి ఎందుకు వచ్చావంటూ ఎంపీతో గొడవపడటం గందరగోళానికి దారితీస్తోంది. దీంతో ఇప్పుడసలు కృష్ణమోహన్‌రెడ్డి బీఆర్‌ఎస్‌లో ఉన్నట్టా? లేక ఎంపీతో గొడవపడటం ద్వారా తాను కాంగ్రెస్‌లో ఉన్నానని చెప్పకనే చెబుతున్నారా అన్న డౌట్స్ వస్తున్నాయట పొలిటికల్ సర్కిల్స్‌లో. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇదెక్కడి లొల్లిలా బాబూ… అంటూ తలలు పట్టుకోవడం కాంగ్రెస్ లీడర్స్ వంతవుతోందట. బీఆర్‌ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లోకి జంప్ అయిన కృష్ణమోహ్‌రెడ్డి ఆ మధ్య స్వరం మార్చారు. నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేనని…. ఫ్లెక్సీల్లో ఫోటోలు వేస్తున్నారు… కానీ నేను బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేని అంటూ పోలీస్ కంప్లయింట్ ఇవ్వడం ద్వారా రచ్చకు ఆయనే తెర తీశారన్నది స్థానికంగా ఉన్న అభిప్రాయం. తీరా ఇప్పుడు గద్వాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ పర్యటిస్తే… అదే పార్టీ ఎమ్మెల్యేలాగా ఫీలైపోయి నిలదీయడం ఏంటి? ఇంతకీ ఆయనే పార్టీలో ఉన్నట్టు అన్న ప్రశ్నలు వస్తున్నాయట. కొంపదీసి ఓ సినిమాలో డైలాగ్ చెప్పినట్టు… నేను తెలుగు భాష లెక్క. ఆడా ఉంటా, ఈడా ఉంటానని అంటారా ఏంటి అంటూ సెటైర్స్ వేస్తున్నారు ప్రత్యర్థులు. నేను బీఆర్‌ఎస్‌లోనే ఉన్నానని అంత గట్టిగా స్టేట్‌మెంట్ ఇచ్చిన కృష్ణమోహన్‌రెడ్డికి కాంగ్రెస్ ఎంపీ నియోజకవర్గంలో పర్యటిస్తే వచ్చిన నష్టం ఏంటన్నది మల్లు రవి అనుచరుల ప్రశ్న. అంతకు ముందు కూడా గద్వాలలో భూ భారతి అవగాహనా సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి పొంగులేటి వాహనంలోనే ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. ఇద్దరూ కొట్టుకోలేదుగానీ… మంత్రి ముందే దాదాపు అంత పని చేశారట.
Read Also: Pakistan: కరాచీ, లాహోర్ ఎయిర్‌స్పేస్‌ని పాక్షికంగా మూసేసిన పాకిస్తాన్..
కాగా, ఈ పరిస్థితుల్లో.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గానికి కాంగ్రెస్ ఎమ్మెల్యే వెళితే… సమాచారం ఇవ్వాలా..? ప్రత్యర్ధి పార్టీ ఎమ్మెల్యే ఉన్న చోట అధికార పార్టీ ఎంపీ పర్యటన చెయ్యొద్దా..? అన్న కొత్త వాదనను తెరమీదకు తెచ్చిందట మల్లు వర్గం. దీంతో… అసలు ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కన్ఫ్యూజ్ అవుతున్నారా..? లేక కావాలని ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారా అన్నది అర్ధం కావడం లేదంటున్నారు పరిశీలకులు. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరలేదన్నది ఆయన మాటే, ఇప్పుడు ఎంపీ నాకు చెప్పకుండా రావడం ఏంటన్నదీ ఆయన ప్రశ్నే. ఏక కాలంలో ఈ రెండూ ఎలా సాధ్యమవుతాయన్నది కాంగ్రెస్ నాయకుల ప్రశ్న. అసలు విషయం ఏంటంటే… గద్వాల కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సరితా తిరుపతయ్యను ఎంపీ మల్లు రవి ప్రోత్సహిస్తున్నారన్నది ఎమ్మెల్యే అభ్యంతరం. అయితే… ఇక్కడే ఓ చిన్న లాజిక్ మిస్ అవుతున్నారాయన. కాంగ్రెస్ ఎంపీ… ఆ పార్టీ ఇన్ఛార్జ్‌ని కాకుండా…బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేని ప్రోత్సహిస్తారా..? అన్న టాక్ నడుస్తోంది నియోజకవర్గంలో. ఇదే సమయంలో కృష్ణమోహన్‌రెడ్డి అవసరాలు మాత్రం కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయి. కానీ… అనర్హత పిటిషన్ సుప్రీం కోర్ట్‌లో ఉన్నందున దాన్నుంచి తప్పించుకోవడానికే తూచ్… నేను పార్టీ మారలేదని స్టేట్‌మెంట్స్ ఇస్తూ… రికార్డ్ కోసం పోలీస్ కంప్లయింట్ ఇచ్చారా అన్న చర్చలు సైతం నడుస్తున్నాయి. ఇదంతా చూస్తున్న లోకల్ లీడర్స్ మాత్రం… కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వానికి అర్ధమలుతోందో లేదోగానీ….. ఇంటి వాణ్ణి ఇల్లరికం ఇచ్చి.. బయట వాడిని అరువు తెచ్చుకున్నట్టు ఉందని అంటున్నారట. ఇస్తే.. పూర్తి స్థాయిలో పాత వాళ్ళకయినా అధికారం ఇవ్వాలి. లేదంటే… ఎమ్మెల్యే దాగుడు మూతలకు చెక్ పెట్టి ఆయన్ని ఓన్ చేసుకోవాలి. అదీఇదీ కాకుండా తమాషా చూస్తుంటే మాత్రం గద్వాలలో పార్టీ రెంటికి చెడ్డ రేవడిలా అవుతుందన్న అభిప్రాయం కాంగ్రెస్ వర్గాల్లోనే బలపడుతోంది. రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఈ విషయంలో దృష్టి పెట్టాలంటోంది గద్వాల కాంగ్రెస్ కేడర్.