Off The Record: నోరుంది కదా.. అని ఊరికే ఏదిపడితే అది వాగేయడం కాదు. మాట చెప్పాక దాని మీద నిలబడాలన్నది ఓ పాపులర్ సినిమా డైలాగ్. ఈ డైలాగ్‌ని ఆ మాజీ ఎమ్మెల్యేకి అప్లయ్ చేస్తూ… తెగ మాట్లాడేసుకుంటున్నారట రాజకీయ ప్రత్యర్థులతోపాటు సొంత పార్టీ నాయకులు కూడా. గన్‌మెన్‌ను వదిలి, ఫోన్ స్విచాఫ్ చేసుకుని 20 రోజులుగా కనిపించకుండా పోయిన ఆ మాజీ ఎవరు? ఆయనది భయమా లేక ముందస్తు బెయిల్ కోసం చేస్తున్న అజ్ఞాత వాసమా?
Read Also: Off The Record: గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఏ పార్టీలో ఉన్నారు..?
అంతన్నాడింతన్నాడు.. అంతే లేకుండా పోయాడు. ఈసారి నేను ఓడిపోతే… మీసం తీసేసుకుంటానంటూ.. మెలేసి మరీ ఒట్టేశాడు. ఇప్పుడు మీసం సంగతి దేవుడెరుగు.. అసలు మనిషే కనిపించకుండా మాయమైపోయాడంటూ…. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి గురించి మాట్లాడుకుంటున్నారట నియోజకవర్గంలో. మీసాలు మెలేసిన మనిషి ఆ స్థాయికి తగ్గట్టు ఉండకుండా గన్‌మెన్‌ను వదిలేసి… చివరికి ఫోన్ కూడా స్విచాఫ్ చేసి అండర్‌గ్రౌండ్‌లో దాక్కోవడాన్ని ఎలా చూడాలన్న చర్చ జరుగుతోంది అనంతపురం పొలిటికల్ సర్కిల్స్‌లో. సొంత నియోజకవర్గంలో జరిగిన రచ్చమీద రాష్ట్రమంతటా మాట్లాడుకుంటుంటే… ఆయన మాత్రం అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఇంటిపేరులో తప్ప వాస్తవంలో అంత తోపుకాదా అన్న సెటైర్లు సైతం పడుతున్నాయట కొన్ని వర్గాల నుంచి. అధికారం ఉన్నప్పుడే కాదు, పోయాక కూడా మీసం తిప్పిన మొనగాడు ఇప్పుడేమైపోయారంటూ ప్రశ్నిస్తున్నారు ఆయన రాజకీయ ప్రత్యర్థులు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున రాప్తాడు నుంచి గెలిచి.. ఐదేళ్ళు హవా నడిపారు తోపుదుర్తి. ప్రత్యర్థి అయిన పరిటాల కుటుంబాన్ని సవాల్ చేస్తూ…. నియోజకవర్గంలో తన మీద వ్యతిరేకత ఉందని తెలిసి కూడా.. 2024లో సైతం నేనే గెలుస్తానంటూ గొప్పలకు పోయారాయన. అక్కడితో ఆగి ఉంటే అది వేరే సంగతి. గెలుస్తానన్న నమ్మకం, గెలవాలన్న కోరిక ఎవరికైనా ఉండటం సహజం.
Read Also: Pakistan: కరాచీ, లాహోర్ ఎయిర్‌స్పేస్‌ని పాక్షికంగా మూసేసిన పాకిస్తాన్..
కానీ, గెలవక పోతే మీసం తీయించుకుంటానంటూ సవాల్ విసిరి ఇరుక్కుపోయారు తోపుదుర్తి. గత ఎన్నికల్లో 23 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారాయన. ఇక ఇటీవల రామగిరి ఎంపీపీ ఎన్నిక సమయంలో మాజీ ఎమ్మెల్యే చేసిన హంగామా అంతా ఇంతా కాదు. తన పార్టీ ఎంపీటీసీలను కాపాడుకునే క్రమయంలో పోలీసులపైకి తిరగబడటం, టీడీపీ నాయకుల మీదికి దూసుకెళ్లడంలాంటి పనులతో రచ్చ చేశారు తోపుదుర్తి. అంతలోనే… పాపిరెడ్డిపల్లిలో వైసీపీ నాయకుడు కురుబ లింగమయ్య హత్య జరగడంతో ఆయన్ని పరామర్శించేందుకు వచ్చారు వైసీపీ అధినేత జగన్. అప్పుడు హెలికాప్టర్ దగ్గరికి జనం దూసుకొచ్చారు. దాంతో విండ్‌షీల్డ్ దెబ్బతింది. ఆ తర్వాత రోడ్డు మార్గంలో బెంగళూరుకు వెళ్లారు జగన్. మా పార్టీ అధినేతకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందంటూ ప్రకాష్ రెడ్డి సహా వైసీపీ నేతలంతా ముప్పేట దాడి మొదలు పెట్టారు. దాంతో…ఆ ఎపిసోడ్ మీద పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆదేశించింది ఏపీ ప్రభుత్వం. అసలు హెలికాప్టర్ దగ్గరికి జనం అంతలా దూసుకురావడానికి కారణం ఎవరని ఎంక్వైరీ చేస్తున్న క్రమంలో దృష్టి మాజీ ఎమ్మెల్యే మీదికి మళ్ళింది.
Read Also: Congress BC Leaders: రేపు తెలంగాణ గవర్నర్ను కలవనున్న కాంగ్రెస్ బీసీ నేతలు..
కాగా, ఆ సమయంలో కార్యకర్తలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగిన క్రమంలో… నరేంద్ర కుమార్ అనే కానిస్టేబుల్‌కు గాయాలు కూడా అయ్యాయి. కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదుతో ప్రకాష్ రెడ్డి మీద పలు సెక్షన్ల కింద కేసులు బుక్ అయ్యాయి. అంతే…. అప్పటి దాకా మీసాలు మెలేస్తూ బీరాలు పలికిన ప్రకాష్ రెడ్డి ఆ తర్వాత కనిపించకుండా పోయారు. పోలీస్ కేసులతో ఉన్నఫళంగా ఊరొదిలేసి వెళ్ళిపోయారట ఆయన. సహజంగా ప్రకాష్ రెడ్డి బయట ప్రాంతాలకంటూ వెళ్తే… లిస్ట్‌లో హైదరాబాద్ లేదా బెంగళూరు ఉంటాయి. కానీ, ఈసారి మాత్రం ఏకంగా వేరే రాష్ట్రాలకు వెళ్లినట్టు సమాచారం. గడిచిన 20 రోజులుగా ఆయన ఆచూకీ లేదు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేశారు. దీంతో ఆయన అరెస్ట్ భయంతో పారిపోయారా? లేక అజ్ఞాతంలో ఉండి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారా అన్న చర్చ మొదలైంది నియోజకవర్గంలో. వాస్తవాలు మర్చిపోయి….అధికారంలోకి లేకపోయినా మీసం తిప్పిన ప్రకాష్ రెడ్డికి ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయంటున్నారు ఆయన ప్రత్యర్థులు. అండర్‌గ్రౌండ్ నుంచిన ఎప్పుడు బయటికి వస్తారోనని ఆసక్తిగా గమనిస్తున్నారు పరిశీలకులు.