Off The Record: బీఆర్ఎస్ పోగొట్టుకున్న చోటే వెదుక్కునే పని మొదలుపెట్టిందా? ఆ దిశగా ఆల్రెడీ స్కెచ్ రెడీ అవుతోందా? క్రమంగా ఒక్కో వర్గంలోకి ఒక్కో రకంగా వెళ్తున్న గులాబీ పార్టీ… తాజాగా అత్యంత కీలకమైన వర్గం మీద కన్నేసిందా? దాదాపుగా డిసైడింగ్ ఫ్యాక్టర్ అని చెప్పుకునే ఆ వర్గం గత ఎన్నికల్లో దూరమై గట్టి దెబ్బే కొట్టిందని తెలిసొచ్చిందా? ఇంతకీ… ఏదా వర్గం? ఏ రూపంలో వాళ్ళకి దగ్గరవ్వాలనుకుంటోంది గులాబీ దళం?
Read Also: War-2 : తెలుగు రైట్స్ కు భారీ డిమాండ్.. బడా నిర్మాతల పోటీ..?
తెలంగాణలో పదేళ్ళు తిరుగులేని అధికారం చెలాయించిన బీఆర్‌ఎస్… ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చింది. అందుకు కారణాలపై ఇప్పటికే పోస్ట్‌మార్టం పూర్తి చేసిన గులాబీ అధిష్టానం… జరిగిన తప్పుల్ని సరిదిద్దుకునే కార్యక్రమం మొదలుపెట్టిందట. గత ఎన్నికల్లో ఏయే వర్గాలు తమకు దూరమయ్యాయో విశ్లేషించుకుంటూ…. వాళ్ళని తిరిగి దరి చేర్చుకునే కార్యక్రమాన్ని మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే… అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే… పార్టీ పెద్దల దృష్టి తాజాగా ప్రభుత్వ ఉద్యోగుల మీదికి మళ్ళిందట. వివిధ కారణాలతో గత ఎన్నికల్లో ఆ వర్గం తమకు దాదాపుగా దూరమైందని, అందుకే దెబ్బ కూడా గట్టిగా పడిందని భావిస్తున్నట్టు సమాచారం. తిరిగి వాళ్ళకు దగ్గరయ్యే ప్రయత్నాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మీద విమర్శలతోనే మొదలుపెట్టినట్టు చెప్పుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు కాంగ్రెస్ సర్కార్ న్యాయం చేయడం లేదంటూ… ఈ మధ్య గట్టిగా స్వరం వినిపిస్తున్నారు బీఆర్‌ఎస్ లీడర్స్.
Read Also: PM Modi: ఇది “యుద్ధాల యుగం” కాదు, అలాగే “ఉగ్రవాద యుగం” కూడా కాదు..
కాగా, ఈ క్రమంలోనే ఆ మధ్య సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేసింది బీఆర్‌ఎస్. అలాగే మాజీ ప్రభుత్వ ఉద్యోగులను కూడా రంగంలోకి దించబోతోందట. తమ పార్టీకి అనుబంధంగా ఉన్న మాజీ ఉద్యోగులతో భేటీలు వేయించి వాళ్ళ ద్వారా తిరిగి ప్రభుత్వ ఉద్యోగులకు దగ్గరవ్వాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. తమ ఓటమికి కారణాల్లో…ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు దూరం కావడం కూడా ఒక కారణమని తెలిసినప్పటికీ… వాళ్ళకు దగ్గరగా వెళ్ళడానికి గడిచిన ఏడాదిన్నర నుంచి సరైన సమయం, సందర్భం దొరకలేదు గులాబీ పార్టీకి. అయితే… ఇప్పుడిప్పుడే ఉద్యోగ సంఘాల స్వరం మారుతున్న సంగతి పసిగట్టిన బీఆర్‌ఎస్ పెద్దలు చొచ్చుకుపోవడానికి ఇదే సరైన సమయం అని భావిస్తున్నారట. ఇక ఉద్యోగుల దగ్గరికి వెళ్ళి గతంలో తాము ఏం చేశామో… మళ్ళీ అధికారంలోకి వస్తే…. ఏం చేస్తామో గట్టిగా చెప్పాలనుకుంటున్నట్టు సమాచారం. ఆ పదేళ్ళలో ఎంప్లాయిస్‌కు చెడు జరిగిందా లేదా అన్న చర్చను పక్కనపెడితే… చేసిన మంచి పనులపై మాత్రం గట్టిగా ఆ వర్గాలు మరోసారి గట్టిగా మాట్లాడుకునేలా చేయాలన్నది బీఆర్‌ఎస్ వ్యూహంలో భాగమట. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పీఆర్సీ, డీఏలను ఎలా ఇచ్చామో చెప్పాలనుకుంటున్నారట. అలాగే….. 73శాతం ఫిట్‌మెంట్, హోంగార్డుల జీతాలు భారీగా పెంచడం, హెల్త్ కార్డులు ఇప్పించడం లాంటివన్నీ తామే చేశామని ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తుచేసే కార్యక్రమం మొదలుపెట్టిందట గులాబీ నాయకత్వం. ఉద్యోగులు, ప్రజలు వేరువేరు కాదు అందరం ఒకే కుటుంబం అన్న నినాదంతో దగ్గరయ్యే ప్రయత్నంలో ఉందట.
Read Also: PM Modi: పాక్‌తో చర్చలు జరిగితే ఇకపై ఉగ్రవాదం.. పీవోకేపైనే
అయితే, కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పిన వాటినే… తాము అడుగుతున్నామని, వంద రోజుల్లో ఇస్తామని చెప్పిన పీఆర్సీని ఇప్పటిదాకా ఎందుకు ఇవ్వలేదని నిలదీస్తూ…. ఆ పాయింట్‌తోనే ఉద్యోగులకు తిరిగి దగ్గరయ్యే కార్యక్రమం మొదలు పెట్టబోతున్నట్టు తెలిసింది. అందుకు వారధులుగా తమ పార్టీలో ఉన్న, అనుబంధంగా ఉన్న రిటైర్డ్ ఉద్యోగులనే వాడుకోబోతున్నట్టు చెబుతున్నాయి గులాబీ వర్గాలు. వాళ్ళలో కూడా ప్రధానంగా తెలంగాణ ఉద్యమ సమయంలో కీలకంగా ఉన్న వారినే దూతలుగా పంపబోతున్నట్టు సమాచారం. ఉద్యోగుల కోసం అవసరమైతే ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకుని ఎంతవరకైనా వెళ్లి కొట్లాడుతామని అంటున్నారు బీఆర్ఎస్ నాయకులు. అయితే… ఇక్కడే అసలు చిక్కు ఉందంటున్నారు కొందరు. ఇప్పుడు ఉద్యోగులు చెబుతున్న సమస్యల్లో చాలా వరకు బీఆర్ఎస్ హయాంలో నెరవేర్చకుండా పెండింగ్‌లో పెట్టినవేనట. వాటికి సంబంధించి అప్పట్లో హామీలు ఇచ్చారేగానీ…. అమలు చేయకపోవడంవల్లే….. ఆ పార్టీకి దూరమయ్యారు ప్రభుత్వ ఉద్యోగులు. అలాంటి వాళ్ళు ఇప్పుడు మళ్లీ ఉద్యమం అంటే… నమ్ముతారా? కలిసి వస్తారా? అన్నది చూడాలంటున్నారు రాజకీయ పరిశీలకులు.