Off The Record: పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొనసాగుతుంది. ములుగు నియోజకవర్గం తర్వాత… నర్సంపేట సెగ్మెంట్‌లోకి ఎంట్రీ ఇవ్వాలి. ఆ తరువాత మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి యాత్ర వెళ్తుంది. ఇది ముందుగా అనుకున్న షెడ్యూల్‌గా చెబుతున్నారు. ములుగులో యాత్ర మొదలయ్యాక ఎక్కడా బ్రేకులు లేకుండా సాఫీగా సాగిపోతుందని రేవంత్‌రెడ్డి కూడా భావించారట. అయితే ములుగులో యాత్ర పూర్తి కాగానే నర్సంపేట వెళ్లకుండా మహబూబాబాద్ నియోజకవర్గంలోకి ఎంటరైంది. దీంతో నర్సంపేటను వదిలేయడానికి గల కారణాలు కాంగ్రెస్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారిపోయాయి. నర్సంపేటలో కాంగ్రెస్ వ్యవహారాలను మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చూసుకుంటున్నారు. పాదయాత్ర నర్సంపేట మీదుగా వెళ్లేందుకు మాధవరెడ్డితో మాట్లాడాలని రేవంత్ అనుకున్నారట. కానీ రేవంత్‌కి మాధవరెడ్డి అందుబాటులోకి రాలేదట. అంతేకాదు.. తన నియోజకవర్గంలో పాదయాత్ర అవసరం లేదని పీసీసీ చీఫ్‌కు ఆయన చెప్పినట్టుగా ప్రచారం జరుగుతోంది. అందుకే నర్సంపేటను వదిలేసి మహబూబాబాద్‌లోకి యాత్రను టర్న్ చేశారని అనుకుంటున్నారు.
Read Also: Bill Gates is in love: లేటు వయసులో ఘాటు ప్రేమలో బిల్‌గేట్స్..! ఆమె ఎవరో తెలుసా..?
గతంలో రేవంత్‌కి మాధవరెడ్డి ఫోన్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయలేదట. ఆ కారణంతోనే నర్సంపేటకు పాదయాత్ర అవసరం లేదని చెప్పినట్టు సమాచారం. తమతో సమన్వయం లేనప్పుడు మీతో మేము ఎందుకు పనిచేయాలని రేవంత్ సన్నిహితుడితో అన్నారట ఈ మాజీ ఎమ్మెల్యే. అయితే ఈ అంశంపై పంచాయితీ ఎందుకని మాధవరెడ్డికి అత్యంత సన్నితుడైన జానారెడ్డి ఫోన్ చేశారట. ఆయన ఫోన్‌ను కూడా మాధవరెడ్డి లిఫ్ట్ చేయలేదని ప్రచారం జరుగుతుంది. గతంలో పిసిసి చీఫ్ గా ఉత్తంకుమార్ రెడ్డి ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రజాచైతన్య యాత్రను నిర్వహించింది. అప్పుడు కూడా నర్సంపేటకు ఎవరు అవసరం లేదని తేల్చి చెప్పారట. అప్పట్లో జానారెడ్డి జోక్యం చేసుకుని వ్యవహారాన్ని సెట్ చేశారట. ఇప్పుడు జానారెడ్డి ఫోన్ చేసినా మాజీ ఎమ్మెల్యే నుంచి రిప్లయ్ లేదట. దొంతి మాధవరెడ్డి గతంలో కాంగ్రెస్ రెబల్‌గా బరిలో దిగి ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో తన బలంపై నమ్మకం పెట్టుకుని.. పార్టీ కంటే తనతోనే పని ఎక్కువనే ఫీలింగ్‌లో మాజీ ఎమ్మెల్యే ఉండొచ్చని కాంగ్రెస్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. పీసీసీ చీఫ్ మాత్రం నర్సంపేట అంశాన్ని చర్చ చేయడం లేదట. చేస్తే అదే ప్రధాన సమస్యగా మారే ప్రమాదం కూడా ఉంది. కాకపోతే ఈ అంశాన్ని రేవంత్ విడిచి పెడతారా? రానున్న రోజుల్లో ఎలా రియాక్ట్ అవుతారు అనేది కాంగ్రెస్‌లో ఉత్కంఠ రేకెత్తిస్తోంది.