Off The Record: ఒకప్పుడు నెత్తుటేళ్ళు పారిన అనంతపురం జిల్లాలో మళ్లీ రక్త చరిత్ర టాపిక్ తెర మీదికి వచ్చింది. ఎప్పుడో రెండు దశాబ్దాల క్రితం జరిగిన సంఘటనలు మళ్ళీ ఇప్పుడు కళ్ళ ముందు కదలాడుతున్నాయి. రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం లో జరిగిన ఒక హత్య దగ్గర మొదలైన మేటర్… ఫ్లాష్ బ్యాక్‌లో పరిటాల రవి మర్డర్ వరకు వెళ్తోంది. ఆ పాత గాయాలు మళ్లీ ఎందుకు రేగుతున్నాయి? అసలేం జరిగిందని అంటే….ఎంపీపీ ఎన్నిక రేపిన చిచ్చు అన్నది స్థానికంగా వినిపిస్తున్న సమాధానం. రామగిరి మండలంలో జరిగిన ఎంపీపీ ఎన్నిక ఇప్పుడు నియోజకవర్గంలో పెను తుఫాన్ సృష్టిస్తందట. వైసీపీకి పూర్తి స్థాయి ఆధిపత్యం ఉన్న ఈ మండలంలో ఎంపీపీ ఎన్నిక సజావుగా జరగాల్సింది. కానీ… క్యాంపు రాజకీయాలు, ఇందుకు సంబంధించి రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వ్యవహరించిన తీరు కలగలిసి పాత గాయాల్ని రేపడంతో పాటు ఇప్పుడీ వ్యవహారం రాష్ట్రవ్యాప్త చర్చనీయాంశం అయిందని అంటున్నారు. ఎంపీపీ ఎన్నిక సందర్భంగా జరిగిన వ్యవహారాలతో… ఉగాది రోజు రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో వైసీపీ నేత లింగమయ్య పై అదే గ్రామానికి చెందిన వారు దాడి చేశారు. ఆ దాడిలో ఆయన చనిపోయారు. మామూలుగా అయితే… ఇది ఒక ఊరికి, లేదా ఒక మండలానికి సంబంధించిన విషయం.
కానీ… ఈ హత్య ఫ్యాక్షన్ రాజకీయాలను మళ్లీ తట్టి లేపినట్టుగా మారాయి పరిస్థితులు. ముఖ్యంగా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరులు పరిటాల కుటుంబాన్ని టార్గెట్ చేసుకొని విమర్శలు చేస్తూ వచ్చారు. ఒకప్పుడు పరిటాల రవి రక్త చరిత్ర సృష్టించారని, ఇప్పుడు అదే కొనసాగిస్తున్నారంటూ విమర్శించారు తోపుదుర్తి బ్రదర్స్. ఆ మాటల ద్వారా లింగమయ్య హత్యను పతాక స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఆ ఘటన రాష్ట్రంలో సంచలనం కావడంతో వైసిపి అధినేత జగన్ కూడా స్పందించారు. బలం లేని చోట ఎన్నికల్లో గెలవాలని చూడడమే కాకుండా ఒక వ్యక్తిని హత్య చేశారంటూ రియాక్ట్ అయ్యారు జగన్. పాపిరెడ్డిపల్లికి తానే స్వయంగా వస్తానని ప్రకటించారు. జగన్ ఈ మేటర్ లోకి ఎంటర్ కావడంతో వ్యవహారం పీక్స్‌కు చేరింది. అట్నుంచి జగన్ ఎంటరవడంతో… ఇట్నుంచి పరిటాల కుటుంబం కూడా స్పందించింది. పరిటాల సునీత స్వయంగా మీడియా ముందుకు వచ్చి చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపాయి. తోపుదుర్తి బ్రదర్స్ ఎప్పుడూ టీవీ బాంబు గురించి మాట్లాడుతారని…. కానీ, కారు బాంబుకు 24 మంది బలైన సంఘటన గురించి ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారామె. అసలు సూట్ కేస్ బాంబు కూడా ఎలా, ఎవరు పెట్టారో సమాధానం చెప్పాలన్నారు. తన భర్త పరిటాల రవీంద్ర హత్య వెనుక జగన్ పాత్ర ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు సునీత.
అప్పట్లో సిబిఐ కూడా దీనిపై ఎంక్వైరీ చేసిందని, ఈ బాంబుల కథలకు, పరిటాల రవి హత్యకు సమాధానం చెప్పిన తర్వాతే జగన్ జిల్లాలోకి రావాలన్నారు సునీత. ఈ వ్యవహారం అక్కడితో ఆగలేదు. ఒకప్పుడు రక్త చరిత్రకు కేంద్ర బిందువుగా మారిన మూడు కుటుంబాల గురించి కూడా మరోసారి మాట్లాడుకుంటున్నారు. మొత్తం అనంతపురం జిల్లాలో మద్దెల చెరువుకు చెందిన గంగుల సూర్యనారాయణ రెడ్డి అలియాస్ మద్దెల చెరువు సూరి కుటుంబం, కనుముక్కలకు చెందిన సానే కుటుంబాలను తోపుదుర్తి సోదరులు వాడుకుని వదిలేశారని, ఇప్పుడు ఆ కుటుంబాలు దెబ్బతిన్నాయిగానీ.. మీరు మాత్రం బాగానే ఉన్నారు కదా అంటూ…. ఆసక్తిరకర వ్యాఖ్యలు చేశారు పరిటాల సునీత. ఈ ఫ్యాక్షన్ గొడవలతో మా మూడు కుటుంబాలు చాలా నష్టపోయాయని.. ఇప్పుడు మళ్లీ వాటిని రగిలించి సానే, గంగుల కుటుంబాలను ఇందులోకి లాగాలని చూస్తున్నారని అన్నారామె. గంగుల భానుమతి, సానే ఉమ ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించారు సునీత. జగన్ ఎవరో చెప్పిన మాటలు విని జిల్లాకు రావడం కాదని, కేవలం లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించడమే కాకుండా… గత గత ఐదేళ్లలో తోపుదుర్తి బ్రదర్స్ బాధితులందరినీ పరామర్శించాలని డిమాండ్ చేశారు. అందుకోసం సూట్‌కేస్‌ను కాస్త ఎక్కువగా సర్దుకొని రావాలంటూ సెటైర్స్ వేశారామె. ఇలా… మొత్తం మీద ఎక్కడో రామగిరి మండలం పాపిరెడ్డి పల్లి అనే చిన్న గ్రామంలో జరిగిన హత్య పెద్ద తలకాయల ఎంట్రీతో రాష్ట్ర వ్యాప్త అంశంగా మారిపోయింది. దీంతో ముందు ముందు ఈ ఎపిసోడ్‌లో ఎలాంటి పరిణామాలుంటాయోనన్న ఉత్కంఠ పెరుగుతోంది.