Off The Record: తెలంగాణలో రెండు టీచర్, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. పట్టభద్రులు, ఒక టీచర్ సీట్లో ప్రభావం చూపిన కమలం పార్టీ… మరో చోట చతికిలపడింది. ఓడిపోయిన నల్గొండ టీచర్ సీటు విషయంలో పెద్దగా దృష్టి పెట్టలేదుకాబట్టి అలాంటి ఫలితమే వచ్చిందని అనుకున్నా…. మిగతా రెండు సీట్లలో పరిస్థితి చూస్తే మాత్రం.. ఇక తెలంగాణ మాదేనన్నంత ధీమాగా ఉన్నారట కాషాయ నేతలు. అసలు కరీంనగర్ టీచర్ సీట్లో అయితే… ఓట్ల వరద పారిందని, పార్టీకి ఇది బిగ్‌బూస్ట్ అనుకుంటున్నారట తెలంగాణ బీజేపీ నాయకులు. రాష్ట్ర ప్రభుత్వ పతనానికి ఇదే నాంది అని పార్టీ ముఖ్య నాయకులు కామెంట్ చేస్తున్నారంటే…. ఎమ్మెల్సీ ఎలక్షన్ వాళ్ళలో ఎంత కాన్ఫిడెన్స్ తెచ్చిందో అర్ధం చేసుకోవచ్చని అంటున్నారు పరిశీలకులు. ఈ ఎన్నికల పై కేంద్ర పార్టీ కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ర్ట వ్యవహారాల ఇన్చార్జి సునీల్ బన్సల్ నేరుగా మానిటర్ చేశారు. అలాగే ఎప్పుడూ లేని విధంగా ఆ పార్టీ నేతలు ప్రచారం కోసం తిరిగారు.
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొన్నారు. ఈ క్రమంలో అంతా కలిసికట్టుగా పనిచేస్తే… వచ్చే ఎన్నికల్లో తెలంగాణను కొట్టడం పెద్ద మేటర్ కాదన్న చర్చ మొదలైందట పార్టీలో. అసలు తెలంగాణలో ఏం చేయగలమో… ఎలా చేయగలమోనన్న ఉద్దేశ్యంతో ఎమ్మెల్సీ ఎన్నికల్ని ప్రాక్టీస్ మ్యాచ్‌లా భావించామని, అది సూపర్ సక్సెస్ అయిందని బీజేపీ ముఖ్యులు భావిస్తున్నట్టు సమాచారం. లోక్‌సభ ఎన్నికల్లో 8ఎంపీ సీట్లు రావడం, పార్టీ సభ్యత్వం 40 లక్షలు దాటడం శుభ సంకేతమని, ఆ పట్టు అలాగే ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉపయోగపడ్డాయని భావిస్తున్నారట తెలంగాణ బీజేపీ లీడర్స్. ఉత్తర తెలంగాణలో పార్టీకి పట్టు తగ్గలేదని మరోసారి నిరూపితమైనందున ఇక రాష్ట్రం మొత్తం మీద పట్టుబిగించేలా ప్రణాళికలు రూపొందించాలని అనుకుంటున్నారట కాషాయ పెద్దలు. ప్రజలు తమ వైపు ఉన్నారనడానికి ఈ ఫలితాలు నిదర్శనం అని అంటున్నారు బీజేపీ నాయకులు. ఇక దూకుడు పెంచుతామని, త్వరలోనే కొత్త రాష్ట్ర అధ్యక్షుడు వస్తారని… ఆ తర్వాత క్షేత్ర స్థాయిలో ప్రజా పోరాటాలు మొదలుపెట్టి సత్తా చూపిస్తామని అంటున్నారు తెలంగాణ కాషాయ నాయకులు.
పట్టభద్రుల స్థానంలో కాంగ్రెస్ పార్టీకి చుక్కలు చూపించామని, ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతోందని అనడానికి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉదాహరణ అన్న చర్చ జరుగుతోందట బీజేపీ వర్గాల్లో. తమ జాతీయ నాయకత్వం కూడా తెలంగాణ మీద మరింత దృష్టి పెడుతున్నందున అడపాదడపా ఉన్న అసంతృప్తులు కూడా సెట్ అయిపోయి పార్టీ గాడిన పడుతుందని ఆశాభావంతో ఉన్నారట రాష్ట్ర నాయకులు. ఇక్కడ పార్టీ నేతలు కొందరి మధ్య సమన్వయం లేదనేది ఢిల్లీ పెద్దలకు తెలుసు కాబట్టి… వాళ్ళని సెట్ చేస్తుందన్న ఆశాభావంతో ఉన్నారు కార్యకర్తలు. గతంలో జరిగిన పొరపాట్లు రిపీట్ కాకుండా పార్టీ హై కమాండ్ జాగ్రత్త పడుతుందని, మొత్తం మీద మేం ఆడిన ప్రాక్టీస్ మ్యాచ్ సక్సెస్… బొమ్మ సూపర్ హిట్ అంటున్నారు తెలంగాణ బీజేపీ నాయకులు. రాబోయే రోజుల్లో ఏ మేరకు, ఎలా దూకుడు పెంచుతారో చూడాలి మరి.