Off The Record: సరిహద్దులో భారత్-పాకిస్తాన్ యుద్ధం ఆగినా…. బెజవాడలో బ్రదర్స్ వార్ మాత్రం ఆగే సూచనలు కనిపించడం లేదు. పైగా పీక్స్‌కు చేరుతోంది. తనను చంపేస్తానని బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, తన ఇంటిపై దాడికి పాల్పడ్డారని నేరుగా మాజీ ఎంపీ కేశినేని నాని పోలీస్ కమిషనర్‌కి ఫిర్యాదు చేయడంతో… మేటర్ మాంఛి రసకందాయంలో పడింది. ఎన్నికల్లో ప్రత్యర్థులుగా పోటీ చేసిన కేశినేని నాని, చిన్ని మధ్య అంతకు ముందు నుంచే పరోక్ష యుద్ధం జరుగుతోంది. ఎన్నికలకు ముందు అన్న ఎంపీగా ఉంటే… తర్వాత తమ్ముడు ఎంపీ అయ్యారు. అది తప్ప మిగతా అంతా సేమ్ టు సేమ్ అంటున్నారు ఆ కుటుంబ సన్నిహితులు. ఎన్నికల్లో ఓటమి తర్వాత రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నానని ప్రకటించి సైలెంట్ గానే ఉన్నారు నాని. కానీ హఠాత్తుగా నెల రోజుల నుంచి ఎంపీ చిన్ని టార్గెట్‌గా ట్వీట్ వార్ మొదలుపెట్టారాయన.
Read Also: Off The Record: పెద్దపల్లిలో గులాబీ కేడర్ ను నడిపించే నాయకుడు లేడా..?
ఇటు ఎంపీ చిన్ని కూడా కౌంటర్స్ ఇస్తున్న క్రమంలో ఇప్పుడు నెక్స్ట్ లెవల్‌కు వెళ్ళిందని అంటున్నారు పరిశీలకులు. విశాఖలో ఉర్సా కంపెనీకి భూముల కేటాయింపుతో మొదలైన వివాదం, కౌంటర్స్, రివర్స్ అటాక్స్‌తో రకరకాల మలుపులు తిరిగి చివరికి ఏపీ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న లిక్కర్ స్కామ్ దగ్గరికొచ్చి ఆగింది. ఆ స్కామ్‌లో ఏ1గా ఉన్న రాజ్ కేశిరెడ్డితో కేశినేని చిన్నికి వ్యాపార సంబంధాలు ఉన్నాయని, విచారణ జరపాలని నాని చేసిన ఆరోపణలతో టీడీపీ కూడా ఉలిక్కి పడిందట. అంతేగాక ఆ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నట్టు సమాచారం. వైసీపీ ప్రభుత్వ హయాంలో 3వేల200 కోట్ల వరకు లిక్కర్ కుంభకోణం జరిగిందని ఇప్పటికే నిర్ధారించిన సిట్ పలువురిని అరెస్ట్ చేసింది. నాటి ప్రభుత్వంలో చక్రం తిప్పిన పెద్దలు కొందరు, కీలక అధికారులను కూడా కేసులో నిందితులుగా చేర్చి వాళ్ళని ఫిక్స్ చేసే పనిలో ఉంది సిట్. ఈ పరిస్థితుల్లో.. ఇదే కేసులో టీడీపీ నుంచి ఎంపీగా గెలిచిన కేశినేని చిన్ని పాత్ర ఉందని ఆయన అన్న, మాజీ ఎంపీ నాని చేస్తున్న ఆరోపణలను లైట్ తీసుకోవాలని అనుకోవటం లేదట టీడీపీ పెద్దలు.
Read Also: Off The Record: నామినేటెడ్ పోస్టుల చిచ్చు..! కూటమి ప్రభుత్వంలో అసంతృప్తులు పెరుగుతున్నాయా?
ఇంత సీరియస్ కేసులో కేశినేని నాని… తమ పార్టీ ఎంపీ మీద ఆరోపణలు చేయటం ద్వారా పక్క దారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని, ఇలాగే వదిలేస్తే… అది పార్టీ మీద కూడా ప్రభావం చూపుతుందన్నది టీడీపీ పెద్దల భావనగా తెలుస్తోంది. సీబీఐ, ఈడీ దర్యాప్తు కోసం అన్నదమ్ములిద్దరూ లేఖలు రాయడం, సవాళ్ళు, ప్రతి సవాళ్ళతో అటు తిరిగి ఇటు తిరిగి వ్యక్తిగత పోరు కాస్తా…. పార్టీ మీద పడుతోందనే విషయాన్ని అధిష్టానం గుర్తించిందట. మద్యం కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్నటైంలో… ఈ విధంగా కేశినేని నాని తమ పార్టీ ఎంపీ మీద ఆరోపణలు చేయటం ప్రభుత్వాన్ని కూడా ఇరుకున పెడుతుందని టీడీపీ పెద్దలు అనుకుంటున్నట్టు తెలిసింది. దీంతో… ఇక కేశినేని నాని విషయంలో సైలెంట్‌గా ఉండవద్దని, స్పందించి కౌంటర్ చేయమని పార్టీ కీలక నేతలకు డైరెక్షన్ ఇచ్చినట్టు సమాచారం. అందులో భాగంగానే బుద్దా వెంకన్న కేశినేని నాని హెూటల్ నిర్మాణం కోసం డబ్బులు తీసుకుని ఎగవేశారన్న ఆరోపణలు చేసినట్టు చెప్పుకుంటున్నారు. తన తమ్ముడు చిన్ని టార్గెట్‌గా నాని వార్ మొదలెట్టినప్పటికీ లిక్కర్ స్కామ్‌కు లింక్ పెట్టడంతో… టీడీపీ అధిష్టానం రంగంలోకి దిగిందని, దీంతో మాజీ ఎంపీ సంధించిన అస్త్రం గురి తప్పిందా అన్న చర్చ జరుగుతోంది రాజకీయ వర్గాల్లో. రాబోయే రోజుల్లో బ్రదర్స్ వార్ ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలంటున్నారు పొలిటికల్ పండిట్స్.