Off The Record: ఆంధ్రప్రదేశ్‌లో అధికార కూటమి నేతలు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న నామినేటెడ్ పదవుల భర్తీ విడతలవారీగా జరుగుతోంది. తాజాగా డీసీసీబీ, మార్కెట్ యార్డ్ కమిటీల పదవుల పందేరం నడుస్తోంది. అదే సమయంలో అసంతృప్త స్వరాలు కూడా పెరుగుతున్నాయి. గత ఎన్నికల్లో టికెట్లు రానివాళ్ళతో పాటు పార్టీ వీర విధేయులకు ప్రాధాన్యం ఇస్తున్నామని టీడీపీ అధిష్టానం చెబుతున్నా…. అదే రేంజ్‌లో ఉన్న అందర్నీ సంతృప్తి పరచడం మాత్రం సాధ్యం కావడం లేదట. ప్రత్యేకించి పొత్తు ధర్మంలో మూడు పార్టీల మధ్య సర్దుబాట్లు అవసరమైనందున ఇబ్బందులు తప్పడం లేదంటున్నారు. దీంతో గత ఎన్నికల్లో టిక్కెట్లు రాక, ఇప్పుడు నామినేటెడ్ పదవులు దక్కక అసంతృప్తిగా ఉన్న నాయకులను కొత్త రకంగా బుజ్జగిస్తోందట టీడీపీ అధిష్టానం. వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన పూర్తవుతుందని, అప్పుడు ఎలాగూ అసెంబ్లీ సీట్లు పెరుగుతాయి కాబట్టి…అందరికీ అవకాశాలు వస్తాయని నచ్చజెపుతున్నట్టు సమాచారం.
Read Also: WTC Final- IPL 2025: డబ్ల్యూటీసీ ఫైనల్ ఎఫెక్ట్.. ఐపీఎల్‌లో ఆ జట్లకు బిగ్ షాక్!
నామినేటెడ్ పదవుల కోసం చాలా మంది ఎదురు చూస్తున్నా…. అవకాశాలు మాత్రం కొద్ది మందికే దక్కుతున్నాయి. అందుకే… ఆశావహులందరికీ డీ లిమిటేషన్ ఆశ చూపుతున్నట్టు తెలిసింది. ప్రస్తుతం దీని గురించి తెగ చర్చ జరుగుతోంది టీడీపీ సర్కిల్స్‌లో. అధిష్టానం డీ లిమిటేషన్ ఆశలు చూపుతున్నా…. ఎక్కువ మంది ఆ విషయంలో కన్విన్సింగ్‌గా లేరట. ఆకలైనప్పుడు పెట్టే ఇడ్లీ ముఖ్యంగాని, కడుపు నిండాక బిర్యానీ పెట్టినా ఏం ప్రయోజనం అంటూ నిరాసక్తతగా మాట్లాడే నాయకుల సంఖ్య పెరుగుతున్నట్టు చెప్పుకుంటున్నారు. అటు మహిళా రిజర్వేషన్స్ అమల్లోకి వస్తే పార్టీ లీడర్స్‌కు మంచి అవకాశాలు ఉంటాయని ఇప్పటికే సీఎం చంద్రబాబు చెబుతున్నారు. ఓవైపు డీ లిమిటేషన్, మరోవైపు మహిళా రిజర్వేషన్ ఈ రెండూ అమల్లోకి వస్తే… చాలావరకు సమస్య తీరిపోతుందన్నది టీడీపీ అధిష్టానం అభిప్రాయంగా తెలుస్తోంది. ప్రస్తుతం నామినేటెడ్ పదవుల భర్తీ జరుగుతున్నా… ఇంకా చాలావరకు చేయాల్సి ఉంది. జిల్లాల వారీగా సామాజిక సమీకరణలను దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తలు తీసుకుంటోంది కూటమి ప్రభుత్వం. అయినా సరే… అసంతృప్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది. దాన్ని చల్లార్చడానికి డీ లిమిటేషన్ ఆశలు చూపుతున్నా… నేతలు ఎంతవరకు కన్విన్స్ అవుతారన్నది క్వశ్చన్ మార్క్ అంటున్నారు పరిశీలకులు.
Read Also: Law College: శాతవాహన వర్శిటీలో ‘లా కాలేజీ’కి బార్ కౌన్సిల్ ఆమోదం.. కృతజ్ఞతలు తెలిపిన కేంద్రమంత్రి
ఇప్పటికే రకరకాల కారణాలతో చాలామందికి గత ఎన్నికల్లో టికెట్లు రాలేదు. ప్రధానంగా జనసేనతో పొత్తుతో టిక్కెట్లు కోల్పోయామన్న అసహనం ఎక్కువ మంది టీడీపీ నేతల్లో ఉందట. అలాంటి వాళ్ళంతా ఎట్టి పరిస్థితుల్లో మంచి నామినేటెడ్ పదవి సాధించాలన్న పట్టుదలతో ఉన్నారు. అంత పట్టుదలతో ఉన్న నాయకులు పార్టీ అధిష్టానం మబ్బుల్ని చూపించి అదిగో నవలోకం అంటే వింటారా అన్నది అనుమానమేనని టీడీపీ వర్గాలే మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇంకా చాలా నామినేటెడ్ పోస్ట్‌లు ఖాళీగా ఉన్నందున ఏదో ఒకటి ఇవ్వకపోతారా అని ఆశగా చూస్తున్నారు ఎక్కువ మంది. అదిపోయి ఇక ఇప్పటికింతే… అని తెలిస్తే మాత్రం… వాళ్ళ నిర్ణయాలు, చర్యలు ఎలా ఉంటాయన్నది చూడాలంటున్నారు రాజకీయ పరిశీలకులు.