Off The Record: ఐ డోన్ట్ లవ్యూ.. యూ లవ్ మీ. ఇప్పుడు కృష్ణాజిల్లా రాజకీయాల్లో ఈ వ్యాఖ్యలపైనే చర్చ జరుగుతోంది. ఎంపీ కేశినేని నాని మైలవరంలో జరిగిన కబడ్డీ పోటీల్లో చేసిన ఈ కామెంట్స్ టీడీపీలో కలకలం రేపుతున్నాయి. నాని చేసిన లవ్ కామెంట్స్.. పూర్తిగా దేవినేని ఉమను ఉద్దేశించే అని చెవులు కొరుక్కుంటున్నారు. గత కొంత కాలంగా మైలవరం టీడీపీలో దేవినేని ఉమకు వ్యతిరేకంగా పార్టీ నేత బొమ్మసాని సుబ్బారావు రాజకీయం చేస్తున్నారు. ఈసారి టికెట్ తనకే ఇవ్వాలనేది బొమ్మసాని డిమాండ్. ఆయనేమో ఎంపీ కేశినేని వర్గం. పనిలోపనిగా నియోజకవర్గంలో దేవినేని ఉమ వ్యతిరేకులను ఒక్కతాటి మీదకు తెచ్చే ప్రయత్నం జరుగుతోందట. ఈ విషయంలో ఉమ కుతకుతలాడుతున్నారు.
Read Also: Off The Record: రాహుల్ పాదయాత్ర ముగింపు సభ.. బీఆర్ఎస్‌ను ఎందుకు పిలవలేదు?
బొమ్మసాని ఏర్పాటు చేసిన కబడ్డీ పోటీలకు హాజరైన కేశినేని నాని.. వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌నూ పొగడ్తల్లో ముంచెత్తారు. గత ఎన్నికల్లో వసంత చేతిలోనే దేవినేని ఉమా ఓడిపోయారు. వసంత బాగా పని చేస్తున్నారని.. అందుకే ఎంపీ నిధులు కూడా ఇచ్చానని నాని చెప్పుకొచ్చారు. అక్కడితో ఆగకుండా ఉమాకు చురకలు వేశారు. నాలుగుసార్లు గెలిచాం.. తామేం చేసినా చెల్లుతుందనే కాలం పోయిందన్నారు నాని. పైగా ఐ డోన్ట్ లవ్యూ.. బట్ యూ లవ్ మీ అంటే ఎలా కుదురుతుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు ఈ టీడీపీ ఎంపీ.
దేవినేని ఉమ.. ఇప్పుడు కేశినేని నానికి ఎందుకు టార్గెట్ అయ్యారనేది ప్రశ్న. ఇద్దరూ టీడీపీలోనే ఉన్నా.. గ్యాప్ ఉంది. ఒకరంటే ఒకరికి పడదు. దీనికి తగ్గట్టు ఇటీవల నాని సోదరుడు చిన్ని యాక్టివ్‌గా ఉంటున్నారు. కేశినేని బ్రదర్స్‌కు పడటం లేదు. చిన్నికి ఉమా మద్దతుగా ఉండటం కూడా ఎంపీకి కాలుతోందని టాక్. తనకు వ్యతిరేకంగా తమ్ముడితో కలిసి ఉమ రాజకీయం చేస్తున్నారని నాని ఫైర్ అవుతున్నారు. అందుకే ముసుగులో గుద్దులాట ఎందుకని.. కేశినేని నాని నేరుగా మైలవరంలో ల్యాండ్ అయ్యారని అనుకుంటున్నారు. ఈ అంశంపై ఉమ వర్గం గుర్రుగా ఉన్నా.. ఇంకా బయట పడలేదు. సమయం చూసుకుని కౌంటర్ ఇస్తారని ఆయన వర్గం చెబుతోంది. మరి.. మైలవరం టీడీపీలో రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి