Off The Record: దేశంలో 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన పెద్ద కార్యక్రమం భారత్ జోడో పాదయాత్ర. కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్‌గాంధీ కన్యాకుమారి నుంచి మొదలుపెట్టిన పాదయాత్ర చివరి దశకు చేరుకుంటోంది. ఏదో సాదాసీదాగా భారత్ జోడో పాదయాత్ర కార్యక్రమాన్ని ముగించకుండా.. భారీగా చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోంది. ముగింపు కార్యక్రమానికి హాజరు కావాలని దేశంలోని 21 రాజకీయపార్టీలను కాంగ్రెస్ ఆహ్వానించింది. తెలుగు రాష్ట్రాల్లో కేవలం టీడీపీకి మాత్రమే ఇన్విటేషన్ వెళ్లింది. బీఆర్‌ఎస్‌ను పిలవలేదు. దీంతో బీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్ ఎందుకు ఆహ్వానించలేదు అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
జాతీయస్థాయిలో క్రియాశీలక పాత్ర పోషించేందుకు సిద్ధం అవుతోంది భారత్ రాష్ట్ర సమితి. ఇటీవల పార్లమెంట్ సమావేశాల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన విపక్షాల సమావేశానికి పిలిచినా BRS దూరంగా ఉంది. జాతీయ స్థాయిలో రాజకీయ సమీకరణాలు దృష్టిలో పెట్టుకున్న BRS.. BJP, కాంగ్రెస్‌కు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే రాహుల్ గాంధీ పాదయాత్ర ముగింపు కార్యక్రమానికి BRSను ఆహ్వానించలేదని అభిప్రాయ పడుతున్నారు. అదే సమయంలో BRSతో టచ్‌లో ఉన్న జేడీఎస్, ఆప్ పార్టీలకు కూడా కాంగ్రెస్ ఆహ్వానాలు పంపలేదు.
తెలంగాణలో అధికార బీఆర్‌ఎస్‌తో కాంగ్రెస్ పార్టీ ఢీ అంటే ఢీ అంటోంది. ఇప్పుడు రాహుల్ యాత్ర ముగింపు కార్యక్రమానికి బీఆర్‌ఎస్‌ను పిలిస్తే.. ఆ ప్రభావం తెలంగాణపై పడుతుందనే ఆలోచన కావొచ్చన్నది రాజకీయ విశ్లేషకుల మాట. ఈ ఏడాదే తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు ఉన్నాయి. రాష్ట్రంలో తిరిగి పుంజుకోవాలన్నది కాంగ్రెస్ ఆలోచన. అధికారం నిలబెట్టుకోవాలని బీఆర్‌ఎస్ చూస్తోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏమౌతుందో ఇప్పుడే ఓ అంచనాకు వచ్చే పరిస్థితి లేదు. ఆ విషయాలను దృష్టిలో పెట్టుకునే కాంగ్రెస్‌పార్టీ ఆచితూచి అడుగులు వేస్తోందని అనుకుంటున్నారు. ఏతావాతా 2024 సార్వత్రిక ఎన్నికల ముందు జరుగుతున్న ఈ పరిణామాలు రానున్న రోజుల్లో జాతీయ స్థాయిలో ఎటువంటి సమీకరణాలకు దారితీస్తాయో చూడాలి.