Off The Record: పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో రాజకీయ చైతన్యం ఎక్కువే. ఇక్కడి నుంచి స్వాతంత్ర్య సమరయోధుడు వావిలాల గోపాలకృష్ణయ్య వరుసగా నాలుగుసార్లు గెలిచారు. ఇక 2014లో టీడీపీ నేత కోడెల శివప్రసాదరావు నర్సరావుపేట నుంచి సత్తెనపల్లికి వచ్చి పోటీ చేసి గెలిచారు. తర్వాత 2019లో ఇదే నియోజకవర్గం నుంచి ఓడిపోయారాయన. కోడెల అకాల మరణంతో సత్తెనపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ పదవి ఖాళీ అయ్యింది. ఆ పోస్ట్ కోసం పోటీ కూడా ఓ రేంజ్‌లో నడిచింది. ఇక్కడ టీడీపీలో మాజీ ఎమ్మెల్యే వైవీ ఆంజనేయులు, కోడెల శివప్రసాదరావు కొడుకు శివరాం, రూరల్ మండలంలోని నేతలు… ఇలా ఎవరికి వారు గ్రూపులు కట్టి రాజకీయం చేస్తున్నారు. 2024 ఎన్నికలకు ముందు సత్తెనపల్లి టికెట్ కోసం శివరాం, వైవీ ఆంజనేయులుతో పాటు మరో ఇద్దరు పోటీ పడ్డారు. దీంతో… గ్రూపు రాజకీయాలతో ఎక్కడ పార్టీకి ఇబ్బంది కలుగుతుందోనని భావించిన అధినేత చంద్రబాబు వ్యూహాత్మకంగా పావులు కదిపారు. సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణను సత్తెనపల్లి అభ్యర్దిగా బరిలోకి దించారు. ఆ ఎన్నికల్లో అంబటి రాంబాబు మీద ఘన విజయం సాధించారు కన్నా. నియోజకవర్గానికి కొత్త అయినా… సత్తెనపల్లి గ్రూప్స్ గురించి కన్నాకు పూర్తి క్లారిటీ ఉంది. పైగా… అన్ని గ్రూపులు ఒకే సామాజికవర్గానికి చెందినవే, నియోజకవర్గంలో కూడా కమ్మ సామాజికవర్గం ఆధిపత్యమే ఉంటుంది.
Read Also: Ciel Dubai Marina: 82 అంతస్తులు, 1004 గదులు.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన హోటల్ ఇది!
దీంతో ఒకరికి సపోర్ట్ చేస్తే మరొకరు వ్యతిరేకమవుతారని భావించిన కన్నా లక్ష్మీనారాయణ వ్యూహాత్మకంగా పావులు కదిపారు. తాను ఎక్కువగా ఇన్వాల్వ్ అవకుండా… అదే కులానికి చెందిన నాయకుడు దరువూరి నాగేశ్వరావుకు సమన్వయ బాధ్యతలు అప్పగించేశారు. అంతా ఒకే సామాజికవర్గానికి చెందిన నేతలు కావడంతో సమన్వయకర్త సమర్ధంగా ఉంటే.. కలిసిపోతారు, తనకు కూడా ఇబ్బంది ఉండబోదని భావించారట ఆయన. కానీ… చివరికి ఆయన ఆశించింది ఒకటైతే… జరుగుతున్నది మరొకటి అయిందట. పార్టీలో మొదటి నుంచి ఉన్న మమ్మల్ని కాదని దరువూరికి ప్రాధాన్యత ఇవ్వడమేంటని సత్తెనపల్లి టీడీపీలో కొంతమంది నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నట్టు సమాచారం. ఎమ్మెల్యేగా పనిచేసిన వైవీ ఆంజనేయులు వర్గం, కోడెల శివరాం వర్గాలు దరువూరికి ప్రాధాన్యత ఇవ్వడాన్ని తట్టుకోలేకపోతున్నాయట. ఇదే సమయంలో మరికొంత మంది అదే సామాజికవర్గానికి చెందిన నేతలు కూడా దరువూరిని వ్యతిరేకిస్తున్నారని సమాచారం. అటు దరువూరి నాగేశ్వరావు అలియాస్ డీఎన్ఆర్ వ్యవహార శైలిపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన సివిల్ సెటిల్మెంట్స్‌లో తలదూరుస్తున్నారన్న ఆరోపణలున్నాయి. సత్తెనపల్లిలో ఓ భూమి వ్యవహారంలో ఎంటర్ అయి సెటిల్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. స్వతహాగా కాంట్రాక్టర్, రియలెస్టేట్ వ్యాపారి అయిన డీఎన్ఆర్ వేసిన వెంచర్స్ గురించి కూడా చర్చ జరుగుతోంది. గతంలో నిబంధనలకు విరుద్దంగా అమరావతి మేజర్ కెనాల్ పక్కనుంచి వేసిన వెంచర్‌కు రోడ్డు ఏర్పాటు చెయ్యడంపై కూడా విమర్శలు వచ్చాయి.
Read Also: Gold Alert: అలర్ట్.. పసిడి మెరుగులు పైపైనేనా.. ఎందుకైనా మంచిది ఒకసారి చెక్ చేయండి
దీనిపై అప్పట్లోనే ఇరిగేషన్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు కూడా. ఇక వైసీపీ నేతలు కూడా ఆయన వ్యవహారంపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు డీఎన్ఆర్‌పై చేసిన ఆరోపణలు టీడీపీలో కలకలం సృష్టిస్తున్నాయి. ఇటీవల నియోజకవర్గంలో విద్యుత్ సబ్ స్టేషన్లలో పనిచేసే కొంతమంది షిప్ట్ ఆపరేటర్లను తొలగించారు. ప్రస్తుతం ఉన్న షిఫ్ట్ ఆపరేటర్ల స్థానంలో కొత్తవారిని నియమించడానికి డీఎన్ఆర్ డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు అంబటి. వివాదాల్లో ఉన్న స్థలాల వ్యవహారంలో ఎంటరై తక్కువకు కొనుగోలు చేస్తున్నారని, ఇలాంటి అక్రమాలు చాలానే జరుగుతున్నాయని అంటున్నారు సత్తెనపల్లి వైసీపీ నాయకులు. ఇక్కడే కన్నాకు తలనొప్పులు తయారవుతున్నాయట. గ్రూపు రాజకీయాలకు చెక్ పెట్టాలని తాను ప్రయత్నిస్తే… ఈ వ్యవహారం మొదటికే మోసం తెచ్చేలా ఉందని కన్నా కంగారు పడుతున్నట్టు సమాచారం. వివాదాస్పదంగా మారుతున్న డీఎన్ఆర్ తీరుపై సొంత పార్టీ నేతలే అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. సత్తెనపల్లి పరిణామాలు ఏ టర్న్ తీసుకుంటాయో చూడాలి మరి.