Off The Record: సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక నియోజకవర్గంలో రాజకీయాలు వేడేక్కుతున్నాయి. మరోసారి గెలిచి సత్తా చాటాలని బీజేపీ చూస్తుంటే…పోయిన చోటే వెతుక్కోవాలన్న సామెతని నిజం చేయాలని బీఆర్‌ఎస్ వ్యూహాలకు పదును పెడుతోంది. దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఎంపీ ప్రభాకర్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారట. ఇలాంటి సమయంలోనే దుబ్బాక నియోజకవర్గంలో బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీల్లో…కొత్త లొల్లి మొదలైందట.
బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిలపై…వ్యతిరేక గళం ఎత్తుతున్నారట సొంత పార్టీ నేతలు. కొన్ని రోజుల క్రితం దుబ్బాక బీజేపీ సీనియర్ నాయకులంతా కలిసి…రఘునందన్‌కు వ్యతిరేకంగా ఓ రహస్య సమావేశం ఏర్పాటు చేసుకున్నారట. ఎమ్మెల్యే రఘునందన్‌రావు పార్టీలో ఉన్న సీనియర్ నాయకులను పట్టించుకోవట్లేదనేది వారి ప్రధాన ఆరోపణ. ఆ తర్వాత జనవరి 29న కూడా మరోసారి దుబ్బాక నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలాల బీజేపీ నాయకులు మరోసారి సమావేశమయ్యారట. బీజేపీలో ఉన్న వ్యతిరేక గళం ఇప్పుుడు బీఆర్‌ఎస్‌లోనూ మొదలైందంట. బీఆర్ఎస్ ఎంపీ ప్రభాకర్ రెడ్డి…దుబ్బాక మండలంలోని నాయకులపై వివక్ష చూపుతున్నారని నామినేటేడ్ పోస్టులన్ని ఇతర మండలాల వారికే ఇస్తున్నారని ఆరోపిస్తూ…సొంతం పార్టీ నేతలు రహస్య సమావేశం పెట్టుకున్నారట. దాదాపు 200 మంది బీఆర్ఎస్ నాయకులు…మార్చి 16న సమావేశం ఏర్పాటు చేసుకొని…అనేక అంశాలపై చర్చించుకున్నారట. రెండు పార్టీల నేతలకు వ్యతిరేకంగా కింది స్థాయి నేతలు…సమావేశాలు నిర్వహిస్తుండటంతో…బీజేపీ, బీఆర్ఎస్ నేతల్లో ఆందోళన మొదలైదట.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ స్వపక్షంలో విపక్షంలా మారిన పార్టీ నాయకులతో.. ఇటు ఎమ్మెల్యే రఘునందన్‌రావు, అటు ఎంపీ ప్రభాకర్ రెడ్డి సతమతమవుతున్నారట. ఈ రహస్య సమావేశాల వెనుక…ఇతర పార్టీల కుట్ర ఉందంటూ ఎవరికి వారు చెప్పుకుంటున్నారట. బీజేపీ రహస్య సమావేశాలకు బీఆర్‌ఎస్ సపోర్ట్ చేస్తుందని…బీఆర్‌ఎస్ నాయకుల మీటింగ్‌కి బీజేపీ సపోర్ట్ చేస్తుందని ఎవరికి తోచినట్టు వారు చెప్పుకుంటున్నారట. మరి ఈ సమస్యను ఇద్దరు నాయకులు ఎలా పరిష్కరిస్తారోనని నియోజకవర్గంలో చర్చ జరుగుతోందట.