Off The Record: తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి, కేంద్రంలో రూలింగ్‌లో ఉన్న బీజేపీకి మధ్య ఢిల్లీ నుంచి గల్లీ దాకా… వాట్సాప్ నుంచి ఇన్‌స్టా వరకు వార్… నువ్వా నేనా అన్నట్టుగా నడుస్తూ ఉంటుంది. రెండూ జాతీయ పార్టీలు, ఈసారి తెలంగాణలో ఎలాగైనా పాగా వేయాలని బీజేపీ భావిస్తోంది కాబట్టి… పొలిటికల్ విమర్శలు, సవాళ్లు కామన్. కానీ కరీంనగర్ పొలిటికల్ సినారియో మాత్రం… కాస్త డిఫరెంట్ గురూ అన్నట్టుంది… వరుసగా రెండోసారి ఎంపీగా గెలిచిన బండి సంజయ్…. కేంద్రమంత్రి కావడంతో రాజకీయ సమీకరణల్లో కీలక మార్పు వచ్చిందని చెప్పుకుంటున్నారు. కరీంనగర్ లోక్‌సభ సీటు పరిధిలో బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. ఏడు అసెంబ్లీ స్థానాల్లో మూడు బీఆర్‌ఎస్, నాలుగు కాంగ్రెస్ గెలిచాయి. గతంలో అధికారంలో ఉన్న గులాబీ పార్టీతో ప్రస్తుత కేంద్ర మంత్రి బండి సంజయ్.. ఉప్పునిప్పు అన్నట్టే ఉండేవారు. ఇప్పటికీ కార్ పార్టీ పేరు వింటేనే ఒంటికాలిపై లేచినట్టుగా ఉంటుంది సంజయ్ వ్యవహార శైలి.
Read Also: Mr India 2025: తెలంగాణ వాసికి మిస్టర్ ఇండియా 2025 టైటిల్.. సినీ ఎంట్రీ ఫిక్స్?
అయితే రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగి కేంద్రంలో సంజయ్ మంత్రి పదవి చేపట్టాక లోకల్ ఎమ్మెల్యేలతో సఖ్యతగా ఉంటున్నారట ఆయన. కేంద్రం ఇచ్చే నిధులు.. సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ విషయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారాయన. ఢిల్లీలో ఢీ అంటే ఢీ అన్నట్టుగా ఫైట్ చేసే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, బీజేపీ కేంద్ర మంత్రి గల్లీలో దోస్త్ మేరా దోస్త్ అన్నట్టుగా వ్యవహరించడంపై పొలిటికల్ సర్కిల్స్‌లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. అయితే సంజయ్ మాత్రం.. ఎన్నికల వరకే రాజకీయాలు… తర్వాత అభివృద్ధి కోసం అందరం కలిసి పనిచేయాలి… అందుకే నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నానని అంటున్నారట. ఇక్కడి వరకు ఆల్ ఈజ్ వెల్. అంతా కన్విన్సింగ్‌గానే ఉంది. కానీ…కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి ప్రోగ్రామ్స్‌లో పాల్గొంటున్న బండి…. తన పార్లమెంట్ పరిధిలోనే ఎమ్మెల్యేగా ఉన్న రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌తో మాత్రం వేదిక పంచుకోకపోవడం ఏంటనే గుసగుసలు వినిపిస్తున్నాయి కరీంనగర్ పొలిటికల్ సర్కిల్స్‌లో. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆదిశ్రీనివాస్, మేడిపల్లి సత్యం, కవ్వంపల్లితో కలిసిమెలసి తిరుగుతున్నారు సంజయ్. చొప్పదండి, వేములవాడ, మానకొండూర్ నియోజకవర్గాల్లో సీసీ రోడ్ల శంఖుస్థాపన కార్యక్రమాలకు కూడా వీలు చేసుకుని మరీ హాజరవుతున్నారాయన. కానీ మంత్రి పొన్నంతో మాత్రం టచ్ మీ నాట్ అన్నట్టుగా ఉంటున్నారట.
Read Also: Off The Record: ఆ టీడీపీ ఎమ్మెల్యేలపై చంద్రబాబు వేటు వేయనున్నారా..?
అలా ఎందుకంటే…దానికి ప్రత్యేక కారణం ఉందన్నది లోకల్ టాక్. పొన్నం ప్రాతినిధ్యం వహిస్తున్న హుస్నాబాద్ పరిధిలోని చిగురుమామిడిలో రోడ్ల అభివృద్ధి కార్యక్రమానికి హాజరవ్వాలని అనుకున్నారు బండి. లోకల్ ఎమ్మెల్యేగా మంత్రి పొన్నం కూడా ఆ కార్యక్రమానికి రావాల్సి ఉన్నా… టైంకి రాకపోవడంతో నొచ్చుకున్న సంజయ్ ఆ ప్రోగ్రాంను క్యాన్సిల్ చేసుకున్నట్టు సమాచారం. అదే రోజు హుస్నాబాద్ లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రైతు మహోత్సవం కార్యక్రమానికి కూడా బండి సంజయ్ హాజరవలేదు. ఆ తర్వాత కరీంనగర్ నుంచి తిరుపతికి ఓ స్పెషల్ రైల్ ప్రకటించడంతో తన విజ్ఞప్తి మేరకే అంటూ ప్రెస్‌నోట్ విడుదల చేశారు రాష్ట్రమంత్రి పొన్నం ప్రభాకర్. ఆ క్రెడిట్ ఎవరిదో… మీడియా మిత్రులే గుర్తించాలంటూ మరో నోట్ రిలీజ్ చేశారు కేంద్రమంత్రి బండి. ఇద్దరి మధ్య అలా గ్యాప్ పెరుగుతూ వస్తోందని అంటున్నారు. మరోవైపు ఇటీవల మానకొండూరు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వివిధ అభివృద్ది పనుల శంకుస్థాపన కార్యక్రమాల్లో బండి సంజయ్ పాల్గొన్నారు… దీంతో మానకొండూర్‌కు సమయం ఇచ్చి… హుస్నాబాద్‌లో ఆగిపోయిన కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు టైం కుదరడం లేదనేది వాస్తవం కాదన్న చర్చలు జరుగుతున్నాయి. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని అన్నట్టుగా ఆ మధ్య ఇద్దరు కలిసినట్టే కలిసి అంతలోనే ఇలా అయ్యారని, ఇది నియోజకవర్గాల అభివృద్ధికి ఆటంకం అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది లోకల్‌గా.ఇద్దరి మధ్య కోల్డ్ వార్‌కు మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయనే టాక్ నడుస్తోంది. ఇద్దరూ కరీంనగర్ అసెంబ్లీకి… పార్లమెంట్‌కు పోటీ చేసినప్పటి నుంచీ వార్ కొనసాగుతూనే ఉందట. ఈ పరిస్థితుల్లో… బండి కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సఖ్యత మెయింటెన్ చేస్తూ మంత్రితో మాత్రం దూరం దూరం అనడం వెనక భవిష్యత్ ప్రణాళికలు ఉండి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు పొలిటికల్ పండిట్స్.