Off The Record: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిపోయింది. సుపరిపాలనకు సంవత్సరం పేరిట వేడుకలు కూడా చేసుకుంటున్నారు. ఇదే… ఫస్ట్ ఇయర్లో ఏ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? ఎవరి ప్లస్‌లు ఏంటి? ఎవరి మైనస్‌లు ఏంటి? ఎవరెవరు ఏమేం చేస్తున్నారు? ఎక్కడెక్కడ తిరుగుతున్నారు? ఎలాంటి లావాదేవీలు చేస్తున్నారు, ఇరుక్కుంటున్నారంటూ…. డీటెయిల్డ్ రిపోర్ట్ తెప్పించుకుంటున్నారట సీఎం చంద్రబాబు. ఇటీవల ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఆయన చేస్తున్న కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా ఆ రిపోర్ట్ ఆధారంగానే అన్నది ప్రభుత్వ వర్గాల సమాచారం. ఈ మధ్య కాలంలో ఒక విషయాన్ని పదే పదే చెబుతున్నారు సీఎం. దయచేసి ఎవరూ వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోవద్దన్నది ఆయన మాటల సారాంశం. అంటే… తమ పార్టీ ఎమ్మెల్యేల పనితీరు గురించి ఆయన దగ్గర పూర్తి స్థాయి నివేదికలు ఉన్నాయని, వాటి ఆధారంగానే హెచ్చరిస్తున్నట్టు అంచనా వేస్తున్నాయి రాజకీయ వర్గాలు. అదేవిధంగా ఎమ్మెల్యేలు కరప్షన్, ఇతరత్రా విషయాల్లో ఒళ్ళు దగ్గరపెట్టుకుని వ్యవహరించాలన్నట్టుగా ఉంటున్నాయి ముఖ్యమంత్రి హెచ్చరికలు. ఆయనేం సమాచారం లేకుండా అలా మాట్లాడ్డం లేదని, ఎమ్మెల్యేలకు సీఎం వార్నింగ్ వెనక చాలా కారణాలున్నాయని అంటున్నారు పరిశీలకులు.
Read Also: Manchu Vishnu : అమితాబ్ బచ్చన్ ను డైరెక్ట్ చేస్తా.. విష్ణు కామెంట్స్..
ఎమ్మెల్యే పనితీరును బట్టే… నియోజకవర్గంలో పార్టీ, ప్రభుత్వం మీద ప్రజలకు ఒక అభిప్రాయం ఏర్పడుతుందని, అందుకే… జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరిస్తున్నట్టు తెలుస్తోంది. ఎవరెవరు తేడాగా ఉన్నారో… సీఎంకు ఫుల్ క్లారిటీ ఉందని, ముందు కామన్‌గా అందర్నీ హెచ్చరించి… మెల్లిగా వన్ బై వన్ లెక్కల్లోకి రావచ్చన్న అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే కామన్‌గా చెప్పాల్సినంత వరకు చెప్పేశారని, ఇక మాటల్లేవ్… చేతలేనని అంచనా వేస్తున్నాయి టీడీపీ వర్గాలు. చెప్పాల్సింది చెప్పేశారు కాబట్టి….. ఇక నుంచి రెండు మూడు నెలలు ఎమ్మెల్యేల పని తీరును గమనిస్తారని, అప్పటికీ….. తేడా ఎమ్మెల్యేల తీరు మారకుంటే… చంద్రబాబు టైప్ ఆఫ్ యాక్షన్ మొదలయ్యే అవకాశం ఉందంటున్నారు టీడీపీ నాయకులు. ఇదే ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్ అయింది. బాబు టైప్ ఆఫ్ యాక్షన్ అంటే ఏ రకంగా ఉంటుందనే చర్చ ఎమ్మెల్యేలతో పాటు పార్టీ వర్గాల్లో కూడా జరుగుతోంది. ఇక రెండు మూడు నెలల్లో దారికి రాని శాసనసభ్యులను ఒక రకంగా డమ్మీలుగా చేసే ప్రక్రియ మొదలు కావచ్చంటున్నారు. సీఎం యాక్షన్ ప్లాన్ పరిధిలోకి వచ్చిన ఎమ్మెల్యేలు… అధికార పార్టీ వాళ్ళయినా సరే…. వాళ్ళ ఫోన్ కాల్స్‌కి అధికారులు స్పందించకపోవడం, ఇతరత్రా కింది స్థాయిలో సహకారం లేకపోవడం లాంటి చర్యలు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. నియోజకవర్గంలోని అధికార యంత్రాంగం మొత్తం ఎమ్మెల్యే డైరెక్షన్‌లో కాకుండా… అక్కడ పెట్టే ఇన్ఛార్జ్ గాని, వేరే నాయకుడి మాటగాని వినేలా ఆదేశాలు ఉండవచ్చన్నది ఓ అంచనా.
Read Also: UP: పొలంలో రహస్యంగా కలిసిన ప్రేమికులను రెడ్ హ్యాండెడ్ పట్టుకున్న గ్రామస్థులు.. కట్‌చేస్తే..
ఆ విషయంలో మాత్రం వేరే ఆలోచన ఉండకపోవచ్చని, చర్యలు కఠినంగా ఉంటాయని అంచనా వేస్తున్నాయి టీడీపీ వర్గాలు. ఇప్పటి నుంచే యాక్షన్ తీసుకోకపోతే… కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ దెబ్బతింటుదన్న నివేదికల మేరకే సీఎం సీరియస్‌గా వార్నింగ్స్ ఇస్తున్నారని, ఇష్టం వచ్చినట్టు ఆటాడే వాళ్ళకు టైం అయిపోయిందని అంటున్నారు. ప్రస్తుతం కూటమికి 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో ఇప్పటికే సగానికి పైగా రాంగ్ ట్రాక్‌లో ఉన్నట్టు నివేదికలు అందాయట. ఇప్పటికీ ప్రతి వారం సర్వేలు జరుగుతున్నట్టు సమాచారం. రాబోయే రెండు మూడు నెలల్లో మారని ఎమ్మెల్యేలకు ఇక శంకరగిరి మాన్యాలేనన్న ప్రచారం జరుగుతోంది. ఇదేదో ఎమ్మెల్యేని వ్యక్తి గతంగా టార్గెట్ చెయ్యడానికి కాదని, కూటమి మళ్లీ పవర్‌లోకి రావాలంటే….అలాంటి వాటికి చెక్ పెట్టాల్సిందేనన్నది టీడీపీ అధిష్టానం అభిప్రాయంగా తెలుస్తోంది. మరోవైపు…. ఇంత చెబుతున్నా…. కొంతమంది దారిలోకి వస్తారా లేదా అన్నది అర్థంకాని పరిస్థితి కూడా ఉందట. ఎందుకంటే ఇలాంటి అవకాశం మళ్ళీ రాదేమోనన్న ఆతృతలో కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. అలా ఆత్రంగా ఉన్నవాళ్ళు హెచ్చరికల్ని ఎంతవరకు పట్టించుకుంటారన్నది క్వశ్చన్ మార్క్ అంటున్నాయి రాజకీయవర్గాలు. ఇలాంటి రకరకాల అంశాలను పరిగణనలోకి తీసుకునే రెండు మూడు నెలల తర్వాత యాక్షన్ మొదలు పెట్టాలని సీఎం భావిస్తున్నట్టు తెలుస్తోంది. తేడాగా ఉన్న ఎంత మంది శాసనసభ్యులు దారికొస్తారో చూడాలి మరి.