Off The Record: తెలంగాణ రాజకీయం మొత్తం… ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చుట్టూనే తిరుగుతోంది. అధికార, ప్రతిపక్షాలకు ఇది చావో రేవో అన్నట్టుగా మారిపోయింది. మరీ ముఖ్యంగా…సిట్టింగ్ సీటును నిలబెట్టుకోవాలని బీఆర్‌ఎస్, అధికార బలం చూపించాలని కాంగ్రెస్ తహతహలాడుతున్నాయి. బీఆర్ఎస్ అయితే… సిట్టింగ్ సీట్ అనేకాకుండా… ఈ ఉప ఎన్నికలో గెలిస్తే… తిరిగి తమ బలం పెరిగిందన్న సంకేతాలు పంపడంతో పాటు వలసలు, కేడర్‌లో మనోధైర్యం నింపడం లాంటి చాలా ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందని భావిస్తోందట. అందుకే ఏ చిన్న ఛాన్స్ వదలకుండా పకడ్బందీ వ్యూహం రూపొందిస్తున్నారట గులాబీ పెద్దలు. అందులో భాగంగా ఇక్కడ ప్రభావం చూపగలిగిన వర్గాలను తమవైపునకు తిప్పుకునేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రధానంగా ముస్లిం మైనార్టీల ఓట్లు ఎక్కువ. వాళ్ళు పోలరైజ్ అయ్యేదాన్ని బట్టి ఫలితం తారుమారవుతూ ఉంటుంది. అందుకే.. ఎన్నికలు జరిగిన ప్రతిసారి… హైదరాబాద్ పాతబస్తీతోపాటు జూబ్లీహిల్స్ మీద కూడా స్పెషల్ ఫోకస్ పెడుతుంది ఎంఐఎం.
తాము గ్యారంటీగా గెలుస్తామన్న నమ్మకం ఉండే నియోజకవర్గాలతో పాటు ఇక్కడ కూడా దృష్టి సారిస్తారు మజ్లిస్ పెద్దలు. గత ఎన్నికల్లో ఎంఐఎం తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన రషీద్‌కి దాదాపు పదివేల ఓట్లు వచ్చాయి. ఆ ఎన్నికల్లో డైరెక్ట్‌గా బీఆర్‌ఎస్‌కి సపోర్ట్ చేసింది ఎంఐఎం. అయినా సరే… పార్టీ రిప్రజెంటేషన్ ఉండాలి కాబట్టి… ఏదో…. తూతూ మంత్రంగా పతంగి గుర్తు మీద ఒక క్యాండిడేట్‌ని పెడితే… పెద్దగా ఏమీ చేయకపోయినా పదివేలకు పైగా ఓట్లు రావడం మామూలు విషయం కాదంటున్నారు పరిశీలకులు. దీన్ని బట్టే ఇక్కడ మజ్లిస్ పార్టీ ప్రభావాన్ని అర్ధం చేసుకోవచ్చని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఈసారి ఎంఐఎం వైఖరి మారిపోయింది. గత ఎన్నికల్లో కారెక్కిన మజ్లిస్ పెద్దలు ఈసారి మాత్రం అధికారంలో ఉన్న కాంగ్రెస్ వైపే మొగ్గుతారన్నది విస్తృతాభిప్రాయం. దీంతో ముస్లిం మైనార్టీ ఓట్లలో చీలిక తెచ్చి పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకోవాలనుకుంటోందట బీఆర్‌ఎస్ అధిష్టానం. ఆ రకంగా ఎంఐఎం తమవైపు లేకున్నా సరే…. మైనార్టీ ఓట్లు గంపగుత్తగా కాంగ్రెస్‌కు పడకుండా అడ్డుకోవాలనుకుంటున్నట్టు సమాచారం.
అందులో భాగంగా గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎం తరపున బోరబండ కార్పొరేటర్ గా పోటీ చేసిన సమీర్‌ని రాత్రికి రాత్రే తమ పార్టీలోకి లాక్కున్నారు. మైనారిటీ ఓట్లు ఎక్కువగా ఉండే బోరబండ, షేక్‌పేట ప్రాంతాల్లో డివిజన్ స్థాయి కార్యకర్త దగ్గర నుంచి నియోజకవర్గ లెవల్ నేత వరకు ఎవరు అవకాశం ఉంటే వాళ్ళని బీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానిస్తున్నారు కేటీఆర్. ఇలా క్షేత్రస్థాయికి వెళ్ళడం ద్వారా…. ఓటర్లను గట్టిగా ప్రభావితం చేయవచ్చని అనుకుంటున్నారట. దీంతో పాటు మరో ప్రధానమైన ప్లాన్ కూడా గులాబీ పార్టీ అమలు చేయాలనుకుంటున్నట్టు సమాచారం. బాగా ప్రభావం చూపగలిగిన ముస్లిం మత పెద్దల్ని రంగంలోకి దింపాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. తాము అధికారంలో ఉన్నప్పుడు ముస్లింల సంక్షేమం కోసం ఏమేం చేశామో… అన్నీ మత పెద్దలకు తెలుసునని, అందుకే దేశ వ్యాప్తంగా ఉన్న ప్రభావవంతమైన మత పెద్దలందరితో కారు గుర్తుకు అనుకూలంగా సందేశాలు పంపేలా ప్లాన్ సిద్ధం చేస్తున్నారట. వాళ్ళు గనక రంగంలోకి దిగితే… కచ్చితంగా తమకు అడ్వాంటేజ్ అవుతుందన్నది గులాబీ పెద్దల ఆలోచన. అలాగే… కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలకు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదంటూ.. అదే విషయాన్ని ఎన్నికల ప్రచారంలో హైలైట్ చేయబోతున్నారట. మొత్తం మీద జాబ్లీహిల్స్‌లో గెలుపు కోసం వేస్తున్న ఇలాంటి ఎత్తులకు పై ఎత్తులు ఆసక్తి రేపుతున్నాయి. వీటకి ఓట్లు ఎంతవరకు రాలతాయో చూడాలి మరి.