Off The Record: టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీని అంటిపెట్టుకొని ఉన్న అతికొద్ది మంది సీనియర్ నేతల్లో ఒకరు ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన ఎన్ ఎం డి ఫరూక్. ఫ్యాక్షన్ జిల్లాలో రక్తం మరకలు అంటకుండా, అధిష్టానానికి దగ్గరగా వుంటూ పొలిటికల్ బండి లాగించేస్తున్నారాయన. పార్టీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా… వివాదాలకు దూరంగా ఉంటారన్న పేరుంది. ప్రతిపక్షంలో వున్నపుడు అంత చురుగ్గా కనిపించకపోయినా… పార్టీ అధికారంలో ఉంటే మాత్రం ఆయనకు పదవి గ్యారంటీ అని అంటుంటారు. ఆ విషయంలో సామాజిక సమీకరణలు ఆయనకు బాగా కలిసివచ్చే అంశం. నంద్యాల నుంచి ప్రాతినిథ్యం వహించడం, అక్కడ ముస్లిం మైనార్టీలు అధికంగా ఉండడంతో ఫరూక్‌కి పార్టీలో ఏ మాత్రం ప్రాధాన్యత తగ్గదని విశ్లేషిస్తుంటారు ఎక్కువమంది. సరే…. ఇవన్నీ మంచి సంగతులే… ఆయన ట్రాక్ బాగుందని అనుకుంటున్న టైంలో… ఆసారి మాత్రం మరకలు గట్టిగానే అంటుకుంటున్నాయట. ఈ విడత అధికారంలోకి వచ్చి, ఆయనకు మంత్రి పదవి దక్కాక… అనుచరులు ఓ రేంజ్‌లో చెలరేగిపోతున్నట్టు చెప్పుకుంటున్నారు.
Read Also: YS Jagan: రేపు వైఎస్ జగన్ కీలక సమావేశం.. దానిపై నిర్ణయం తీసుకుంటారా?
నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా, నాలుగు విడతలు మంత్రిగా, ఓసారి డిప్యూటీ స్పీకర్‌గా, మండలి ఛైర్మన్‌గా పనిచేసినప్పుడు ఎప్పుడూ రాని ఆరోపణలు ఈసారి మాత్రం తీవ్ర స్థాయిలో వస్తున్నాయట. ఆ వ్యవహారాలతో నేరుగా మంత్రికి సంబంధం ఉందని ఎవరూ అనకున్నా… ఆయన కుటుంబ సభ్యులు కొందరు, అనుచరగణం కలిసి నంద్యాల నియోజకవర్గాన్ని దున్నేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. వయసు, ఆరోగ్య పరిస్థితుల కారణంగా ఫరూక్ ఒక్కరే అన్ని వ్యవహారాలు చూసుకోలేకపోతున్నారట. ఆ క్రమంలోనే ఆయన ఇద్దరు కొడుకులు యాక్టివ్ అయినట్టు చెప్పుకుంటున్నారు. బదిలీలు, పోస్టింగ్స్, పంచాయతీలు, పార్టీ వ్యవహారాలన్నిటిలో వాళ్ళే తలదూరుస్తున్నారన్న ఆరోపణలున్నాయి. మంత్రి కొడుకులతో పాటు వాళ్ళ అనుచరులు కూడా యాక్టివ్ అయ్యారట. ఈ క్రమంలో ఎక్కడ తేడా కొట్టిందోగానీ… అడ్డగోలు వ్యవహారాలు జోరుగా జరుగుతున్నాయన్న ఆరోపణలు పెరుగుతున్నాయి. రేషన్ బియ్యం మొదలు బెల్ట్ షాపులు, మట్టి తవ్వకాలు, చివరికి తిరుమల వెంకన్న దర్శనానికి సిఫార్సు లేఖల వరకు అన్ని రకాల దందాలు జోరుగా నడుస్తున్నట్టు చెప్పుకుంటున్నారు.
Read Also: AP Government: ఏడాదిలో 4 లక్షల ఉద్యోగాలు.. ఇది కూటమి ప్రభుత్వ విజయం..
తిరుమలేశుడి దర్శనానికి మంత్రి ఫరూక్ పేరుతో తీసుకుంటున్న సిఫారసు లేఖలను ముగ్గురు అనుచరులు అమ్ముకుంటున్నారన్నది లోకల్ టాక్. ఒక్కో లెటర్‌కు పదివేల రూపాయల దాకా వసూలు చేస్తున్నారట. దీని గురించి ఇప్పుడు నంద్యాల నియోజకవర్గంలో బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు. ఆఫీస్ ఖర్చులు భరిస్తున్నామనే నెపంతో మంత్రి సిఫారసు లేఖలు అనుచరులు అమ్ముకోవడం అన్యాయం కదా అని మాట్లాడుకుంటున్నారు స్థానికులు. కొన్ని సందర్భాల్లో డిమాండ్ ఎక్కువైనప్పుడు….ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్లకు లేఖ ఇచ్చేస్తూ… ఫక్తు వ్యాపార ధోరణి అవలంభిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. మద్యం డిపోలో హమాలీల నియామకానికి ఒక్కొక్కరి నుంచి లక్షన్నర వరకు ముక్కు పిండి వసూలు చేశారట. గోస్పాడు, నంద్యాల మండలాల్లో 20 బెల్ట్ షాప్స్ ఉండగా ఒక్కో షాప్ నుండి 20 వేల రూపాయల వరకు వసూలు చేస్తున్నట్టు ప్రచారం ఉంది.
Read Also: YS Jagan Car Seized: జగన్ బుల్లెట్ ప్రూఫ్ కారును సీజ్ చేసిన పోలీసులు
బాగా నడిచే… కొన్ని మద్యం షాపుల దగ్గర బడ్డీ కొట్టు పెట్టుకున్న వారి నుండి కూడా నెలకు 20 వేలు వసూలు చేస్తున్నారట. మట్టి అక్రమ తవ్వకల్లోనూ మంత్రి అనుచరులు బాగానే పిండుకుంటున్నారన్నది లోకల్ టాక్. వైసీపీ హయాంలో మట్టి తవ్వకాలపై విమర్శలు చేసి అధికారంలోకి రాగానే అదేపని చేస్తున్నారన్నది నియోజకవర్గంలో వినిపిస్తున్న మాట. నంద్యాల మున్సిపాలిటీ వ్యవహారాలు ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి చూస్తుండగా ఓ మున్సిపల్ అధికారిని కొనసాగించడానికి రూ.35 లక్షలు తీసుకున్నారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. మంత్రి పేరు చెప్పుకుంటున్న ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారిపై ఎన్ని ఆరోపణలు వచ్చినా ఎందుకు స్పందించడం లేదనేది లోకల్ డౌట్. మంత్రి స్నేహితుని కుమారుడు ఆయన పేరు చెప్పి రేషన్ బియ్యం వ్యాపారం చేస్తున్నారట. అయితే… ఇన్ని వ్యవహారాలు జరుగుతున్నా.. అంత పబ్లిక్‌గా మాట్లాడుకుంటున్నా… ఇవన్నీ మంత్రి దృష్టికి రాలేదా అన్నది ఇంకో బిగ్ క్వశ్చన్. ఇప్పటికే ఫరూక్ కి చెడ్డపేరు వచ్చిందని, ఈ వ్యవహారాలకు చెక్ పెట్టకపోతే… ఇన్నేళ్ళ నుంచి ఆయన కాపాడుకుంటూ వస్తున్న పర్సనల్ ఇమేజ్, టీడీపీ ప్రతిష్ట మంటగలిసిపోవడం ఖాయమని ఘాటుగానే రియాక్ట్ అవుతున్నారు తెలుగుదేశం కార్యకర్తలు.