Off The Record: ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్. ఉందా.. లేదా అన్నట్టుగా… ఉండీ లేనట్టుగా… అలా అలా బండి లాగించేస్తున్న పార్టీ. అసలు ఒంట్లో బలం ఉందా లేదా అన్నదాంతో… సంబంధం లేకుండా సహజంగా వచ్చే డీఎన్‌ఏ ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఏపీ కాంగ్రెస్‌ని కూడా వేధిస్తున్నాయట. ఐకమత్యం, అందర్నీ కలుపుకునిపోవడం, కలిసి పనిచేయడంలాంటిని కాంగ్రెస్‌లో పెద్దగా కనిపించని లక్షణాలు. గ్రూపు గొడవలు, పరస్పరం గోతులు తీసుకుకోవడాలన్నవి ఆ పార్టీకి చాలా సాధారణమైన విషయాలని చెప్పుకుంటారు రాజకీయ పరిశీలకులు. అవే లక్షణాలు ఇప్పుడు ఏమీ లేని చోట కూడా కనిపిస్తున్నాయట. పీసీసీ అధ్యక్షురాలు షర్మిలకు వ్యతిరేకంగా కొందరు నాయకులు జిల్లాల వారీగా మీటింగ్స్ పెట్టుకుంటున్నారట. జాతీయ నాయకత్వం ఏం చేయాలనుకున్నా… ప్రతి విషయాన్ని పీసీసీ అధ్యక్షురాలు స్వలాభం కోసం వాడుకుంటున్నారని, తమను పూర్తిగా పక్కన పెట్టేస్తున్నారన్నది వాళ్ళ అసంతృప్తిగా తెలుస్తోంది. సుంకర పద్మశ్రీ లాంటి నేతలు నిర్వహిస్తున్న సమావేశాలతో పార్టీలో అలజడిరేగుతున్నట్టు చెప్పుకుంటున్నారు.
Read Also: Dil Raju: నా సినిమాలకు టికెట్ ధరలు పెంచను.. నిర్మాత దిల్ రాజు కీలక కామెంట్స్!
ఇప్పటికే రాష్ట్రంలో అడ్రస్‌లేని పార్టీలో ఇప్పుడు ఇవేం కొత్త గొడవలంటూ… ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉందట నాయకత్వం. ఈ సమావేశాల వెనక చాలా పెద్ద అజెండానే ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. ప్రతి జిల్లాలో వీలైనంత ఎక్కువగా ఇలాంటి నిరసన సమావేశాలు పెట్టడం ద్వారా…. రాష్ట్రంలోని పార్టీ కేడర్ మొత్తం పీసీసీ అధ్యక్షురాలిని వ్యతిరేకిస్తోందన్న సంకేతాలను ఢిల్లీ పెద్దలకు పంపాలనుకుంటున్నారట అసమ్మతి నేతలు. అలాగే పదవుల కోసం ఫైటింగ్ కూడా మొదలైనట్టు తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో 3 శాతం ఓట్లు ఉన్నాయని అనిపించుకుంది ఏపీ కాంగ్రెస్. 2024 నాటికి వచ్చేసరికి అది 1.7 శాతానికి పడిపోయింది. కాలం గడిచేకొద్దీ… కాస్తో కూస్తో బలం పెరగాల్సిందిపోయి… సగానికి సగం పడిపోతున్నా…. ఆ విషయం మీద దృష్టి పెట్టకుండా ఈ కీచులాటలు ఏంటన్నది పొలిటికల్ పరిశీలకుల క్వశ్చన్.
Read Also: UPI payments: “యూపీఐ లావాదేవీల”పై తప్పుడు ప్రచారం.. కేంద్రం సీరియస్ వార్నింగ్..
2024 ఎన్నికల్లో… మడకశిర, చీరాల, పాడేరు లాంటి నియోజకవర్గాల్లో ఉనికి చాటుకోవాలనుకున్నా…అది ఏ మాత్రం వర్కౌట్ కాలేదు. ఓట్ల సంగతి తర్వాత….. కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు ఆ మూడు చోట్ల. ఒక రకంగా చెప్పాలంటే…. ప్రస్తుతం వెంటిలేటర్ మీద ఉంది ఏపీ కాంగ్రెస్. అలాంటి చోట అంతా కలిసి బతికించుకోవాల్సిందిపోయి… ఎవరికి వారు మేం పైప్ లాగేస్తామన్నట్టు ప్రవర్తిస్తున్నారని, ఇలాగైతే… వచ్చే ఎన్నికల నాటికి ఆ 1.7 శాతం ఓట్లు కూడా మిగలవని పార్టీ సానుభూతిపరులు చెప్పుకుంటున్న పరిస్థితి. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న కమిటీ వల్ల ఉపయోగం లేదని నిరూపిస్తే, తమకు ప్రాధాన్యం దక్కుతుందన్నది అసమ్మతి నేతల అభిప్రాయంగా తెలుస్తోంది. ఎవరి ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో… ఏపీసీసీలో ఏం జరుగుతుందో చూడాలి మరి.