‘తమ్ముడు’ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు కీలక కామెంట్స్ చేశారు. తన సినిమాలకు టికెట్ ధరలు పెంచనని, ‘తమ్ముడు’ చిత్రానికి ధరలు పెంచమని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను అడగను అని అన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనకు ఆదర్శం అని, తాను పవన్ సూచనలను అనుసరిస్తా అని చెప్పారు. థియేటర్లలో ధరల నియంత్రణ విషయంలో పవన్ కల్యాణ్ చేసిన సూచనలు ఫాలో అవుతున్నానని పేర్కొన్నారు. ఏపీలో థియేటర్లలో ధరల నియంత్రణకు డిప్యూటీ సీఎం పవన్ తీసుకున్న చర్యల గురించి తెలంగాణ మంత్రివర్గ ఉపసంఘం భేటీలో ప్రతిపాదించామని దిల్ రాజు తెలిపారు.
‘సినీ పరిశ్రమలో మార్పు రావాలి. నా సినిమాలకు టికెట్ ధరలు పెంచను. తమ్ముడు చిత్రానికి ధరలు పెంచమని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలను నేడు అడగను. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక సూచనలు చేశారు. పవన్ కళ్యాణ్ నాకు ఆదర్శం, నేను ఆయన సూచనలను అనుసరిస్తా. పవన్ కళ్యాణ్ సూచనలను నిర్మాతలంతా తప్పకుండా పాటించాలి. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం నిర్మాతల బాధ్యత. టికెట్ ధరలు, తినుబండారాలు ప్రేక్షకులకు అందుబాటులో ఉండాలి. ఇకపై తెలంగాణలో టికెట్ ధరలు పెంచడం ఉండదు. తెలంగాణ మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలోనూ చర్చించాం. పవన్ కళ్యాణ్ సూచనలపై తెలంగాణ ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఇచ్చాను’ అని నిర్మాత దిల్ రాజు చెప్పారు.
ఏపీలోని థియేటర్ల నిర్వహణను పకడ్బందీగా చేపట్టి.. ప్రేక్షకులకు మెరుగైన సేవలు అందించాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవల సంబంధిత అధికారులను ఆదేశించారు. కొత్త సినిమాల విడుదల సందర్భంలో టికెట్ ధరల పెంపు కోసం నిర్మాతలు, వారికి సంబంధించిన వారు వ్యక్తిగత హోదాలో కాకుండా.. తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించాలని సూచించారు. ప్రేక్షకులు కుటుంబ సమేతంగా సినిమా హాలుకు రావాలంటే.. తినుబండారాలు, పానీయాల ధరలు చూసి వెనుకంజ వేసే వేయకూడదని అభిప్రాయపడ్డారు. ధరలు తగ్గితే ప్రేక్షకుల సంఖ్య పెరిగి.. పన్నుల రూపంలో ఆదాయం వస్తుందన్నారు. నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు తెరకెక్కించిన సినిమా తమ్ముడు. ఈ చిత్రం జులై 4న విడుదల కానుంది. ఈ సందర్భంగా నేడు ట్రైలర్‌ను లాంచ్ చేశారు.