Off The Record: ఏపీ బీజేపీ అంటే…. ఒకప్పుడు వాళ్ళే కనిపించేవాళ్ళు, ఆ గొంతులే వినిపించేవి. కానీ… సడన్‌గా ఆ స్వరాలు మూగబోయాయి. నాడు మొత్తం మేమే అన్నట్టుగా హడావిడి చేసిన నాయకులు ఉన్నట్టుండి మ్యూట్ మోడ్‌లోకి వెళ్ళిపోయారట. దీనిపై రకరకాల గుసగుసలు వినిపిస్తున్నాయి పార్టీలో. వాళ్ళలో అందరికంటే ఎక్కువగా మాట్లాడుకుంటున్నది రాజ్యసభ మాజీ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు గురించి. ఒకప్పుడు ఆయన చేసిన హంగామా అంతా ఇంతా కాదు. పార్టీకి సంబంధించిన ప్రతి కార్యక్రమంలోనూ కనిపించేవారు. విశాఖ ఎంపీగా పోటీ చేయాలన్న ఉద్దేశ్యంతో… ఫోకస్డ్‌గా అక్కడ చాలా కార్యక్రమాలు నిర్వహించారాయన. ఇక రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి కోసం ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టిన కొద్ది మందిలో ఫ్రంట్ లైనర్ జీవీఎల్. అలాంటి నాయకుడు… ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు, వినిపించడం లేదు. వేర్ ఈజ్ జీవీఎల్ అంటే.. నో… డోంట్ నో… అని పార్టీ నేతలే అంటున్నారట.
Read Also: Off The Record: రివెంజ్ పాలిటిక్స్ వద్దు.. అభివృద్దే ముఖ్యం అంటున్న మంత్రి..
రాష్ట్ర బీజేపీ రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నా… ఆయన ఉనికి మాత్రం కనిపించడం లేదు. ఉన్న రాజ్యసభ పదవీకాలం ముగిసిపోవడం, ఆ తర్వాత చెప్పుకోదగిన పోస్ట్ ఏదీ దక్కకపోవడంతో… బయటికి రావడం మానేసినట్టు మాట్లాడుకుంటున్నాయి బీజేపీ వర్గాలు. ఎంత చేసినా… ఇంతేనన్న నిరాశ జీవీఎల్‌ను ఆవహించి ఉండవచ్చన్న ఊహాగానాలు పెరుగుతున్నాయి. ఇక రెండోసారి కూడా అధ్యక్షా… అందామనుకుని అనలేకపోయినా….చివరికి అధ్యక్షుడు అనిపించుకుందామని బలంగా ప్రయత్నించి విఫలమైన నాయకుడు మాధవ్. ఆయనకు ఎమ్మెల్సీ రెన్యువల్ కాలేదు. అసాగని రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కలేదు. దీంతో మాధవ్ కూడా మ్యూట్ మోడ్‌కే ప్రాధాన్యం ఇస్తున్నట్టు చెప్పుకుంటున్నారు పార్టీ నాయకులు. ఎమ్మెల్సీ సంగతి సరే… అప్పట్లో కనీసం రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కినా… యాక్టివ్‌గా తిరుగుదామని అనుకున్నారట ఆయన. కానీ… ఏ పదవీ లేకపోవడంతో… నారాజ్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే బయట పెద్దగా కనిపించడం లేదు, పార్టీ కార్యక్రమాల్లో అటెండెన్స్ ఉండటం లేదని అంటున్నాయి బీజేపీ వర్గాలు. పదవి లేకపోతే రాజకీయాల్లో గుర్తింపు ఉండదని, పనులేవీ జరగవని, అలాంటప్పుడు ఎక్కువ మీదేసుకోవడం ఎందుకన్నది ఆయన అభిప్రాయంగా ప్రచారం జరుగుతోంది.
Read Also: Sharmistha Panoli: శర్మిష్ఠ పనోలిపై ఫిర్యాదు చేసిన వజాహత్ ఖాన్ అరెస్టు
ఇక, ఏపీ బీజేపీలో కనిపించకుండా పోయిన మరో సీనియర్ నాయకుడు విష్ణువర్ధన్‌రెడ్డి. ఉపాధ్యక్షుడు అంటున్నారే కానీ.. ఎక్కడా పేరు కూడా వినిపడటం లేదట. ఎన్నికల టైం నుంచే ఆయన్ని పక్కన పెట్టేసినట్టు చెప్పుకుంటున్నారు. పొత్తు కారణంగా విష్ణు ప్రాభవం పోయిందని పార్టీ కార్యకర్తలు మాట్లాడుకుంటున్న పరిస్థితి. రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ఆయన ఢిల్లీ ఆఫీస్ తలుపు తట్టినా… కామ్‌గా ఉండమని ఆదేశించినట్టు సమాచారం. ఏ పదవీ లేక, నామమాత్రపు ఉపాధ్యక్షుడిగా ఉండలేక, ఊళ్ళోకొచ్చి ముఖం చూపించుకోలేని ఊరి పెద్దలా తయారైందట విష్ణువర్ధన్ రెడ్డి పరిస్ధితి. అందుకే… ఆయన పార్టీ కార్యకలాపాలకు సైతం ముఖం చాటేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక్కడే పార్టీ కేడర్‌కు ఒక పెద్ద డౌట్ వస్తోందట. మన లీడర్స్ పదవులు ఉంటే తప్ప… జనంలో తిరగరా? వ్యక్తిగతంగా వాళ్ళకేం ఉపయోగం లేకుంటే… పార్టీ వాయిస్ వినిపించడానికి కూడా ముందుకు రారా? ఇదేనా కింది స్థాయికి వాళ్ళు ఇచ్చే సందేశం అంటూ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు పరస్పరం ప్రశ్నించుకుంటున్నట్టు తెలుస్తోంది. మళ్ళీ పోస్ట్ వచ్చేదాకా… వాళ్ళు అలాగే అజ్ఞాతంలో ఉండి పోతారా? లేక బీజేపీ సిద్ధాంతాలకు కట్టుబడ్డ నాయకులుగా…. తిరిగి యాక్టివ్ అవుతారా అన్నది చూడాలని ఏపీ బీజేపీ కేడరే అంటున్నారట.