Off The Record: సింహపురి పాలిటిక్స్ సరికొత్తగా కనిపించబోతున్నాయా? పగ పగ అని రగిలిపోతూ….పంతం నీదా? నాదా? సై…. అంటున్న టీడీపీ కార్యకర్తల్ని మంత్రిగారు చల్లబరుస్తున్నారా అంటే అవునన్నదే పరిశీలకుల సమాధానం. నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ. రెండోసారి కేబినెట్ బెర్త్ దక్కినప్పటి నుంచి అటు అమరావతితో పాటు ఇటు నియోజకవర్గంలో అభివృద్ధి పనుల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టారట ఆయన.
నెల్లూరు సిటీలో రోడ్లు, పార్కుల ఏర్పాటు, వైసీపీ హయాంలో మూతపడ్డ వీఆర్ హైస్కూల్‌కి కొత్త రూపు ఇవ్వడం లాంటి పనులు జరుగుతున్నాయి. అదంతా ఒక ఎత్తయితే… ఇప్పుడు ఇప్పుడు నారాయణ కేంద్రంగా జరుగుతున్న ప్రచారం ఆసక్తి రేపుతోంది. గత ప్రభుత్వంలో తమ మీద అక్రమ కేసులు పెట్టారని, తీవ్రంగా వేధించారని, అలాంటి వాళ్ళ మీద ఇప్పుడు రివెంజ్ తీర్చుకోవాల్సిందేనని మంత్రి మీద వత్తిడి తెస్తోందట నెల్లూరు టీడీపీ కేడర్. కార్యకర్తలు, నాయకులు గట్టిగా వత్తిడి తెస్తున్నా… మంత్రి మాత్రం లైట్ తీసుకుంటున్నట్టు సమాచారం.
Read Also: Karimnagar: స్వర్గం నుంచి దిగివచ్చిన తల్లిదండ్రులు.. AI వీడియో చూసి బాలిక కన్నీరు
వైసిపి ఐదేళ్ల పాలనలో ప్రస్తుత నుడా చైర్మన్ గా ఉన్న కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మీద చాలా కేసులు బుక్ అయ్యాయి. ఆయనతోపాటు కొందరు నాయకుల మీద రౌడీషీట్లు సైతం ఓపెన్ చేశారు. ఇప్పుడు అధికారం మారి తెలుగుదేశం పార్టీ పవర్‌లోకి రావడంతో…. ఇప్పుడు రివెంజ్ తీర్చుకోవాల్సిందేనని పట్టుబడుతున్నారట వాళ్ళంతా. అందుకు సంబంధించిన ఓ లిస్ట్‌ను కూడా మంత్రి నారాయణ ముందు పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. కానీ… ఆ విషయంలో మంత్రి పెద్దగా ఆసక్తి చూపలేదని టాక్ నడుస్తోంది. అలా… కేసులు పెట్టుకుంటూ పోతే భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని, అలాంటి పనులు చేయొద్దంటూ టీడీపీ నేతలతో పాటు పోలీసులకు కూడా చెప్పినట్టు సమాచారం. గత ప్రభుత్వం తన మీద కూడా అనేక కేసులు పెట్టిందని.. కానీ నేను వాటి జోలికి వెళ్లాలనుకోవడం లేదని అంటున్నారట నారాయణ. తన నోటీస్‌లో లేకుండా వైసిపి నేతల మీద అక్రమ కేసులు పెట్టొద్దని చెప్పినట్టు తెలిసింది.
Read Also: Off The Record: కవ్వంపల్లికి మంత్రి పదవి రాకుండా చేసింది ఎవరు..?
అభివృద్ధి అజెండాగా పనిచేస్తే ప్రజలు ఆటోమేటిక్‌గా మనల్ని గుర్తిస్తారని, ప్రత్యర్థులు సైతం మనల్ని మెచ్చుకునేలా పనిచేద్దామని మంత్రి నారాయణ చెబుతున్నారట. కానీ… నాయకులు మాత్రం ఆ మాటలతో తీవ్రంగా రగిలిపోతున్నట్టు తెలుస్తోంది. ఆయదేం పోయింది. కుర్చీలో కూర్చుని ఎన్నయినా చెబుతారు. గ్రౌండ్‌లో దిగి కొట్లాడి కొట్టించుకున్నవాడికి కదా… నొప్పి తెలిసేది అంటూ కాస్త ఘాటుగానే రియాక్ట్ అవుతున్నట్టు సమాచారం. కేసులు వద్దని చెబుతున్న నారాయణ.. అక్రమ కేసులు పెట్టించుకున్న తమకు పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడంలేదన్న అసంతృప్తి కూడా ఓ వర్గం నేతల్లో పెరుగుతోందట. వైసీపీ నుంచి చేరిన కొందరికి పార్టీలో అధిక ప్రాధాన్యత ఇవ్వడాన్ని కూడా కొందరు టీడీపీ పాత నేతలు జీర్ణించుకోలేకపోతున్నట్టు తెలుస్తోంది. అభివృద్ధి అంటూ ఆయన బిజీ బిజీగా ఉంటే.. రేపు వాళ్ళు చేయాల్సింది చేస్తారని, ఛాన్స్ వచ్చినప్పుడు తొక్కిపెట్టి నార తీయకుంటే… తర్వాత వాళ్ళకు అస్సలు భయం అన్నది ఉంటుందా అన్నది కొందరు టీడీపీ నాయకుల క్వశ్చన్ అట. పైగా… ఎవరైనా పని కోసం వెళితే గత ఎన్నికలలో నీ పర్ఫామెన్స్ ఏంటంటూ నారాయణ ప్రశ్నిస్తున్నారన్నది కొందరి ఫిర్యాదు.
నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో పాత నేతలకు భాగస్వామ్యం ఇవ్వకపోవడంపై గుర్రుగా ఉన్నారట. కేవలం అభివృద్ధి మంత్రాలు చదివితే సరిపోదని, దానికి సమాంతరంగా… చేయాల్సిన ఇతర పనుల్ని కూడా చేసేయాలంటూ…..ద్వితీయ శ్రేణి నాయకులు అసహనంగా ఉన్నట్టు సమాచారం. అటు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి జరుగుతున్నప్పటికీ…. దాని గురించి ప్రజల్లో చర్చ పెట్టే విషయంలో మాత్రం వెనుకబడ్డామన్న అభిప్రాయం ఉందట. నాయకులు, కార్యకర్తలు అసంతృప్తిగా ఉండటమే అందుకు కారణమని చెప్పుకుంటున్నారు. కేసులు, వేధింపులకు దూరంగా, అభివృద్ధికి దగ్గరగా ఉండాలంటున్న మంత్రి, పవర్ ఉన్నప్పుడు కొట్టి తీరాల్సిందే… మనమేంటో కూడా చూపించాల్సిందేనంటున్న ద్వితీయ శ్రేణి నాయరులు, కేడర్ మధ్య ఎంత మేరకు సయోధ్య కుదురుతుందో చూడాలంటున్నాయి సింహపురి పొలిటికల్ సర్కిల్స్.