యాదాద్రి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో హ్యాట్రిక్ విజయం కొసం ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహారిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మండలాలపై పట్టు సాధించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు ఎమ్మెల్యే. అయితే ఆమె చర్యలు పార్టీ కేడర్‌లో అసంతృప్తికి కారణం అవుతున్నాయట. చాలాకాలంగా ఎమ్మెల్యే సునీతా ఆమె భర్త నల్లగొండ DCCB ఛైర్మన్ మహేందర్ రెడ్డిలు మండలాల వారీగా సీనియర్లను కాదని మరికొందరిని ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై అధికారపార్టీలో మొదటి నుంచి ఉన్న గులాబీ నేతలు గుర్రుగా ఉన్నారట. సునీతా మహేందర్‌రెడ్డి వైఖరితో తుర్కపల్లి, బొమ్మలరామారం, యాదగిరిగుట్ట మండలాల్లో ప్రభావం చూపించే నాయకుడు ఒకరు పార్టీని వీడి వెళ్లిపోయినట్టు టాక్. రాజపేటకు చెందిన కీలన నాయకుడు సైతం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారట. దీనికితోడు ఆలేరులో ఎమ్మెల్యేను విభేదిస్తున్న గులాబీ నేతలు ఎప్పుడు బ్లాస్ట్ అవుతారో అనే ఆందోళన కేడర్‌లో నెలకొందట. ఎం ఆత్మకూరు మండలంలో నిన్న మొన్నటి వరకు యాక్టివ్‌గా పనిచేసిన ఇద్దరు నేతలు.. ఇప్పుడు పార్టీవైపు కన్నెత్తి కూడా చూడటం లేదని చెబుతున్నారు.
Read Also: APSRTC: గుడ్‌న్యూస్ చెప్పిన ఆర్టీసీ.. సంక్రాంతి ప్రత్యేక బస్సుల్లోనూ సాధారణ ఛార్జీలే
తాజాగా యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో కాంగ్రెస్ కౌన్సిలర్లను టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. దీనిపై స్థానిక టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కుతకుటలాడుతున్నట్టు సమాచారం. మున్సిపాలిటీపై పట్టు సాధించేందుకే పార్టీలో చేర్చుకున్నామని ఎమ్మెల్యే చెబుతున్నప్పటికీ.. స్థానిక టీఆర్ఎస్ నేతలతోపాటు మున్సిపల్ ఛైర్మన్ గుర్రుగా ఉన్నారట. రానున్న రోజుల్లో మున్సిపాలిటీలో సొంత బలాన్ని పెంచుకునేందుకే ఎమ్మెల్యే ఈ ఎత్తుగడ వేశారని మున్సిపల్ ఛైర్మన్ తదితరులు అనుమానిస్తున్నారట. అంతేకాదు.. మున్సిపల్ ఛైర్మన్ పీఠాన్ని కదిలించేందుకు ఎమ్మెల్యే అడుగులు వేస్తున్నారని సందేహిస్తున్నారు. ఈ పరిణామాలకు తోడు.. ఎమ్మెల్యే సునీత భర్త మహేందర్‌రెడ్డి సైతం ఆలేరులో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. రెండుసార్లు సునీత ఎమ్మెల్యేగా ఉండటం.. వచ్చే ఎన్నికల్లో ఆమెకు టికెట్ నిరాకరించినా.. పార్టీలో ప్రతికూలత కనిపించినా.. టికెట్ రేస్‌లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారట మహేందర్‌రెడ్డి.
మునుగోడు ఉపఎన్నిక సమయంలో టీఆర్ఎస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్‌కు ఎమ్మెల్సీ హామీ ఇచ్చారని సమాధాన పడినా.. మరో నేత పోటీకి రాకుండా జాగ్రత్త పడుతున్నారట ఎమ్మెల్యే భర్త. అయితే సునీత తీరుతో దూరం జరుగుతున్న పార్టీ నేతలు.. మహేందర్‌రెడ్డికి ఏ మేరకు చేరువ అవుతారో అని సందేహిస్తున్నారట. వచ్చే ఎన్నికల్లో అయితే సునీత లేకపోతే నేను అంటున్న ఆమె భర్త మహేందర్‌రెడ్డికి పరిస్థితులు అనుకూలిస్తాయా అనేది కేడర్ ప్రశ్న. అందుకే ఆలేరు గులాబీ శిబిరంలో అలజడిపై ఆసక్తిగా చర్చించుకుంటున్నాయి పార్టీ శ్రేణులు.