తొందరపడి మాట్లాడతారు.. ఆ తర్వాత నాలుక కర్చుకుంటారు. ఇది అధికారపార్టీలో ఓ మంత్రిగారిపై ఉన్న అభిప్రాయం. అలాంటి అమాత్యులవారు ఇప్పుడు అస్సలు పెదవి విప్పడం లేదు. అధిష్ఠానం వద్ద అక్షింతలు లేవు. వేడి తగ్గిందో ఏమో సైలెంట్ అయిపోయారు. ఆయన మౌనం కూడా చర్చగా మారిపోయింది. ఇంతకీ ఎవరా మంత్రి?
నోటి దురుసు వల్ల పదవి పొడిగింపు కష్టమనే టాక్
నారాయణ స్వామి. ఏపీ డిప్యూటీ సీఎం. చిత్తూరు జిల్లాలోని గంగాధర నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. శాసనసభ్యుడిగా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోని ఆయన.. ఉపముఖ్యమంత్రి అయ్యాక మాత్రం అదేపనిగా చర్చల్లోకి వస్తున్నారు. డాక్టర్ అనితారాణి వ్యవహారం.. మైనారిటీలపై చేసిన కామెంట్స్.. ఎమ్మెల్యే రోజాతో గొడవలు.. సినీ పరిశ్రమలో వారసత్వంపై చేసిన వ్యాఖ్యలతో వివాదాలకు కార్నర్ అయ్యారు నారాయణస్వామి. ఆ నోటి దురుసు కారణంగా ఆయనకు మంత్రి పదవి పొడిగింపు కష్టమే అనే టాక్ అధికారపార్టీలో వినిపించింది. ఒక సభలో ఆయనే ఆ విషయాన్ని చెప్పుకొన్నారు కూడా. ఆ వెంటనే తప్పు చేయనప్పుడు భయపడాల్సిన పనిలేదని ఆయనకు ఆయనే ధైర్యం చెప్పుకొన్నారు. ఆ తర్వాత నారాయణస్వామి శాఖల్లో కోత పెట్టింది ప్రభుత్వం. వాణిజ్య పన్నుల శాఖను తప్పించింది. ప్రస్తుతం ఎక్సైజ్ శాఖకు మాత్రమే ఆయన మంత్రి. అలాంటి ప్రస్తుతం మౌనవ్రతం పాటిస్తూ చర్చల్లోకి వస్తున్నారు.
టీచర్ల ఉద్యమంపై చివరిగా కామెంట్స్
పీఆర్సీపై ఉపాధ్యాయులు చేస్తున్న ఆందోళనపై మాత్రం నారాయణస్వామి కొన్ని ప్రశ్నలు సంధించారు. ప్రభుత్వ టీచర్లు వారి పిల్లలను సర్కార్ బడుల్లో చదివిస్తున్నారా అన్నది డిప్యూటీ సీఎం ప్రశ్న. నెలకు 70 వేల నుంచి లక్షకుపైగా జీతం తీసుకుంటూ పిల్లలను మాత్రం ప్రైవేట్ స్కూళ్లలో చదివిస్తున్నారని నారాయణస్వామి మండిపడ్డారు. డిప్యూటీ సీఎం గట్టిగా మాట్లాడిన మాటల్లో ఇదే చివరిది. ప్రతిపక్ష పార్టీలు.. చంద్రబాబులపై నారాయణస్వామి మాటల దాడి తగ్గిందని వైసీపీలో టాక్. దానికితోడు నియోజకవర్గంలో వైసీపీ వర్గపోరుతో ఆయన చికాకు పడుతున్నారట. గ్రూపులను బుజ్జగించడం నారాయణస్వామికి తలనొప్పిగా మారిందట.
గతంలో పార్టీ పెద్దలు అక్షింతలు వేశారని ప్రచారం
వాస్తవానికి నారాయాణస్వామి పలు సందర్భాలలో చేసిన కామెంట్స్‌తో ఇబ్బందులు ఎదురయ్యాయి. దాంతో పార్టీ పెద్దలు అక్షింతలు వేశారట. ఆ తర్వాత దూకుడు తగ్గించి ఆచితూచి మాట్లాడుతున్నారని టాక్. మంత్రివర్గ ప్రక్షాళణలో నారాయణ స్వామికి ఉద్వాసన చెబుతారని అధికారపార్టీలో చెవులు కొరుక్కుంటున్నారట. ఆ విషయం తెలిసిందో ఏమో.. ఒక కార్యక్రమంలో సీఎం జగన్ కాళ్లపై పడ్డారు నారాయణస్వామి. అక్కడితో ఆగితే లాభం లేదని అనుకుని చేతికి ముఖ్యమంత్రి జగన్ ఫొటో ఉన్న గోల్డెన్ రింగ్ పెట్టుకున్నారు. అది మీడియా కంట పడేలా చక్కగా ప్రదర్శించారు కూడా. అధినేతను ప్రసన్నం చేసుకునేందుకు ఎన్ని ఫీట్లు చేసినా మంత్రిగారికి ఎక్కడో డౌట్ కొడుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే వివాదాస్పద కామెంట్స్‌కు దూరంగా ఉంటున్నారని చెబుతున్నారు. నోటికి పని చెప్పకుండా సేఫ్ గేమ్ ఆడుతున్నారని మరో వాదన. మరి.. నారాయణస్వామి మౌనవ్రతం ఎన్నాళ్లు కొనసాగుతుందో.. ఎంత వరకు ఆయనకు కలిసివస్తుందో చూడాలి.