ఆయనకు ఏ పదవి లేకపోయినప్పటికీ… నిన్నటి వరకు పోలీసులు, మంది మార్బలంతో గ్రామాలు చుట్టేశారు. అధికార పార్టీలోనే ఉన్నానంటూనే…పార్టీ నేతల సహకారం లేకుండానే పరామర్శల పేరుతో తిరిగేశాడు. ప్రస్తుతం ఆయన్ను పార్టీ నుంచి పొమ్మనలేక పొగ పెట్టేశారా ? సోషల్ మీడియాలో ఆయన మీద వచ్చి రాగానే సెక్యూరిటీని తొలగించడంలో ఆంతర్యం ఏమిటి.. ఆత్మీయ సమ్మేళనం పార్టీ నషాళానికి అంటిందా..
ఖమ్మం జిల్లాకు చెందిన అధికార పార్టీ నేతలు…ఇప్పుడు ఎలాంటి పదవులు లేకుండానే జిల్లా చుట్టేస్తున్నారు. అలాంటి నేతల్లో మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ముందువరుసలో ఉన్నారు. కాంట్రాక్టర్‌గా ఉండి….రాజకీయ ప్రవేశం చేశారు పొంగులేటి. పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇవ్వగానే…తొలి ఎన్నికలోనే ఎంపీగా పోటీ చేసి విజయం సాధించాడు. 2014 ఎన్నికల్లో ఖమ్మం ఎంపీ అయిన తరువాత…తన అనుచరవర్గంతో కలిసి టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నాడు. అసెంబ్లీ ఎన్నికల తరువాత పార్టీ అధినేత కెసిఆర్‌కు…తనకు నచ్చని వారి జాబితాలో పొంగులేటి చేరిపోయాడు. దీంతో 2019 ఎన్నికల్లో పొంగులేటికి ఎంపీ టిక్కెట్ ఇవ్వలేదు. అయినప్పటికి పార్టీలోనే ఉంటూ వచ్చారు. జిల్లాలో అధికార పార్టీ నాయకులు, ముఖ్యంగా ఎమ్మెల్యేలు…పొంగులేటికి సహకరించకపోయినా…ఆయన మాత్రం ఇల్లు ఇల్లు తిరిగారు. పరామర్శల పేరుతో జిల్లాలో తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్నాడు.
గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండిపోయిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి….ఈ సారి మాత్రం పోటీ చేయాల్సిందేనంటున్నారట. ఈ సారి కూడా పోటీ చేయకపోతే ఎలా ? అంటూ… తాను, తన వర్గం పోటీ చేస్తామని ఆత్మీయ సమ్మేళనంలో ప్రకటించారు. ఇదే పొంగులేటికి…గులాబీ పార్టీలో సమస్య అయి కూర్చుందట. ఆత్మీయ సమ్మేళనంలో పోటీ చేస్తానని చెప్పగానే… ఆయన ప్రత్యర్ధి గ్రూపు పొంగులేటిని టార్గెట్ చేసిందంట. ఖమ్మం జిల్లా కేంద్రంలోని కొన్ని సోషల్ మీడియా గ్రూపుల్లో పొంగులేటికి వ్యతిరేకంగా పోస్ట్‌లు మొదలయ్యాయి. పార్టీకి ఏ మాత్రం సేవ చేయకపోయినా…పార్టీ కల్పించే గన్‌మెన్లను వాడుకుంటాడంటూ విమర్శలు గుప్పిస్తున్నారట.
పార్టీని ముక్కలు చేస్తాడు…పార్టీ పదవులను కోరతాడు..పార్టీ ఓడాలి… తాను మాత్రమే గెలువాలి అంటూ పొంగులేటికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారట. నువ్వు పార్టీకి చేసిన మేలు ఏమిటో ఒక్కటంటే ఒక్కటి చెప్పు అంటూ సోషల్ మీడియాలో పొంగులేటికి ప్రశ్నలు సంధిస్తున్నారట. ఈ పోస్టుల పర్యవసనామో ఏమో కాని…పొంగులేటికి మాత్రం సెక్యూరిటి కట్ చేసింది ప్రభుత్వం. ఇప్పటి వరకు 16 మందికి పైగా ఉన్న సెక్యూరిటీని ఉపసంహరించుకుంది. మాజీ ప్రజా ప్రతినిధులకు సెక్యూరిటీ ఎలా ఉంటుందో…అలాగే పొంగులేటికి టూ ప్లస్ టూ సెక్యూరిటీని మాత్రమే ఇచ్చారు. ఇలా సెక్యూరిటిని తగ్గించడం వెనుక పొంగులేటికి పొగ పెడుతున్నారా.. అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయట.
ఇక పొంగులేటి గులాబీ పార్టీని వదిలించుకోవడం ఒక్కటే మార్గమని ఆయన అనుచరుల్లో జోరుగా చర్చ సాగుతోందట. ఇప్పటికే మంత్రి అజయ్ కుమార్, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, సత్తుపల్లి ఎంఎల్ఎ సండ్ర వెంకటవీరయ్యలతో…పొంగులేటికి తీవ్ర విభేదాలు ఉన్నాయట. వారంతా ఆయనకు వ్యతిరేకంగా పావులు కదుపుతూనే ఉన్నారట. సత్తుపల్లి, పినపాకలలో…పొంగులేటికి సండ్ర, రేగా కాంతారావు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉందంట. ఈ పరిస్థితుల్లో అధికార పార్టీ నేతలతో పొంగులేటి రాజీ పడే అవకాశం లేదని టాక్ నడుస్తోంది. ఈ కారణంగానే పొంగులేటి టార్గెట్‌గా అధికార పార్టీలో రాజకీయాలు సాగుతున్నాయా ? పొంగులేటి తన దారి తాను చూసుకోవలసిందేనా ? కాలమే సమాధానం చెప్పాలి.