మత్తు రాజకీయంలోకి జనసేన కూడా ఎంటరైందా? ఇరికించామని టీడీపీ.. కౌంటర్ ఇచ్చామని అధికార పార్టీ అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా తెర మీదకు వచ్చారు జనసేనాని. పొలిటికల్‌గా అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం చేశారా? లేక చంద్రబాబు మనిషిగానే పవన్ కల్యాణ్ కామెంట్స్ పాస్ చేశారా?
గంజాయిపై వరసగా ట్వీట్స్ రిలీజ్ చేస్తోన్న పవన్..!
ఏపీలో రాజకీయం మత్తులో జోగుతోంది. ఉదయం లేచింది మొదలు అధికార పార్టీ.. ప్రతిపక్ష టీడీపీ.. డ్రగ్స్.. హెరాయిన్.. గంజాయి అంటూ మాటల తూటాలు పేల్చుకుంటున్నాయి. ఈ ఎపిసోడ్‌లోకి జనసేన కూడా ఎంట్రీ ఇచ్చింది. నెలన్నరగా గంజాయి.. డ్రగ్స్‌లపై పెద్దఎత్తున రాజకీయం నడుస్తోన్నా.. అంతగా స్పందించని జనసేనాని.. చంద్రబాబు ఢిల్లీ నుంచి తిరిగి వచ్చాక గేర్ మార్చారు. కిక్కిచ్చే పొలిటికల్ గేమ్ షోలోకి వచ్చేశారు. వరస ట్వీట్లు.. ఇటీవల కాలంలో వివిధ రాష్ట్రాల్లో పోలీసులు పట్టుకున్న గంజాయిని.. దాని మూలాలను వివరిస్తోన్న అధికారుల వీడియో క్లిప్పింగులను ట్విటర్‌లో జతపరిచి ఒకదాని వెనక ఒకటిగా విడుదల చేస్తున్నారు.
గంజాయి అరికట్టే విషయంలో వైసీపీ, టీడీపీ దొందూ దొందేనని చెబుతున్నారా?
ఈ వరస ట్వీట్స్‌లో ఓ ఆసక్తికర పరిణామం. 2018లో తాను AOBలోని గిరిజన తండాలలో పోరాట యాత్ర చేసిన సందర్భంలో గంజాయి సాగు.. రవాణా అంశాలు ప్రస్తావనకు వచ్చాయని పవన్ కల్యాణ్ తెలిపారు. అంటే ఏపీలో గంజాయిసాగు ఇప్పుడే పుట్టుకొచ్చిన వ్యవహారం కాదు. గతం నుంచి ఉంది. కాకపోతే మరింతగా పెరిగిందనే అర్థం వచ్చే రీతిలో ట్వీట్స్ చేశారు పవన్. వైసీపీ.. టీడీపీలను ఇరకాటంలోకి నెట్టేలా పవన్ ట్వీటర్ రాజకీయం చేస్తున్నారని చర్చ జరిగింది. గంజాయిని అరికట్టే విషయంలో రెండు పార్టీలు దొందూ దొందేననే ఎస్టాబ్లిష్ చేస్తున్నారని అనుకుంటున్నారు.
పవన్ ట్వీట్స్ టీడీపీకి డ్యామేజ్ చేసే విధంగా ఉన్నాయా?
గంటా, అయ్యన్నల వీడియోలు ఎందుకు పోస్ట్ చేయాలని వైసీపీ ప్రశ్న..!
ఇదే అంశంపై వైసీపీ-టీడీపీల్లో కూడా చర్చ జరిగింది. గంజాయిపై ట్వీట్ చేస్తే చేశారు.. 2018 ప్రస్తావన ఎందుకు తెచ్చారని.. టీడీపీ గింజుకుంటోందట. టీడీపీ హయాంలో గంజాయి సరఫరా.. సాగు విషయంలో నాటి మంత్రులు గంటా శ్రీనివాస్, అయ్యన్న చేసిన కామెంట్స్‌ను ఇప్పుడు సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. అవి టీడీపీకి డామేజ్ చేసే విధంగా ఉన్నాయని ఆందోళన చెందుతుంటే.. ఇదే సమయంలో పవన్ కల్యాణ్ దాన్ని మరింత బలపరిచే రీతిలో ట్వీట్స్ చేయడం వల్ల మరింత చిక్కుల్లో పడతామని టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారట. మరోవైపు 2018 అంశాన్ని ఏదో తూతూ మంత్రంగా ప్రస్తావించారు తప్ప.. తమను.. తమ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేలా పవన్ ట్వీట్స్ ఉన్నాయని వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారట. పవన్‌లో చిత్తశుద్ధి ఉంటే.. గతంలో నాటి మంత్రులు గంటా, అయ్యన్నలు చేసిన కామెంట్స్‌ను కూడా ట్వీట్ చేయొచ్చు కదా అని ప్రశ్నిస్తున్నారట. ఏది ఏమైనా.. జనసేనాని.. టీడీపీ గూటి పక్షేననే విషయం అందరికీ తెలుసంటున్నారు వైసీపీ నేతలు.