వైసీపీలో రెండుసార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందిన బొంతు రాజేశ్వరరావు జనసేన పార్టీ జెండా కప్పుకోవడానికి లైన్ క్లియరైందా? ఈ సారి జనసేనలో అదృష్టం తేల్చుకుంటారా? రాజోలు రాజకీయం రసకందాయంలో పడినట్టేనా? అభ్యర్థలు అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు మారితే లక్ మారుతుందా? విజయం వరిస్తుందా? పార్టీ మారితే తల రాత మారిపోతతుందా?
అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు రాజకీయ సమీకరణాలు రసకందాయంలో పడ్డాయి. 2014, 2019 ఎన్నికల్లో వరసగా వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు బొంతు రాజేశ్వరరావు. చీఫ్ ఇంజనీర్‌గా పనిచేసి రాజకీయాల్లోకి వచ్చిన ఆయన.. రెండు వరస ఓటములతో అధికారపార్టీలో చీప్ అయిపోయారు. చివరకు నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ పదవి పీకేయడంతో.. బొంతుతో ప్రయోజనం లేదని.. ఆయన్ని నమ్ముకున్నోళ్లంతా ఒక్కొక్కరుగా జారుకున్నారు. ప్రభుత్వం అధికార పదవి ఇచ్చినా ఆయన అవమానంగానే ఫీలయ్యారట. అందుకే ఆ పదవికి ముచ్చటగా మూడే నెలలకే రాజీనామా చేశారు. వైసీపీకీ దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇటీవల వరద బాధితులను పరామర్శించేందుకు సీఎం జగన్ రాజోలు వస్తే.. ఆ టూర్‌కు బొంతు డుమ్మా కొట్టేశారు. ఇప్పుడు వైసీపీని వీడేందుకు నిర్ణయించుకున్నారట.
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో బొంతు రాజేశ్వరరావు భేటీ అయ్యారు. దీంతో రాజేశ్వరరావు జనసేన కండువా కప్పుకోనున్నట్టు తెలుస్తోంది. పవన్ కల్యాణ్‌ను మలికిపురం తీసుకొచ్చి జనసేనలో చేరడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారట.
2019 ఎన్నికల్లో జనసేన పరువు నిలబెట్టిన నియోజకవర్గం రాజోలు. ఆ ఎన్నికల్లో రాపాక వరప్రసాదరావును ఎమ్మెల్యేగా గెలిపించారు. వైసీపీ గాలిలో సైతం స్థానిక జనసైనికులు గట్టిగా పోరాటం చేశారు. అసలు విషయం ఏంటంటే వైసీపీ టికెట్ ఇవ్వకపోవడంతో ఎన్నికలకు ముందే రాపాక వరప్రసాదరావు జనసేనలో చేరారు. జగన్‌పై దుమ్మెత్తిపోసి జనసేనానిని దేవుడిని కొనియాడారు. దీంతో జనసైన్యం రాపాకను నమ్మి ఆయన వెంట నడిచింది. గెలిచాక కూడా తాను జనసైన్యం వల్లే గెలిచానని రాపాక చెప్పుకొచ్చారు. తాను పార్టీ మారేది లేదని.. 152వ నెంబర్‌గా ఉండేకంటే.. జనసేనలో నెంబర్ వన్‌గా ఉంటానని ఊదరగొట్టారు. కానీ.. ప్లేటు ఫిరాయించేశారు. వైసీపీకి.. సీఎం జగన్‌కు జైకొట్టేశారు రాపాక.
ఎమ్మెల్యే రాపాక ఇప్పుడు వైసీపీకి పూర్తిస్థాయిలో రూపాంతరం చెందిన నేతగా మారిపోయారు. ఇదే సమయంలో జనసేనకు రాజోలులో ఇప్పటికీ ఇంఛార్జ్ లేరు. ఎమ్మెల్యే అభ్యర్థిగా పార్టీ ఎవరినీ గుర్తించలేదు. ఇటీవల పార్టీలో చేరి.. పవన్ వెంట నడుస్తున్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వరప్రసాద్ ఇక్కడ బరిలో దిగుతారన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఎంత ప్రయత్నించినా.. వైసీపీలో విజయం దక్కకపోవడంతో బొంతు రూటు మార్చారు. జనసేన కేడర్ బలంగా ఉన్న రాజోలులో గెలవడానికి ఆ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. గెలుపునకు గ్యారెంటీ ఉందనే అభిప్రాయంతో బొంతు గోడ దూకేందుకు రెడీ అయ్యారట. అయితే తాను కాకుండా తన కుమార్తెను రాజోలు బరిలో జనసేన నుంచి బరిలో దించాలనే ఆలోచనలోనూ బొంతు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.
తాజా పరిణామాలు ఎలా ఉన్నప్పటికీ.. రాజోలు జనసైనికుల్లో పలు అనుమానాలు బలంగా ఉన్నాయట. రాపాక ఉదంతాన్ని తలుచుకుని.. సందేహాలు వ్యక్తం చేస్తున్నారట. రాజేశ్వరరావుకు సీఎం జగన్ కుటుంబానికి దగ్గరగా ఉండే నాయకుడనే పేరుంది. అందుకే ఆయన్ని పార్టీలో చేర్చుకోని టికెట్ ఇస్తే.. బొంతు మరో రాపాక అవుతారన్న అనుమానాలు ఉన్నాయట. బొంతు వస్తే.. తమ పరిస్థితి ఏంటనే ప్రశ్నలు జనసేనికుల్లో ఉన్నాయట. ఇప్పటికే రాజోలు జనసేనలో గ్రూపులు ఎక్కువయ్యాయి. ఈ విషయంలో ఎవరి వాదన ఎలా ఉన్నా.. బొంతు రాకతో జనసేన విజయం ఖాయమని.. ఆయన ఎమ్మెల్యే కావడం పక్కా అని కొందరు రాజోలులో ప్రచారం మొదలు పెట్టేశారట. మరి.. రాజోలు జనసేన జాతకం ఎలా ఉందో కాలమే చెప్పాలి.