మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో చాలామంది బెర్త్ కోల్పోతే తానేటి వనితకు మాత్రం కొనసాగింపుతో పాటు ప్రమోషన్ లభించింది. ఓ మెట్టు పైకి ఎక్కారు. కీలకమైన హోంశాఖను దక్కించుకున్నారు. మొదటి కేబినెట్‌లో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఇచ్చిన సీఎం.. ఇప్పుడు తన మీద ఇంతటి బాధ్యత పెట్టినందుకు వనిత ఆనందపడ్డారు. కానీ హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టి రెండు వారాలు కూడా కాకుండానే వరస సంఘటనలు.. కామెంట్స్‌తో వివాదాలు ఇరుక్కుంటున్నారు.
మహిళలపై వరస అఘాయిత్యాలతో పోలీస్ శాఖ గందరగోళంలో పడుతోంది. ఒక జిల్లాలో ఒక ఘటన జరిగితే దానిని ఛేదించేలోపే మరోచోట మరో దారుణం వెలుగులోకి వస్తోంది. ఈ పదిహేను రోజుల్లో ఒక్క గుంటూరు జిల్లాలోనే దాదాపు ఐదుచోట్ల మహిళలపై లైంగిక దాడులు, హత్య ఘటనలు జరిగాయి. విజయవాడలో సంచలనం రేపిన ప్రభుత్వ ఆస్పత్రిలో అత్యాచార ఘటన.. ఆ వెనువెంటనే మరో రెండు చోట్ల ఇదే తరహా నేరాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా విజయనగరం జిల్లాలో వివాహితపై లైంగిక దాడి జరిగింది. ఈ ఘటనలో ఒక హెడ్ కానిస్టేబుల్ కుమారుడే ప్రధాన నిందితుడు. ఇక ఏలూరు జిల్లాలో జరిగిన వైసీపీ నేత ప్రసాద్ హత్య, విజయవాడలో మత్తు మందులు.. ఇతర హత్యలు సరేసరి.
ఏ ముహుర్తాన హోంమంత్రిగా వనిత బాధ్యతలు చేపట్టారో కానీ.. వరస లైంగిక దాడులు ఆమెను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయట. వీటిని పోలిసింగ్ వైఫల్యంగా సరిపెడదామన్నా.. మంత్రిగారు అలా వదిలేయటం లేదు. సున్నితమైన అంశాల్లో నోరుజారి తనకు తానే వివాదాల్లో కూరుకుపోతున్నారు. ఆడపిల్లల భద్రత పోలీసులది కాదు తల్లులదే అని ఓ భారీ స్టేట్ మెంట్ ఇచ్చారు. తల్లులు తమ ఆడపిల్లలను జాగ్రత్తగా చూసుకుంటే ఇటువంటి లైంగిక దాడులు జరగవన్నది హోమ్ శాఖా మంత్రి సూత్రీకరణ.
ఈ వ్యాఖ్యలపై హోంమంత్రిని సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేశారు నెటిజన్లు.. దీని కంటే ముందు విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో లైంగిక దాడి ఘటన సమయంలోనూ వనిత వెంటనే స్పందిచ లేదు. చంద్రబాబు ఆస్పత్రికి వెళ్లి బాధితురాలిని పరామర్శిస్తే.. మేడమ్ పట్టించుకోకుండా నియోజకవర్గంలోనే ఉన్నారట. దీంతో కంగారుపడిన పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఫోన్ చేసి వెంటనే హాస్పటల్ కు వెళ్లమని ఆదేశాలు ఇచ్చారట. తీరా వెళ్లి పరిస్థితిని చక్కబెట్టే ప్రయత్నం కంటే మరో రెండు రాళ్లు వేయించుకునేటట్టు కామెంట్ చేశారు హోంమంత్రి.
తాజాగా మళ్లీ మేడమ్ నోరు జారారు. ఓ మతపరమైన కార్యక్రమానికి హాజరైన మంత్రి వనిత రేపల్లే అత్యాచార సంఘటన పై స్పందిస్తూ ఇటువంటి సంఘటనలు అప్పుడప్పుడూ జరుగుతూ ఉంటాయని, నిందితులు రేప్ చేసే ఉద్దేశంతో రాలేదని ఈజీగా కామెంట్ పాస్ చేశారు.
మొత్తానికి సున్నితమైన, రాజకీయంగా ప్రభావం పడే ఘటనలను హ్యాండిల్ చేయటంలో తానేటి వనిత సక్సెస్ కాలేకపోతున్నారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోందట. మంత్రికి శాఖ బరువుగా మారిందనేది పార్టీ సర్కిల్స్‌లో నడుస్తున్న చర్చ. మరి.. మంత్రిని గాడిలో పెట్టేందుకు పార్టీ ఎలాంటి జాగ్రత్తలు సూచిస్తుందో చూడాలి.