ఆ ముగ్గురు పార్టీని వాడేసుకున్నారని అనుమానం వచ్చిందా? వస్తాం అనగానే వచ్చేయ్యండని కండువాలు కప్పేసిన ఆ పెద్ద పార్టీ ఇప్పుడు వారిని దూరంగా పెడుతోందా? ఇంట్లోనే కట్టేసుకోవాలని చూస్తోందా?
బీజేపీతో ముగ్గురు ఎంపీలు అంటీముట్టనట్టు ఉంటున్నారా?
సాధారణ ఎన్నికలు అయ్యి అవగానే టీడీపీలో ఓ వెలుగు వెలిన రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సిఎం రమేష్, టి.జి. వెంకటేష్ బీజేపీలో చేరిపోయారు. బీజేపీ వాళ్లతో ఏం ఒప్పందం చేసుకుందో… లేక వాళ్లే బీజేపీతో ఒప్పందం చేసుకున్నారో కానీ… కండువాలు కప్పేసుకోవడం జరిగిపోయింది. ఈ ముగ్గురూ వారి సొంత అవసరాల కోసమే పార్టీలో షెల్టర్ తీసుకున్నారని వారి చేరికను.. వాళ్లను వ్యతిరేకిస్తూనే ఉంది బీజేపీలోని ఓ వర్గం. మొదట్లో మేమంటేనే బీజేపీ… బీజేపీ అంటేనే మేమే అన్నట్టు కలిసిమెలిసిపోయిన ఆ ముగ్గురు తర్వాతర్వాత అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్నారు.
బీజేపీ నుంచి ఆహ్వానాలు వెళ్లడం లేదా?
అమరావతినే రాజధానిగా కొనసాగించాలనే విషయంలో సుజనా చౌదరి గట్టిపట్టుదలతో ఉండేవారు. కానీ బీజేపీ దానికి అటూ ఇటూగా ఉండేది. ఆయన ఒకటి మాట్లాడితే జీవీఎల్ లాంటి వాళ్లు ఆయనకు వ్యతిరేకంగా మరొకటి మాట్లాడేవారు. దీంతో గ్యాప్ పెరిగింది. సీఎం రమేష్, టీజీలదీ అదే పరిస్థితి. కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన ఆహ్వానాలు కూడా వారికి అందడం లేదట. వాళ్లపై అంతర్గతంగా తప్ప… బహిరంగంగా ఇప్పటి వరకు నేతలెవరూ మాట్లాడలేదు.
బీజేపీని పార్కింగ్‌లా వాడేస్తున్నారని సునీల్ దేవధర్ కామెంట్..!
సునీల్ దేవధర్‌పై ఢిల్లీ పెద్దలకు ఎంపీల ఫిర్యాదు?
ఏపీ బీజేపీ కో ఇంఛార్జ్ సునీల్ దేవధర్ ఈ మధ్య ఈ గుప్పెట విప్పేశారు. ఓ ముగ్గరు నేతలు పార్టీని పార్కింగ్‌లా వాడేస్తున్నారని నేతల సమావేశంలో అనేశారట. అంతేకాదు.. వారి కార్లకు పంక్చర్ చేసి ఇక్కడ నుంచి కదలకుండా చేసేస్తాం అని ఘాటు వ్యాఖ్యలు చేశారట. ఆ వెంటనే ఆ సమాచారం ఆ ముగ్గురికి వెళ్లడం… దాని మీద వాళ్లు ఎంక్వైరీ చేసుకోవడం జరిగిపోయాయట. పార్టీ కోసం పార్టీలో చేరితే మమ్మల్ని అలా అని అవమానిస్తారా? అంటూ ఢిల్లీకి ఫిర్యాదులు చేశారట. హైకమాండ్ నుంచి ఎలాంటి స్పందన వచ్చిందో తెలియదు కానీ… ఆ ముగ్గురికి పార్టీతో మరింత గ్యాప్ పెంచేశారు దేవధర్.
ఢిల్లీ పెద్దలు దేవధర్ అభిప్రాయంతో ఏకీభవిస్తుందా.. లేదా?
దేవధర్ వ్యాఖ్యలపై ఎంపీలు చేసిన కంప్లైంట్‌ను హైకమాండ్ ఎలా చూస్తుందో చూడాలి. పార్టీ కూడా దేవధర్ అభిప్రాయంతో ఏకీభవిస్తోందా? లేక ఆయన్నే తప్పుపడుతుందా? అనేది తేలితే…. ఎవరి ప్రయార్టీ ఏంటో తెలిపిసోతుంది. ఒకవేళ హైకమాండ్ ఎంపీల ఫిర్యాదును పట్టించుకోకుంటే… ఢిల్లీ వాళ్లు కూడా పార్కింగ్ ఫీలింగ్ తోనే ఉన్నట్టేనట.