నందికొట్కూరులో ఎమ్మెల్యే ఆర్థర్, వైసీపీ ఇంఛార్జ్, శాప్ ఛైర్మన్‌గా ఉన్న బైరెడ్డి సిద్దార్థరెడ్డి మధ్య తారాస్థాయిలో విభేదాలు ఉన్న సంగతి బహిరంగ రహస్యమే. ఎన్ని విభేదాలు ఉన్నా ఇద్దరూ పార్టీ కార్యక్రమాలతోపాటు.. ప్రభుత్వ ప్రొగ్రామ్స్‌లో చురుకుగా పాల్గొనేవారు. అయితే నాలుగు నెలలుగా సిద్దార్థరెడ్డి వైఖరిలో మార్పు వచ్చిందని వైసీపీ కేడర్ చెవులు కొరుక్కుంటోందట. ఎందుకలా అనే దానిపై పార్టీ నేతలు ఆరా తీస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో సిద్దార్థరెడ్డి భేటీ అయ్యారనే దానిపై హాట్ హాట్ డిస్కషన్ జరుగుతోంది. ఈ సందర్భంగా జరిగిన చర్చల్లో శ్రీశైలం, నందికొట్కూరు, పాణ్యం నియోజకవర్గాల బాధ్యతలు తీసుకుంటానని లోకేష్‌తో సిద్దార్థరెడ్డి చెప్పినట్టుగా ప్రచారం జోరందుకుంది. దీంతో లోకల్ పాలిటిక్స్ ఒక్కసారిగా వేడెక్కాయి.
వాస్తవంగా నందికొట్కూరు నియోజకవర్గంలో సిద్దార్థరెడ్డి చాలా యాక్టివ్. ఆ మధ్య మిడుతూరు మండలం నాగలూటిలో ఎమ్మెల్యే ఆర్థర్ లేకుండానే ఇంఛార్జ్ మంత్రితో కలిసి ప్రారంభోత్సవాలు చేశారు. దానిపై వివాదం రేగడంతో వైసీపీలో పెద్ద పంచాయితీనే జరిగిందట. ఆ ఘటన తర్వాత వైసీపీలో సిద్దార్థరెడ్డి చురుకైన పాత్ర పోషించడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీతోపాటు.. ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ ఆయన అంటీముట్టనట్టు ఉంటున్నారట.
అయితే టీడీపీ పెద్దలతో మాట్లాడిన తర్వాత సైలెంట్ అయ్యారనే ప్రచారాన్ని సిద్దార్థరెడ్డి వర్గం ఖండిస్తోంది. వైసీపీ అధికారంలో ఉంది.. సీఎం జగన్ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇలాంటి సమయంలో టీడీపీలో చేరాల్సిన అవసరం ఏముందని సిద్దార్థరెడ్డి వర్గం గట్టిగానే వాదిస్తోంది. కానీ.. చంద్రబాబుతో సిద్దార్థరెడ్డి ఫోన్‌లో మాట్లాడినట్టు ఆ మధ్య సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. యువతనే ఇమేజ్‌ను చూసి టీడీపీ నాయకులే ఆసక్తి చూపిస్తున్నారని మరో వర్గం ప్రచారం ప్రారంభించేసింది.
తాజా పరిణామాలు ఒక్క వైసీపీలోనే కాదు.. లోకల్ టీడీపీ శిబిరంలోనూ గుబులు రేపుతున్నాయి. ఒక విధంగా టీడీపీలో అగ్గిరాజేస్తున్నట్టు తెలుస్తోంది. సిద్దార్థరెడ్డి ఎంట్రీ ఇస్తే.. ఎగ్జిట్ కావడానికి మరో వర్గం రెడీ అయిపోయిందట. నంద్యాల పార్లమెంట్ టీడీపీ ఇంచార్జ్‌గా గౌరు వెంకటరెడ్డి కొనసాగుతున్నారు. బైరెడ్డి సిద్దార్థరెడ్డి టీడీపీ కండువా కప్పుకొంటే.. టీడీపీకి గుడ్‌బై చెప్పే ఆలోచనలో ఉన్నారట గౌరు వెంకటరెడ్డి, చరిత దంపతులు. గౌరు చరిత గతంలో పాణ్యం ఎమ్మెల్యేగా ఉన్నారు. 2019 ఎన్నికల సమయంలో వైసీపీ టికెట్ ఖరారు చేయదనే అనుమానంతో ఆ పార్టీకి రాజీనామా చేసి.. టీడీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో పాణ్యంలో టీడీపీ అభ్యర్థిగా చరిత పోటీ చేసినా ఓడిపోయారు. అలాగే గత లోక్‌సభ ఎన్నికల్లో నంద్యాల నుంచి పోటీ చేసిన శివానందరెడ్డి సైతం వెంకటరెడ్డి బంధువే. ఇదే శివానందరెడ్డికి నందికొట్కూరు టీడీపీ ఇంఛార్జ్ గా బాధ్యతలు అప్పగించినా పెద్దగా పనిచేయడం లేదనే అభిప్రాయంతో.. గౌరు వెంకటరెడ్డికే ఆ నియోజకవర్గాన్ని అప్పగించారు. ఈ స్థాయిలో నందికొట్కూరు నియోజకవర్గంలో రాజకీయ వేడి ఉన్న తరుణంలో సిద్దార్ధరెడ్డి ఎపిసోడ్ పొలిటికల్ టెంపరేచర్ పెంచేస్తోంది. మరి.. ఏం జరుగుతుందో చూడాలి.
Watch Here : https://youtu.be/FrONifZoYSk