Off The Record: కింది స్థాయి కార్యకర్తల వీధి పోరులో కాంగ్రెస్ రాష్ట్ర పెద్దల జోక్యంతో మొత్తం రచ్చ రచ్చ అయిందా? చిన్న వివాదంలో పెద్ద నేతలు ఎందుకు కల్పించుకోవాల్సి వచ్చింది? అధికారంలో ఉండి కూడా… కాంగ్రెస్ నేతల్ని పోలీసులు ఎందుకు అదుపులోకి తీసుకున్నారు? ఎక్కడ జరిగిందా తంతు? సిల్లీ విషయంలో సీరియస్‌గా తలపడ్డ ఆ ఇద్దరు పెద్ద నాయకులు ఎవరు?
Read Also: UP: రెచ్చిపోతున్న దోపిడీ దొంగలు.. డెలివరీ ఏజెంట్ల వేషంలో జువెల్లరీ షాప్‌లోకి దూరి..
నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తల మధ్య పంచాయతీ.. చినికి చినికి గాలి వానలా మారి ఒక రకంగా జిల్లా పార్టీనే షేక్ చేస్తోంది. ఓ ముఖ్య నేత సన్నిహితుడు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కగా.. మరో ముఖ్య నేత సన్నిహితుని కుమారుడిని ఏకంగా అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యవహారం అధికార పార్టీలో తీవ్ర అలజడి రేపుతోందట. సంస్ధాగత పదవుల కోసం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో.. ఆశావాహులతో సమావేశం ఏర్పాటు చేశారు. నిజామాబాద్ నగర కాంగ్రెస్ ప్రెసిడెంట్ పదవి కోసం జిల్లా గ్రంథాలయ సంస్ధ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి కుమారుడు విజయ్ పాల్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సన్నిహితుడు ఆకుల మహేందర్ పట్టుబట్టడంతో.. పీటముడి పడి.. మేటర్ ఎట్నుంచి ఎటో వెళ్ళిపోయింది. అటు రాజిరెడ్డి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు కావడంతో… ఇద్దరు పెద్దలు ఢీ అంటే ఢీ అనే పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలోనే రెండు వర్గాల కార్యకర్తల మధ్య మాటామాటా పెరిగి గల్లాలు పట్టుకునే వరకు వెళ్లిందట. ఆ ఎపిసోడ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు మహేష్ గౌడ్ సన్నిహితుడు మహేందర్.
Read Also: Bananas: అరటి పండు మంచిదే.. కానీ ఇలా తింటే చాలా ప్రమాదం..!
అధికార పార్టీలో అంతర్గత వివాదం కదా.. మనమెందుకు అనవసరంగా ఆవేశపడటం.. వదిలేస్తే వాళ్ళే సర్దుకుంటారులే అన్నట్టుగా ముందు కేసును లైట్ తీసుకున్నారట పోలీసులు. కానీ… పీసీసీ అధ్యక్షుడి ఫోన్‌తో అలర్ట్ అయిపోయి.. గ్రంధాలయ సంస్ధ చైర్మన్ కుమారుడిని అదుపులో తీసుకుని పోలీస్ స్టేషన్ తరలించారు. దీంతో ఆయన హర్ట్ అయిపోయారట. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఉన్నాసరే… పట్టించుకోకుండా తన కొడుకుని అదుపులో తీసుకోవడం ఏంటంటూ నొచ్చుకున్న గ్రంథాలయ సంస్ధ చైర్మన్ రాజిరెడ్డి ఓ దశలో రాజీనామాకు సిద్దపడ్డట్టు సమాచారం. ఈ వ్యవహారం అటు పోలీసుల్ని కూడా ఇరకాటంలోకి నెట్టిందట. చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని పీసీసీ అధ్యక్షుడు, రాజీ కుదిర్చి కేసు వెనక్కి తీసుకునేలా చేయాలని మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి పట్టుబట్టడంతో ఎటూ పాలుపోక పోలీసులు తలలు పట్టుకున్నట్టు తెలిసింది.
Read Also: Off The Record: రామ్మోహన్ నాయుడు మాటలన్నీ పైపై డబులేనా..?
ఈ వ్యవహారంపై దాదాపు ఐదు గంటల పాటు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో హైడ్రామా నడిచింది. చివరికి నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్ కేశ వేణు రంగంలోకి దిగి.. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌కు నచ్చజెప్పడంతో ఆయన శాంతించారట. దీంతో వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది. కానీ గంటల తరబడి పోలీస్ స్టేషన్లో పడిగాపులు పడటం అధికార పార్టీ నేతలకు నచ్చలేదట. కానీ…ఇద్దరు ముఖ్య నేతల సన్నిహితుల పంచాయతీతో.. నేతల మధ్య గ్యాప్ మరో సారి బయట పడిందంటున్నారు పొలిటికల్ పరిశీలకులు. ఇందూరు కాంగ్రెస్ లో నేతల మధ్య ఆధిపత్య పోరుకు ఇదో చిన్న ఉదాహరణ అంటోంది కేడర్. త్వరలో స్థానిక సంస్ధల ఎన్నికలు జరగబోతున్న క్రమంలో… నేతల ఆధిపత్య పోరు ఎక్కడి దారి తీస్తుందోనన్న టెన్షన్ కేడర్‌లో పెరుగుతోంది. ఈ ఇష్యూలో సాక్షాత్తు పీసీసీ అధ్యక్షుడు ఇన్వాల్వ్ అవడం కలవరం కలిగిస్తోందని అంటున్నారు. ద్వితీయ శ్రేణి నాయకుడి మధ్యవర్తిత్వంతో… ప్రస్తుతానికి చేతులు కలిసినా…. ఎన్నికల టైంలో మనసులు కలుస్తాయో లేదోనన్నది పొలిటికల్ పండిట్స్ డౌట్.